Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టైంపాస్ పల్లీస్వామ్యం… వోటు విలువ- ప్రతినిధి విలువ… అంతా ఓ భ్రమ

July 11, 2023 by M S R

Jumping Japang: బాంబే చౌపట్టి బీచ్ ఒడ్డున సంధ్యా సమయం ఆహ్లాదకరంగా ఉంది. రోజంతా ఎంత గింజుకున్నా… కలవారి ఆకాశ హర్మ్యాలు దాటి…లేని వారి పూరి గుడిసెల మీద పడలేకపోయానే! అన్న దిగులుతో సూర్యుడు పడమటి అరేబియా సముద్రంలోకి దిగిపోతున్నాడు. వడా పావ్ లు తినాలన్న ఉబలాటం కొద్దీ అలలు చెలియలి కట్ట దాటి రావడానికి ఎగురుతూ…రాలేక వెనక్కు వెళుతున్నాయి. చౌపట్టి తీరంలో సిమెంటు దిమ్మెల మీద పల్లీలమ్ముకునే వారు మహారాష్ట్ర రాజకీయాల గురించి మరాఠీలో విసుగు విరామం లేకుండా మాట్లాడుకుంటున్నారు. అందులో ఈ మాటలు అటుగా వెళుతున్నవారి చెవిన పడ్డాయి!

ఏరా! మనం ఓటేసి గెలిపించినవారు ఓడిపోయారు. మనం ఓడించినవారు గెలిచారు. ఆ కాడికి మనం ఓట్లేయడమెందుకు?

ఒరేయ్! నీకు ప్రజాస్వామ్యం అర్థం కాలేదురా! ఏదో ఒక నియోజకవర్గంలో ఎవరో ఒకరు గెలిచారనుకో! వాళ్లు ఏ పార్టీ వారయినా అధికార పార్టీలోనే చేరిపోతారు. ఏకనాథ్ షిండే మొదట ఏ పార్టీ? ఏ పార్టీని చీల్చి…ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? అన్నది అనవసరం. ఆయన ఏ పార్టీ అయినా ఆ పార్టీలో ఇంత శాతానికి పైబడి చీలిస్తే అని ఏవో లెక్కలుంటాయి. అప్పుడది పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి రాదు. అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే రాజ్యాంగం ప్రకారం ఇంటి వరండాలో బాల్ ఠాక్రే ఫోటో ముందు కూర్చుని పల్లీలు ఒలుచుకుని తినాల్సిందే తప్ప…పబ్లిగ్గా ఏడవడానికి కూడా లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు.

Ads

అదేమిట్రా? మొన్నటి దాకా ఎన్ సీ పి ప్రతిపక్షంలో ఉంది కదా? ఇప్పుడు అదే ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం అయిపోయింది? పైగా తనదే అసలయిన పార్టీ అని అజిత్ పవార్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు?

మళ్లీ అదే అడుగుతున్నావు. అప్పుడు షిండే చేసిందే కదా? ఇప్పుడు అజిత్ పవార్ చేసింది? ఇందులో చాలా పెద్ద పెద్ద సంక్లిష్టమయిన రాజ్యాంగ విషయాలు ఉంటాయి. ఇలా పబ్లిగ్గా బీచుల్లో మాట్లాడకూడదు.

మరి…ఎక్కడ మాట్లాడాలి? చట్ట సభల్లోనా?

అక్కడ చట్టాలు చేయాలి. అంతే. మనలా పిచ్చి పిచ్చి చచ్చు పుచ్చు ప్రశ్నలతో మాట్లాడుకోకూడదు. అదొక పవిత్రమయిన ప్రజాస్వామ్య దేవాలయం. అదొక ప్రజాస్వామ్య సంవిధాన విధి విధానాల ప్రకారం జరిగే విధాన సభ.

ఓహో! అక్కడ ప్రజాస్వామ్య ధూప దీప నైవేద్యాలు ఉంటాయా?

అలా మాట్లాడకూడదు. సభా మర్యాద, సభా హక్కుల ఉల్లంఘన కింద నిన్ను నన్ను శాశ్వతంగా జైల్లో పెట్టేయగలరు..

మరి! ఎన్నికల సంఘం మాట్లాడుతుందా?

ఓట్లు వేయించడం వరకే వారి పని. ఫలితాల తాంబూలాలు ఇచ్చాక…పార్టీల పని. చట్ట సభల పని. సభాపతుల పని.

పోనీ…సుప్రీం కోర్టు మాట్లాడుతుందా?

…మాట్లాడుతోంది కదా? ఉద్ధవ్ ఠాక్రే కేసు సా ఆ ఆ …గుతోంది కదా!

అలాంటప్పుడు…సుప్రీం కోర్టు మాటా మంతి అయ్యే వరకు…ఆగచ్చు కదా?

…అంటే సభలో సభాపతిదే అంతిమ నిర్ణయం….కాబట్టి ఆ క్షణాన అలా జరిగిపోయి ఉంటుందేమో!

ఒకపక్క సభాపతిదే అంతిమ నిర్ణయం అంటావ్…మరో పక్క సుప్రీం కోర్టు మాట్లాడుతోంది అని అంటావ్? న్యాయమేదో తేలేలోపు అన్యాయం న్యాయంగా చలామణి అయితే…అది న్యాయానికి మంచిది కాదు కదా!

తప్పురా! న్యాయాన్యాయాలు, ప్రజాస్వామ్య విలువల గురించి మన లాంటి పల్లీలమ్మే వారు మాట్లాడుకోకూడదు.

మరి మనం ఏమి మాట్లాడుకోవాలి? పచ్చి పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు, వేయించిన పల్లీలు, పల్లీ చిక్కీలు, పల్లీ ఉండల గురించి మాత్రమే మాట్లాడుకోవాలా? ప్రజాస్వామ్యంలో పల్లీలమ్మే వారి ఓటుకు విలువ ఉన్నా… పల్లీలమ్మే వారి చర్చకు మాత్రం ఏ విలువ ఉండదు…అంతేగా నువ్ చెప్పేది?

ఏమోరా! నాకు తెలిసింది చెప్పాను. నాకు అర్థమయినట్లు చెప్పాను.

ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చిందిరా!

హమ్మయ్య! పోనీలే. బతికించావు. ఏదీ…ఒకసారి ఏమర్థమయిందో చెప్పు.

నీకు ప్రజాస్వామ్యం గురించి ఏమీ అర్థం కాలేదని…ఇంకెప్పటికీ అర్థం కాదని నాకు బాగా అర్థమయింది. మనం పల్లీలు అమ్ముకోవాలే కానీ…ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోకూడదని అర్థమయింది. ఓటు “విలువయినదే” కావచ్చు. కానీ…గెలిచిన ప్రతినిధి “విలువ” ముందు ఓటు “విలువ” నిలువ నీడ లేనిదవుతుందని…ఓటర్ల బాధ్యత ప్రతినిధులను ఎన్నుకోవడం వరకేనని…మనల్ను ఎవరు పరిపాలించాలనేది మనం వేసే ఓటు నిర్ణయించదని…మనకు వారు ప్రతినిధులు అన్న నిజం కంటే వారు అధికారానికి ప్రతినిధులు అన్నది ఇంకాస్త ఎక్కువ నిజమని…ఇంకా ఏదేదో అర్థమయ్యింది కానీ…ఈరోజుకు గంపలో పల్లీలు అయిపోయాయి కాబట్టి…మన ప్రజాస్వామ్య చర్చ ఇక్కడితో ఆపేస్తే…అటు విశాల ప్రజాస్వామ్యానికి- ఇటు వ్యక్తిగతంగా మనకు మంచిది…అంటూ లేచి ఖాళీ గంపలను నెత్తిన పెట్టుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

చీకట్లు దిగాయి. దీపాలు వెలిగాయి. బీచ్ ఎదురుగా అంతెత్తున గుర్రం మీద ఛత్రపతి శివాజీ చేతి కత్తి దీపాల వెలుగులో తళతళలాడుతోంది!
ఎందుకో?

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions