KN Murthy… ఒకనాటి ప్రెస్ రూమ్ ముచ్చట్లు !! ఒకప్పుడు పాత సెక్రటేరియట్లోని ప్రెస్ రూమ్ పత్రికా విలేకర్లతో కళకళలాడుతుండేది . 1995 నుంచి 2010 వరకు ఎక్కువ సంఖ్యలో రిపోర్టర్స్ సెక్రటేరియట్ కి వస్తుండేవారు. కొంతమంది వారికి కేటాయించిన బీట్లకు చెందిన శాఖల కార్యదర్శులను, పీఆర్వోలను కలిసి అధికారికంగా , అనధికారికంగా సమాచారాన్ని సేకరిస్తుండేవారు. ఇంకొంతమంది కేవలం మంత్రుల ప్రెస్ మీట్లకు హాజరయ్యి వెళుతుండేవారు. వీరందరికి ఎవరి ప్రెస్ మీట్ ఏ టైంలో ఉండేదో తెలియజేసేందుకు ప్రెస్ రూమ్ నోటీసు బోర్డ్ లో నోటీసు అంటిస్తుండేవారు. ఇక్కడ కొచ్చిన వారు రిలాక్స్ అయ్యేందుకు ప్రెస్ రూమ్ లో సోఫాలు , కుర్చీలు ఉండేవి . చల్లటి వాటర్ కూలర్ కూడా ఉండేది .
అలాగే ఒక ఫోన్ ఉండేది. ఇది డైరెక్ట్ ఫోను కావడంతో ఎపుడూ బిజీగా ఉండేది . సచివాలయం టెలిఫోన్ ఆపరేటర్ తో సంబంధం లేకుండా నేరుగా ఎవరికైనా ఫోను చేసుకోవచ్చు. ఈ ఫోను కోసమే చాలామంది వచ్చేవాళ్ళు. చాలామంది గంటల తరబడి కూడా మాట్లాడుతుండేవారు. కొన్నిసార్లు ఫోన్ విషయంలో గొడవలు కూడా జరిగేవి.
ఇక విలేకర్లు చదువుకునేందుకు అన్ని పేపర్లు అందుబాటులో ఉండేవి . సమాచార శాఖ ఈ ఏర్పాట్లు చేసేది. ఈ ప్రెస్ రూమ్ మొదట్లో జీ బ్లాక్ లో ఉండేది. అక్కడ వెంకటయ్య అనే అటెండర్ ఉండేవాడు. డబ్బులిస్తే టీ, సిగరెట్లు తెచ్చి ఇస్తుండేవాడు. ఎక్కువమంది జర్నలిస్టులు స్మోకర్స్ కావడంతో ప్రెస్ రూమ్ సిగరెట్ కంపు కొడుతుండేది. నాన్ స్మోకర్స్ కొందరు ఇబ్బంది పడుతుండేవారు.
Ads
చాలామంది విలేకర్లు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇతరుల నుంచి సమాచారం తీసుకునే వారు. కొంతమంది ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని అక్కడే తినే వాళ్ళు. నేను క్యాంటీన్ నుంచి వేడి వేడి బజ్జీలు , పకోడీ తెప్పించుకుని, తీసుకెళ్లిన బాక్స్ లో భోజనం మిత్రులతో షేర్ చేసుకుని తినే వాడిని. సెక్రటేరియట్ లో ఒక సబ్సిడీ క్యాంటీన్ .. మరొక నాన్ సబ్సిడీ క్యాంటీన్ ఉండేవి. సబ్సిడీ క్యాంటీన్ లో చాలా చౌకగా టిఫిన్స్ దొరికేవి.
ఈ క్రమంలోనే కొంతమంది రాయని భాస్కరులు (వీరు ఏ పేపరో తెలీదు , దేనికి రాస్తారో తెలీదు ) కూడా ప్రెస్ రూమ్ కొచ్చేవారు. ఏదో ఒక పేపర్ పేరు చెప్పేవారు. ఆ పేర్లు కూడా తమాషాగా ఉండేవి. సీఎం, మంత్రుల ప్రెస్ మీట్స్ లో వీరి హడావుడే ఎక్కువగా ఉండేది. ముందు వరుసలో వెళ్లి కూర్చుండేవారు. రత్నకిశోర్ సమాచార శాఖ కమిషనర్ గా చేసినపుడు కొన్ని నిబంధనలు అమలు చేయాలనీ ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు.
చంద్రబాబు హయాంలో గంటల తరబడి వీడియో కాన్ఫరెన్స్ లు జరిగేవి . వీటికి కూడా మీడియాను పిలిచేవారు . చాలామంది కాసేపు కూర్చొని స్నాక్స్ తిని , టీ తాగి వెళ్ళిపోయేవారు . ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక రిపోర్టర్లు , కెమెరామెన్ల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. గోలగోలగా ప్రెస్ మీట్లు జరిగేవి .
జీ బ్లాక్ ను హెరిటేజ్ బిల్డింగ్ గా మార్చాక, కొత్తగా కట్టిన డి బ్లాక్ లోకి ప్రెస్ రూమ్ ని మార్చారు. వైఎస్ అధికార పగ్గాలు చేపట్టాక కూడా పెద్ద సంఖ్యలో విలేకర్లు ప్రెస్ రూమ్ కొచ్చే వారు. కేసీఆర్ అధికారంలోకొచ్చాక ప్రెస్ మీట్లు జరగడం తగ్గిపోయింది. మంత్రుల పీఆర్వోల ద్వారా వాట్సాప్ కే సమాచారం వస్తోంది. కేసీఆర్ సెక్రటేరియట్ కొచ్చి ప్రెస్ ను కలిసింది బహు తక్కువే.
ఇక ప్రెస్ రూమ్ ముందు అశోక చెట్లు ఉండేవి . వాటిని బోధి వృక్షాలని సరదాగా పిలుచుకునేవాళ్ళం . అక్కడ కూర్చొని రిపోర్టర్లు చర్చలు జరిపే వాళ్ళు . స్మోకర్లు తాగి వదిలిన సిగరెట్ పొగకు ఆ చెట్లు మసిబారి పోయాయి. కానీ ఈ చెట్ల కిందనే ఎన్నో సంచలన కథనాలకు బీజాలు పడ్డాయి.
ముందే చెప్పుకున్నట్టుగా ఇవన్నీ పాత సచివాలయం నాటి జ్ఞాపకాలు . పాత భవనాలను కూల్చివేసి సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని కట్టించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ గా ఉన్న ఆ విశాల భవనాలు ఇకపై కన్పించవు . 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పది బ్లాకుల్లో ఉన్న నాటి భవన సముదాయంలో పలువురు ముఖ్యమంత్రులు పాలన అందించారు. వీటిలో అతి పురాతనమైన జీ బ్లాకు ఆరవ నిజాం కాలంలో నిర్మితమైంది. ఈ ఫొటోలో మీకు కనిపించేది ఆ జీ బ్లాక్. ఇవన్నీ ఇపుడు ఫోటోలలో నిక్షిప్తమైనాయి. ఈ జీ బ్లాక్ లోనే మరి కొన్ని సంచలన సంఘటనలు జరిగాయి .. వాటి గురించి మరోమారు చెప్పుకుందాం. ఇక కొత్త సెక్రటరియేట్ లోకి మీడియా పర్సన్స్ కి ప్రవేశం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి…
Share this Article