అత్తా అల్లుడు, మధ్యలో మామ… లక్ష్మీ పార్వతి చిటికేసి పిలిస్తే బాబు వాలిపోయారు … ఆ పార్టీ ఆంతరంగికులు అంతా ఒకే పత్రిక వాళ్ళు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు –
———————————–
1994 వరంగల్ లో టీడీపీ సమావేశం . వేదికపై ఒక వైపు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఉంటే అదే వేదిక చివరి వైపు చంద్రబాబు . లక్ష్మీ పార్వతి వేలు చూపుతూ పిలవగానే చంద్రబాబు పరిగెత్తుకెళ్లారు . ఆమె ఏదో చెబుతుంటే చెవి ఒగ్గి, విని, తల ఊపి, తిరిగి తన స్థానంలోకి వచ్చి కూర్చున్నారు . ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి జంట ఓ వెలుగు వెలిగిపోతున్న సమయంలో చూసిన దృశ్యం ఇది . ఎంత రాజకీయం అయినా , వారి కుటుంబంలో అందరూ రాజకీయ నాయకులే అయినా ఆ దృశ్యం ఎందుకో నచ్చలేదు . ఎంతైనా ఆమె అత్త , అతను అల్లుడు అలా పిలవడం ఏమిటి అనిపించింది . అత్త పిలుపులో అజ్ఞానం ఉందని , అల్లుడు అలా పరుగెత్తడంలో రాజకీయం దాగుందని చాలా కాలం తరువాత కానీ అర్థం కాలేదు .
Ads
*****
ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల వైభోగం అలా వెలిగిపోతున్నప్పుడు చిత్రంగా ఆ కుటుంబంలో నాయకులు అందరికీ ఆంధ్రజ్యోతి వారే అంతరంగికులుగా ఉండేవారు . ఎన్టీఆర్ , లక్ష్మీ పార్వతి , చంద్రబాబు నాయుడు , దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రధానంగా నలుగురు పవర్ సెంటర్స్ గా ఉండేవారు . వీరిలో ఒకరంటే ఒకరికి పడక పోవచ్చు కానీ చిత్రంగా వీరందరికీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ లే ఒక్కొక్కరికి ఒకరు ఆంతరంగికులు . వారితో మనసు విప్పి మాట్లాడుకునేవారు .
ఎంత గొప్ప రిపోర్టర్ అయినా , ఎంత సీనియర్ రిపోర్టర్ అయినా నాయకులు మనసు విప్పి తమతో పంచుకున్న విషయాలు ఆఫీస్ కు వెళ్లి ఎడిటర్ వద్ద మనసు విప్పి చెప్పాల్సిందే . అంటే లక్ష్మీ పార్వతి , దగ్గుబాటి వంటి వారు మనసు విప్పి మాట్లాడిన విషయాలు ఎడిటర్ వెంకట్రావుకు చేరే అవకాశాలు ఉంటాయి . యేవో కొన్ని ఎడిట్ అయిన విషయాలు తప్ప . వెంకట్రావు చంద్రబాబుకు ఆంతరంగికులు .
పూర్వం రాజుల కాలంలో సైన్యాధ్యక్షుడు రాజు మీద కుట్ర పన్ని తన వారినే రాజు వద్ద అంతరంగికులుగా చేర్చినట్టు చిన్నప్పుడు కథల్లో చదివాను , రిపోర్టర్ ను అయ్యాక స్వయంగా చూశాను . ఎన్టీఆర్ ను బాబు గద్దె దించడాన్ని వెంకట్రావు సమర్ధిస్తూ రక్తపాతం లేకుండా ప్రశాంతంగా అధికార మార్పిడి జరిగింది అని మెచ్చుకున్నారు . ప్రజాస్వామ్యంలో వెన్నుపోట్లు ఉంటాయి కానీ రక్తపాతం ఎందుకుంటుంది . ఒక్క చుక్క రక్తం కారకుండా గొంతు నులమడం ఉంటుంది కానీ రక్తం ఎందుకు పారుతుంది .
అధికారంలో ఉన్నప్పుడు ఈ కుటుంబం మొత్తానికి జ్యోతి రిపోర్టర్ లు అంతరంగికులు అయితే అధికారం పోయాక లక్ష్మి పార్వతికి ఆంధ్రభూమి వాళ్ళు అంతరంగికులుగా మారడం విచిత్రం . చిక్కడపల్లి లోకల్ రిపోర్టర్ మొదలుకొని చిక్కడపల్లిలో ఉండే ఎడిటర్ శాస్త్రి వరకు అందరూ లక్ష్మీ పార్వతికి అంతరంగికులుగా మారారు .
*****
అధికారం అంతా పోయి … మహాసామ్రాజ్యం కూలిపోయిన తరువాత కనిపించే దృశ్యం బంజారాహిల్స్ లో ఎన్టీఆర్ నివాసం వద్ద కనిపించేది . అలాంటి రోజుల్లో ఓ సమాచారం కోసం లక్ష్మీపార్వతి ఫోన్ చేసినప్పుడు వరంగల్ లో నేను చూసిన ఆనాటి సంఘటన గుర్తు చేశాను . అల్లుడిని అలా పిలవడం తప్పు కదా ? అని అడిగితే .. నువ్వు అదే చూశావు .. ఓసారి నేను ఎన్టీఆర్ విమానం దిగి వస్తుంటే నా సూట్ కేస్ పట్టుకొని వచ్చాడు తెలుసా అని చెప్పుకొచ్చారు . అందుకే అల్లుడు అక్కడున్నారు , మీరు ఇక్కడున్నారు అనుకున్నాను .
****
బాబు సీఎం అయ్యాక వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు . సామూహికంగా అందరితో ఒకేసారి మాట్లాడితే అది ప్రెస్ కాన్ఫరెన్స్ , అదే విషయాన్ని ఒక్కొక్కరికి విడిగా చెబితే అది ఇంటర్వ్యూ . ఇలా ఉండేది వారి ఇంటర్వ్యూ . మనం ఏం అడిగినా వారు చెప్పదలుచుకున్నది చెబుతారు . దీని వల్ల ఇంటర్వ్యూ అన్ని పత్రికల్లో ఒకేలా వచ్చేది . ఓ రోజు హిందూ రిపోర్టర్ నాతో నేను ఎక్కువ సమయం వేచి ఉండలేను , ఇద్దరం కలిసి వెళదాం సరేనా అంటే సరే అని వెళ్లాం .
నా ఒక్కరితో ఐతే ఆ మాట అనకపోయేవారేమో హిందూ రిపోర్టర్ ఉండడం వల్ల మనసు విప్పి ఒకే ఒక మాట చెప్పారు . లక్ష్మీ పార్వతికి కొద్దిగా నైనా రాజకీయం తెలిసి ఉంటే నా రాజకీయ జీవితం ఉండేది కాదు అని బాబు తన మనసులో మాట చెప్పారు . చిటికెలు వేసి పిలిచినా , సూట్ కేసు మోసినా లక్ష్మీపార్వతి తన విజయం అనుకున్నారు కానీ … బాబు మనసులో ఏ వ్యూహం రూపుదిద్దుకుంటుందో ఊహించలేక పోయారు .
అవమానాలు సహించిన వాడే బలంగా ప్రతీకారం తీర్చుకుంటాడు . ఒకవేళ నువ్వు బయటకు పంపాలి అనుకుంటే పంపించేయాలి . గిల్లుతూ గిచ్చుతూ కాలం వెళ్లబుచ్చుతుంటే ప్రతీకారంతో రగిలిపోయి సమయం వచ్చినప్పుడు కాటేస్తే, ఇక కోలుకోలేరు . లక్ష్మీపార్వతి గిచ్చితే , సమయం వచ్చినప్పుడు బాబు ఏకంగా కాటేశారు . రాజకీయం వైకుంఠపాళీ …. – బుద్దా మురళి
Share this Article