Bharadwaja Rangavajhala…… మానవ సంబంధాలన్నీ… అను కథ… ( ఇది కేవలం కల్పితం… ఇందలి పాత్రలు పాత్రధారులు అందరు కూడా కల్పితం )
పొద్దున్న మెట్రో ప్రయాణం చేసా సరదాగా… నా పక్కన…సీట్లలో రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయినులు కూర్చున్నారు…
అనివార్యంగా వారి సంభాషణ నా చెవిన పడుతోంది.
Ads
తీర్థయాత్రల గురించిన సమాచారం మాట్లాడుకుంటున్నారు.
కాశీ వెళ్ళాం, ఇంకెక్కడికో వెళ్ళాం అని ఆల్రెడీ చూసొచ్చినావిడ చూడని మేడం కు వివరిస్తూన్నారు.
అచ్చు క్లాసులో పిల్లలకి చెప్పినట్టే…
దీనితో ఆటోమెటిక్ గా నేనూ అవతల సీట్లో కూర్చున్న వారు విద్యార్థులైపోయి వింటున్నాం…
ఇంక కాశీ వెళ్ళక్కర్లెద్దు…
గయ వెళ్ళక్కర్లెద్దు…
ఎక్కడెక్కడకి ఎలా వెళ్ళాలి ఎక్కడ దిగాలి…
ఇలా సమస్తం కళ్ళకు కట్టినట్టు ఆవిడ చెప్పేస్తున్నారు…
ఇవతలి టీచర్ గారు పరవశులై విన్నారు.
ముగింపు అయ్యాక…
మా ఇంట్లో లలితా సహస్రనామ పారాయణం పెడుతున్నా అని ఏదో డేట్ చెప్పారు … తీర్థయాత్రల గురించి చెప్పిన మేడం గారు…
వంటకు సహాయం రమ్మంటారా… పొద్దున్నే ఐదు గంటలకల్లా వచ్చేస్తాను మీ ఇంటికి…
అన్నారు భక్తి పారవశ్యంలో ఉన్న ఇవతలి మేడం గారు…
అబ్బే, మీకెందుకు శ్రమ అన్నారు వారు.
శ్రమ ఏముందండి, ఆయన కార్లో దించేస్తారు మీ ఇంటి దగ్గర, చక్కగా ప్రసాదాలు అన్నీ చేసుకుందాం…
అసలు మీరు ఇటు చూడనక్కర్లేదు… నేనూ సోషల్ మేడం హైమ గారూ చూసుకుంటాం అన్నీనూ, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు ఇవతలి మేడం…
ఆవిడకెందుకు శ్రమ అన్నారు అవతల మేడం
మా పక్కన ఇల్లేగా తను కూడా నాతో పాటు కార్లో వచ్చేస్తారు…
ఎందుకు వంట బ్రాహ్మల్ని చూస్తా అన్నారు మా వారు అందావిడ
అయ్యో, మేమందరం ఉండగా మళ్ళీ మీరు వంట బ్రాహ్మణులు అంటారేమిటి లైట్ గా కోప్పడ్డారు ఈవిడ…
భలే వారే… అయితే మీ అబ్బాయి పెళ్లికి నేనూ మీ ఇంటికి వచ్చి పనులు అందుకుంటా… కాదనకూడదు అని కండిషన్ పెట్టారు ఆవిడ…
ఇలా మాట్లాడుకుంటూనే
ఎస్ ఆర్ నగర్ దగ్గర దిగిపోయారు ఇద్దరూ…
వాన వెలిసినట్టు అనిపించింది…
అయితే….
ఇంకా ప్రేమలు ఆప్యాయతలూ ఒకళ్ళ కోసం మరొకరు పని అందుకోవడం ఉందండి…
నేనే అబ్బే మానవసంబంధాలన్నీ అంటూ ఉంటా అనుకున్నా.. మనసులో…
కానీ
ఆలోచిస్తే ఆవిడ వీళ్ళు చేయబోయే తీర్థయాత్రలకు గైడెన్స్ ఇచ్చారు కనకే ఈవిడ ఇంత ఆవేశం పడ్డారు అని సమాధానం చెప్పుకున్నాకానీ…
అది తప్పేమో అనిపించింది…
మొత్తానికి నేను కనెక్ట్ కావడానికి కారణం వాళ్ళు మాట్లాడుకుంటుంటే మా అత్తయ్యలూ పిన్నులు మాట్లాడుకున్నట్టే అనిపించడం…
మేము లేమూ అని ఇవతలి మేడం అవతలి టీచర్ గారికి భరోసా ఇవ్వడం నాకు బాగా నచ్చింది
….
Share this Article