ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం? రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే… మరింత సమ ‘మత’ న్యాయం?
……………………………………….
మధ్యప్రదేశ్ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా అనుచరుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు కూల్చేయడంపై లౌకిక–ప్రజాతంత్ర భావాలున్న జనం విరుచుకుపడుతున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. సీఆర్ పీసీ సెక్షన్లను వర్తింప చేయడంలో ముస్లింలకో న్యాయం, హిందువులకో న్యాయం పాటించే ఉత్తరాది రాష్ట్ర బీజేపీ సర్కారు కాన్యకుబ్జ బ్రామ్మణ కుటుంబంలో పుట్టిన ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్లతో కూల్చేయడం ‘సమ న్యాయ పాలన’కు నిదర్శనమని సామాజిక న్యాయం విషయంలో ఫూలే–అంబేడ్కర్–లోహియా సిద్ధాంతాలు అభిమానించే కొందరు మేధావులు మరో పక్క పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Ads
అపరాధి ప్రవేశ్ తల్లిదండ్రులు తమ ఇంటిని కూల్చొద్దని వేడుకున్నా ఓబీసీ క్షత్రియుడైన సీఎం చౌహాన్ సర్కారు పోలీసులు ఆగలేదు. నిత్యం పూజాపునస్కారాలు జరిగే బ్రాహ్మల ఇంటినే ధ్వంసం చేశారు. ఇది పాపమనే ఆలోచన వారికి రాలేదు. అందుకే, ‘ ఈ అపరాధి (ప్రవేశ్ శుక్లా)పై ఎనెస్వో చట్టం ప్రయోగించాం. ఇల్లు నేలమట్టం చేశాం. అవసరమైతే నేరస్తులను నేల లోపల పది అడుగుల లోతుకు మామాజీ (చౌహాన్ జీకి జనం పెట్టుకున్న ముద్దుపేరు) ప్రభుత్వ తొక్కిపడేస్తుంది. ఇక మధ్యప్రదేశ్ లో నేరం చేయాలనుకునే అపరాధులు పదిసార్లు ఆలోచించకతప్పదు,’ అని సీఎం శివరాజ్ చౌహాన్ ట్వీట్ చేశారు.
దీనిపై బహుజన మేధావి, ప్రసిద్ధ రచయిత, పాత్రికేయుడు దిలీప్ మండల్ స్పందిస్తూ, ‘ ఆదివాసీపై మూత్రం పోసి అవమానించిన ఈ కేసులో అపరాధి ఇంటిపై బుల్డోజర్ నడిపించకపోయి ఉంటే.. మీరు సమదర్శి కాదనీ, అందరికీ సమన్యాయం చేసే బుద్ధి మీకు లేదని మేం భావించాల్సి వచ్చేది’ అని వ్యాఖ్యానించారు. మొత్తంమీద బుధవారం ఎంపీ సీఎం అయిన కిరాత క్షత్రియుడు చౌహాన్ తన పార్టీ బ్రామ్మణ ఎమ్మెల్యే అనుచరుడు శుక్లా చేతిలో తీవ్ర అవమానానికి గురైన ఆదివాసీ దశమత్ రావత్ కాళ్లు కడిగి ఓ బ్రామ్మణ యువ అపరాధి పాపాన్ని స్వయంగా ‘కడిగేశారు’. అదే అసలు సిసలు క్షత్రియ రాజపుత్రుడనని భావించే యోగీ ఆదిత్యనాథ్ ఇలా ఆదివాసీ పాదాలు కడిగి, నుదిటిపై తిలకం దిద్ది పూలదండ వేసేవారా? అంటే జవాబు చెప్పడం కష్టమేమీ కాదు.
మొన్న ఏప్రిల్ నెలలో యూపీకి చెందిన పేరుమోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని తమ్ముడిని ముగ్గురు యువకులు కాల్చిచంపారు. అప్పటికి రెండ్రోజుల ముందు అతీక్ కొడుకు అసద్ ను యూపీ సన్యాసి సీఎం యోగీ ఆదిత్యనాథ్ పంపిన పోలీసులు ఎదురుకాల్పుల్లో ఖూనీ చేశారు. తర్వాత జూన్ మొదటివారంలో యూపీలోనే అతీక్ అహ్మద్ స్థాయి గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ సన్నిహిత అనుచరుడు, షార్ప్ షూటర్ సంజీవ్ మాహేశ్వరీ ఉరఫ్ జీవాను కూడా ఎన్‌కౌంటర్లో యూపీ పోలీసులు అంతం చేశారు. ఈ సంజీవ్ జీవా రాజస్థానీ వైశ్యుల్లో ఉపకులమైన మాహేశ్వరీ కుటుంబంలో పుట్టాడు. ఇలా తాము నేరస్తులని భావించినవారు ముస్లింలైనా, హిందువులైనా–ఇంకా వివరంగా చెప్పాలంటే హిందువుల్లో వైశ్యులైనా, బ్రాహ్మణులైనా ఉపేక్షించకుండా మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ సర్కార్లు తమ పద్ధతిలో ‘శిక్షించడం’ బీజేపీ ‘సమ మత’ దృష్టికి అద్దంపడుతోంది. రేపు రాబోయే యూనిఫాం సివిల్ కోడ్ ను కూడా హిందువులకూ, ముస్లింలకూ ఇలా సీఆర్ పీసీ ఫక్కీలో ఏకరీతిన వర్తింపచేస్తారేమో!
Share this Article