1988లో ఉషశ్రీ షష్టి పూర్తి సందర్భంగా అప్పటి ఉదయం దినపత్రిక సంపాదకులు కె. రామచంద్రమూర్తి తన గురించి రాయమని ఉషశ్రీని కోరటంతో ఆయన ‘రేడియోలో రెండు దశాబ్దాలు’ శీర్షికన ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం చదువుతుంటే, ఉన్నత వ్యక్తులకే ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురైతే, రేడియోనే వదిలేసి వెళ్లిపోతే, ఇక చిన్న కొలువుల్లో వారికి ఇది పెద్ద విషయం కాదేమో అనిపించింది. ఉద్యోగ జీవితంలో ఉషశ్రీతో ఆయన కూతురు పురాణపండ వైజయంతికి కూడా పోలిక ఉంది… ఈమె సాక్షిలో సఫరైంది… సాక్షిని వదిలింది…
ఆ శోకసాగర మధ్యలో నిర్లిప్తంగా సాక్షీభూతుడుగా డిమెల్లో గంభీరగళంతో వ్యాఖ్యానిస్తుంటే… ‘రేడియోలో ఉద్యోగం వస్తే యిలా ప్రత్యక్ష వ్యాఖ్యానం చెయ్యాలి’ అనుకున్నాను. నాలుగు దశాబ్దాల నాటి మాట అది. అయితే ఆ తరువాయి రెండు దశాబ్దాలు పూర్తికాకుండానే రేడియోలో చేరాను. చేరడానికి ముందు హైదరాబాదులో నాలుగైదు చోట్ల ఉద్యోగం వెలిగించాను. ఆరు నెలల కంటే ఎందులోనూ ఉండే ‘ఘటం’ కాదిది అనే కీర్తి సంపాదించాను.
రేడియోలో చేరుతున్నప్పుడు కూడా అందరితో పాటు నేనూ అదే అనుకున్నాను. కానీ రెండు దశాబ్దాలు దాటించాను. మూడు ప్రమోషన్లతో, మరో రెండేళ్లుండి ఇంకో ప్రమోషన్ కూడా అందుకోవలసినవాడినే కాని, నా పాటి ‘పదునైన నోరున్న’ వాడిని భరించగల అధికారుల యుగం చెల్లిపోవడం వల్ల స్వేచ్ఛా విహంగంలా తిరిగే అవకాశం రెండేళ్ల ముందే లభించినందుకు నాకు కలిగిన సంతోషం కంటే రేడియో అధికారుల చుట్టూ తిరిగేవారికి కలిగిన సంతోషాన్ని అక్షరాలు వ్యక్తం చెయ్యలేవు.
Ads
రేడియో ఉద్యోగంలో చేరింది 1965 లో … మొట్టమొదట రేడియోలో గొంతు వినిపించింది, 1952లోనే. పొట్ట చేత బట్టి హైదరాబాద్ చేరింది మొదలు నెలకో, రెండు నెలలకో నా యింటి అద్దెకు రేడియో వారే డబ్బులిచ్చేవారు. కథలో, కవిత్వమో, మరేదో, వ్రాయించి పలికింది.
వార్తలు చదివా..
ప్రాంతీయ వార్తా విభాగంలో – చక్కని కంఠం, స్పష్టమైన పలుకూ వున్న నళినీ మోహన్ సెలవు పెడితే, రోజువారి కూలి మీద నన్ను పిలిచారు.
తడబాటు లేకుండా ఒత్తులు, విసర్గలూ మింగకుండా పుంస్త్వం వున్న కంఠానికి రేడియో ప్రాధాన్యం వున్న రోజులవి. నేను వార్తా విభాగానికి వెళ్లిననాడే భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ కన్నుమూశారు. హైదరాబాద్‌లో వున్న మంత్రుల శ్రద్ధాంజలి రికార్డు చేయించాలన్నారు. అంటే ఏ మంత్రి ఏ శబ్దం పలకగలరో అవన్నీ గ్రహించి మనమే వ్రాసి తీసికెళ్లి నాలుగైదుసార్లు చదివించి, సాధ్యమైనంత తక్కువ దోషాలతో రికార్డు చేసి ప్రసారం చెయ్యాలి. అప్పుడు శ్రద్ధాంజలి పట్టినవారెవరూ ఈనాడు భూమి మీద లేరు, తెలుగు చదవడం రానివారూ ఇంగ్లీష్ వ్రాయడం రానివారూ మంత్రులైన కాలం అది.
చిన్ననాడే మా అమ్మగారు నాకు సుమతీ శతకం, వేమన శతకం, భాగవతంలో కొన్ని పద్యాలు నేర్పించడం వల్లనూ – హైస్కూలులో వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి దగ్గర బాలవ్యాకరణంతో నీతి చంద్రిక కంఠపాఠం చెయ్యడం వల్లనూ – నాకు వ్యావహారికం అంటే చులకన భావం సుష్టుగా ఉండేది. అయితే ఈ శతాబ్దంలో మేరుగిరుల వలె నిలిచిన విశ్వనాథ, శ్రీశ్రీ, వేదుల, రామిరెడ్డి ఆదిగా గల మంచి ‘పలుకున్న’ వారి కవితల రుచి ఆ రోజుల్లోనే ఇంద్రగంటి చూపించడం వల్ల భాష మీద కొంత వ్యామోహం ఉండేది.
కాలేజీ వదిలే నాటికే గ్రాంధిక వాసన దూరం అయినా భాష మీద మోహం యిప్పటికీ వదలలేదు – అని తెలుసు. నేను రాసిన వాక్యాలు చదవడం – అమాత్యవర్యులకు – నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డంత బాధ కలిగించింది. అది వేరే కథ. అలా రెండు వారాలు – ప్రాంతీయ వార్తలు, చదువుతున్నది – పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు – అంటూ యావదాంధ్రానికీ నా గొంతు అందించాను.
ఆ పదిహేను రోజులలో నా పనితనం చూసిన అప్పటి స్టేషన్ డైరెక్టర్ కృష్ణమూర్తి సూచించగా, రజని నా చేత ఉద్యోగానికి దరఖాస్తు చేయించారు. ఆ సమయంలో పుల్లెల వెంకటేశ్వర్లు తెర వెనక వుండి కథ నడిపించకపోతే నేను రేడియోకి దూరంగా ఏ ‘ఆంధ్రభూమి’లోనో అనువాద సమ్రాట్‌గా అణగారేవాడిని, అది మరో కథ.
రేడియోలో ఉద్యోగంలో చేరి పది నెలలు దాటకుండానే పాకిస్తాన్ దురాక్రమణ జరపడం, దేశం అంతా యథాశక్తి ఎవరికి తోచింది వారు విరాళంగా అందివ్వడం… ఆ సందర్భంగా లాల్‌బహదూర్ శాస్త్రి – మన ప్రధాని – యుద్ధనిధి కోసం హైదరాబాద్ వచ్చారు. లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యానం నడిపించడానికి ఎవరున్నారు అని డాక్టర్ అయ్యగారి వీరభద్రరావు అడిగితే, ‘రజని’ ‘పుల్లెల వెంకటేశ్వర్లు’ నా పేరు సూచించారు. రేడియో ఉద్యోగంలో చేరి పది పదకొండు నెలలే అయినా అప్పటికి రేడియోలో ముప్పాతిక మువ్వీసం – నా మీద అవిశ్వాస తీర్మానం నెగ్గించగలిగినంత మంది అహితులను తయారుచేసుకున్నాను. అదంతా నా ‘నోరు’ చేసుకున్న పుణ్యఫలం.
అంచేత అందరూ విముఖత చూపగా, అయ్యగారి వీరభద్రరావు ఆలోచించి – చూద్దాం, ఏం చేస్తాడో కుర్రవాడు అని సంతోషంతో ఆ ప్రత్యక్ష వ్యాఖ్యానం నాకు అప్పగించారు. నాకు పిఎస్‌ఆర్ ఆంజనేయశాస్త్రి సహకారగానం. ‘చేతిలో కాగితం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడగల శక్తి వున్నవాడే రేడియోలో రాణిస్తాడు. కాగితం ఎదురుగా వున్నా చదువుతున్న అనుమానం రాకుండా చెప్పగలవాడు రేడియోకి కావాలి’ అన్నారు డాక్టర్ రావు. అలా మొదటిసారి నా కోరిక ఫతేమైదాన్ స్టేడియంలో తీరింది.
అలా స్క్రిప్టు రైటర్‌గా ప్రవేశించి దశాబ్దాల పాటు కాగితం మీద కలం పెట్టకుండా రూపకాలు కూడా నడిపించాను. అటువంటి రూపకాలలో నాకు తగిన ధోరణిలో గొల్లపూడి మారుతీరావు, వి. సత్యనారాయణ, శ్రీమతి రతన్ ప్రసాద్ ఉండేవారు. 1969లో విజయవాడ వ్యవసాయ ప్రసార శాఖలో పనిచేసే జలసూత్రం కన్ను మూసిన కారణంగా ఏర్పడిన ఖాళీకి నా చేత దరఖాస్తు చేయించారు.
హైదరాబాద్ వదలడం నాకిష్టం లేదు. కాని పెద్దలంతా నా అభివృద్ధిని కోరి ఇంటర్వ్యూకి పంపారు. వ్యవసాయ శాఖాధికారులు నా మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూంటే – ‘‘అయ్యా, ఎందుకీ శ్రమ. నాకు వ్యవసాయ జ్ఞానం శూన్యం. అయినా రేడియోలో పనిచేసేవాడికి ఆ విషయం తెలియనవసరం లేదు. ఎందుకంటే మేము ప్రజలకు ఏం చెప్పాలి అనేది తమ వంటి శాస్త్రవేత్తలు ఇంగ్లీషులో మాకు పంపుతారు. ఎలా చెబితే సామాన్యుడికి అందుతుందో మాకు తెలుసు. తెలుసు కనకనే వైద్యశాస్త్రంలో ఓనమాలు రాకపోయినా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలలో నన్ను మించిన వాడు తెలుగులో లేడు’’ అన్నాను.
అప్పుడు విజయవాడ డైరెక్టర్ సుఖంగా నవ్వి ‘‘తెలిసిందా సార్. అదీ మా ఉద్యోగి బృందం శక్తి’’ అని ఆ ఉద్యోగం నాకు ఖరారు చేశారు. అప్పట్లో గుమ్మలూరి సత్యనారాయణ వ్యవసాయ విభాగం చూసేవారు. ఆయన నా సంగతి తెలిసినవాడు కనుక అప్పటికప్పుడు చెప్పాల్సిన అంశాలుంటే నన్నే స్టూడియోలోకి తోలేవారు.
భద్రాచల రాముడు…
రేడియో ఉద్యోగంలో సగర్వంగా చెప్పుకోగలిగినదీ, చెప్పవలసినదీ ఏదైనా ఉంటే ప్రత్యక్షవ్యాఖ్యానం మాత్రమే. ఆ విద్య తెలిసినవాడు కనుకనే పదవీ విరమణ చేసి పదేళ్లు దాటినా నేటికీ డిమెల్లోని పిలవక తప్పడం లేదు, ఢిల్లీ రేడియోకి. విజయవాడకి చేరిన కొన్ని నెలలకు భద్రాచల సీతారామకల్యాణం ప్రత్యక్షవ్యాఖ్యానానికి జమ్మలమడక మాధవరామశర్మతో నన్ను పంపడానికి శ్రీనివాసన్ సూచించారు.
అంతకుముందు ఏడాదికొకరు చొప్పున ఎవరెవరో వెళ్లారు. మళ్లీ వెళ్లే ధైర్యం వారికే లేకుండాపోయింది. ఉత్తుంగ శృంగాల నుండి రంగత్తుంగ తరంగాలలో ప్రవహించే గంగానదీ సదృశ వేగ గంభీర గళంతో సీతారామ కల్యాణాన్ని కనులకు కట్టించే శర్మ శంఖ ధ్వానం ముందు మరే కంఠమూ నిలబడదని అప్పటికే నాకు తెలుసు. అందుకోసమే పుట్టినవాడాయన. అప్పటికి సుమారుగా దశాబ్ద కాలం ఆ వ్యాఖ్యానాన్ని వింటూ తలవంచుకున్న నాకు ఆయన సరసన వెళ్లాలనేసరికి కొంచెం కొంచెం జంకు పుట్టకపోలేదు.
ప్రత్యక్ష వ్యాఖ్యానానికి నేను భయపడలేదు. అంత పాండిత్యం, అనుభవం ఉన్న మహనీయుని సరసన నిలబడడమా! చూద్దాం. దిగకుండానే లోతులకు భయపడితే ఈత నేర్చుకోలేం కదా అని నిర్భయంగానే భద్రాచలంలో దిగాను. సాయంకాలం కూర్చుని లోకాభిరామాయణం సాగిస్తూ:
‘‘శర్మ గారూ! రేపు నేనేంచేయాలి’’ అన్నాను. ‘‘అదేమిటీ, రేడియో అధికారులు మీరు చెప్పాలి’’ అని శర్మగారు అనగానే ఉలిక్కిపడి, తమాయించుకుని ‘‘తెలుగునాట ఈ విద్యకు మీకు ఆద్యులు. మీ సన్నిధికి శిష్యునిగా వచ్చాను’’ అన్నాను.
‘‘మీరెరగనిది కాదది. ఇదివరలో వచ్చిన రేడియో ఉద్యోగులకు దాశరథీ శతకం అప్పగించడమే వచ్చు. మీకు ప్రత్యక్ష వ్యాఖ్యానం వచ్చు. ఇక ముందు నా అవసరం ఉండదు’’
‘‘శర్మగారూ, ఇప్పుడు చెబుతున్నాను. రేడియోలో ఉన్నంతకాలం నా మాట వినే వివేకం గల అధికారులు బ్రతికినంతకాలం రాముడి పెళ్లి మీ నోటితోనే జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి. నేనేం చేయాలో!’’
‘‘ప్రతిభావంతులు, రేపక్కడ కూర్చున్నాక మీకే తెలుస్తుంది’’ అన్నారు.
ఇంతలో అక్కడకు కల్యాణమండపం రమణీయంగా నిర్మించిన గణపతి స్థపతి వచ్చి శర్మగారికి నమస్కరించగా, ఆయన నన్ను చూపించారు.
స్థపతిగారూ, మీ శిల్ప శక్తిని గురించి విన్నాను. కాని చూసే అవకాశం కలుగలేదు. అనగానే, నన్ను వెంటబెట్టుకుని కల్యాణమండపం దగ్గరకు తీసుకెళ్లి, అక్కడ తాను చిత్రించిన విజయనగర, కాకతీయ, చాళుక్య ఆది శిల్ప విశేషాలతో ఆ పీఠం చుట్టూ చేసిన విగ్రహ శిల్పాలను విశదం చేశారు.
హాయిగా గాలి పీల్చి, గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోయాను. మరునాడు కల్యాణమండప శిల్పాన్ని, స్వామి వారి ఊరేగింపును, జనసందోహాన్ని… ఇలా పైపై తంతు అంతా నా వంతుగా నడిపాను.
అలా మూడు సంవత్సరాలు ఆయనను పరిశీలిస్తూ వచ్చాను. అప్పటికి నాకూ ఆయన ప్రక్కన నిలబడగలననే ధీమా వచ్చింది. దశాబ్దం పాటు అలా భద్రాద్రి రాముడి పెళ్లి, మీ అందరి రేడియోలలోనూ కళ్లకుకట్టేటట్లు చెవులలో పోశా! శర్మ ప్రయాణం చేయలేని దశకు చేరేవరకు ఆయనను పిలుస్తూనే ఉంది రేడియో. ఇంతలో రజనీకాంతరావు డైరెక్టర్‌గా వచ్చారు. రేడియోకి మాత్రమే సాధ్యమైన ప్రత్యక్ష వ్యాఖ్యానం మరి కొందరికి కూడా శర్మ దగ్గరే శిక్షణ ఇవ్వాలి అన్నారు.
అప్పుడు ఏలూరిపాటి అనంతరామయ్య, జంధ్యాల మహతీశంకర్ లను అందుకు పిలిచాం. ఆ తరువాయి అధికారుల దృష్టి మారి పురాణం చెప్పుకునే వారినీ నాటక పద్యాలు రాగాలతో పాడేవారిని పంపి, సీతాకల్యాణం జరుగుతుంటే ఉత్తర రామచరిత్ర, శూర్పణఖ వర్ణన చేయించడం ఆరంభించారు. దానితో నేను భద్రాచలానికో నమస్కారం పెట్టి నగరాలలోని ఆలయాలలో రామాయణ ప్రవచనం ఆరంభించాను.
రజనీకాంతరావు హయాంలోనే రాజమహేంద్రవరం రోడ్డు – రైలు వంతెన ప్రారంభోత్సవానికి సత్యం శంకరమంచినీ నన్నూ పంపారు. శంకరమంచి రాజమండ్రి వైపున ఆగి నన్ను కొవ్వూరు పొమ్మన్నాడు. అయితే రాజమండ్రిలో వీరేశలింగం శిలావిగ్రహం దగ్గర నిలబడిన వ్యాఖ్యాతకు కావలసినంత విషయం దొరుకుతుంది. కాని భారత రాష్ట్రపతి రిబ్బన్ కత్తిరించి వంతెన ఎక్కగానే నిశ్చింతగా ‘అదిగో కొవ్వూరు ఒడ్డున మా ప్రతినిధి ఉషశ్రీ’ అని తప్పుకున్నాడు సత్యం.
ఆ శబ్దం వినిపించింది కానీ రాష్ట్రపతి ఏ కారులో బయలుదేరారు, ఎవరెవరున్నారు? ఇవేమీ లేవు. లేకపోతేనేం… రాష్ట్రపతి కొవ్వూరు చేరి రైలు వంతెన మీదకి చేరేవరకు అలా పాపికొండల నుంచి ఏటివార బంతి మొక్కల మధ్య పల్లె పడుచుల వరకు నా ప్రత్యక్ష వ్యాఖ్యానానికి విషయమే అయ్యింది. వ్యాఖ్యానం ముగించగానే విజయవాడ నుంచి టెలిఫోన్లోనే నన్ను అభినందించి, ఆశీర్వదించి, రజనీ శబ్దంతోనే ఆలింగనం చేసుకున్నారు. అదీ ‘‘అధికారి’’ లక్షణం!
గదిలో కూర్చుని….
జై ఆంధ్రా! ఉద్యమ సమయంలో గుండె ఆగి దేహయాత్ర చాలించిన ‘‘ఉక్కు కాకాని’’ అంతిమయాత్ర ప్రత్యక్ష వ్యాఖ్యానం కావాలన్నారు ‘రజనీ’. రేడియో కారు కనిపిస్తే తగలబెట్టే వేడిలో ఉన్నారు ఉద్యమకారులు. ఎలా చేస్తావో ఆలోచించు అన్నారు. సాధారణంగా విజయవాడలో అంతిమ యాత్రలు ఏ దారిన సాగుతాయో ఎరిగిన విషయమే. ఇక శవం ఎంతకు లేచిందో తెలుసుకున్నాను. స్టూడియో గదిలో కూర్చుని రికార్డింగు మొదలుపెట్టాను.
అడుగడుగునా కారు ఆగుతుంది. కన్నీటితో ప్రజలు, పూలమాలలు… పది నిమిషాలు కళ్లు మూసుకుని ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసి, ఈవలకు వచ్చేసరికి, బీసెంటు రోడ్డు నుంచి మా ఉద్యోగి ఒకడు వచ్చాడు. ఏమిటి విశేషం … అన్నాను. మోడరన్ కేఫ్ దగ్గరకు వచ్చేసరికి తెన్నేటి విశ్వనాథం అప్పుడే వచ్చి, ఆ వాహనం ఎక్కారు అన్నాడు. ఇంతకంటే ఏం కావాలి, అనుకుంటూ స్టూడియోలో అడుగుపెట్టి…
‘‘అదిగో కురువృద్ధులు తెన్నేటి విశ్వనాథంకన్నీరు కనిపించకుండా నిబ్బరంగా అందరినీ వెన్ను తడుతూ అంతిమయాత్ర సాగించే వాహనం అధిరోహించారు. తన సహచరుని భౌతిక కాయానికి అశ్రుతర్పణం అందించి, పూలమాల వేశారు. కారు సాగుతోంది, జనసముద్రం. ఆ సాగరంలో తాబేలులా నడుస్తోంది శకటం…’’ ఈ ధోరణిలో సాగించి, ఒక్క నిమిషం మిగిల్చాను. సరిగ్గా కృష్ణానది ఇసుక తిన్నెల మీద ఆ స్వాతంత్య్ర యోధుని దేహానికి నిప్పు పెట్టిన క్షణంలో ఆ వార్త అందుకుని,..
‘‘అదిగో ఉక్కు కాకాని దేహం పంచ భూతాలలో లీనమవుతున్నది. అందరూ విషాదవదనులై తలలు వంచి నిలబడ్డారు. మనం కూడా మౌనంగా ఉందాం’’ అని ముగించాను. శ్రోతలకే కాదు, రేడియోలో పనిచేసేవారికి కూడా ఇది ఆశ్చర్యం కలిగించింది. రేడియో మనిషి కనిపిస్తే కీళ్లు విరిచే సమయంలో ఆ జనంలోకి నేనెలా వెళ్లగలిగాననే సందేహం ఈనాటికీ తీరలేదు. ఇది అసలు రహస్యం.
ఇటువంటి ఇంద్రజాలాలు చేయొచ్చు రేడియోలో ఉంటే… అని ఈ తరం వారికి చెప్పడానికే ఈ ప్రస్తావన, అంతేకానీ ఇదేదో నా కిరీటం మీద తురాయి అని కాదు. వాస్తవానికి ఇది ఘనకార్యమూ కాదు. స్టూడియో గదిలో నుంచి చేసిన ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నవారిలో కొందరు ‘‘రజనీ’’కి అభినందనలు అందించారు టెలిఫోన్లో. ఆయన స్టూడియోలోకి వచ్చి, గాఢాలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు తుడుచుకున్నారు. అంత సుకుమార హృదయుడాయన. కనుకనే ఆయన హయాంలో విజయవాడ రేడియో కీర్తిపతాకం ఢిల్లీ దాకా ఎగిరింది. ఇప్పటికీ ఆ తరం యువకులు ఢిల్లీ బహుమానాలు అందుకుంటూనే ఉన్నారు. అప్పుడాయన ఇచ్చిన ప్రోత్సాహం అంతటిది.
తల వంచాను..
ఈనాడు తెలుగు నాట అనేకులకు తెలుసు.. నేను అహంకారిననీ, ఎవరికీ తలవంచననీ. ఈ పొగరుమోతు లక్షణం నాకు ప్రత్యక్షంగా అక్షరదీక్ష ఇచ్చిన వెంపరాల సూర్యనారాయణ శాస్త్రికి, నండూరి రామకృష్ణమాచార్య, దిగుమర్తి సీతారామస్వామి, దర్భా సర్వేశ్వర శాస్త్రి ఎవరి దగ్గరా లేదు. వీరంతా సౌమ్య స్వభావులే!
ఈ శతాబ్దపు సాహిత్య ద్రోణులు విశ్వనాథ వారి నుంచి సంక్రమించిన సుగుణం ఇది. ఆయన దగ్గర ఏనాడూ పాఠం చదువలేదు కానీ కాలేజీలో చేరిన క్రొత్తలో ఆయన ఉపన్యాసాలు వినడమూ, వినిపించడమూ చేశాను. ఆ క్షణాలలో ఆవహించింది. అయితే విద్వాంసులు, ప్రతిభా సంపన్నులు ఎదుట పడితే వినయంగా చేతులు జోడించాను, జోడిస్తున్నాను, నాడు నేడు… రేడియోలో నేను తల వంచి – కాదు – సాష్టాంగపడింది ఒకే ఒక్కరికి.
హైదరాబాద్ నుంచి బెజవాడ చేరిన నాలుగేళ్ల నాటి మాట. రికార్డింగు రూములో ఉన్నాను, ఏదో పని మీద. ప్రక్కనున్న రికార్డరు నుంచి వస్తున్న మాటలు వింటూ, నాలుగు నిమిషాలు నిలబడిపోయి… ‘‘ఈ ముసిలాడెవడో ఉషశ్రీ కంటె రేడియోని వాడుకుంటున్నాడే!’’ అన్నాను. రికార్డు చేస్తున్న శ్రీనివాసన్ నవ్వుతూ, నా భుజం తట్టి, ‘‘మీరే ఎరుగరా, అది దువ్వూరి వెంకటరమణశాస్త్రి గొంతు’’ అనగానే, రెండు చేతులూ జోడించి, మనసా అక్కడే నమస్కరించాను.
రికార్డింగు పూర్తి కాగానే స్టూడియోలోకి వెళ్లి, ‘‘అంగీరస బార్హస్పత్య భారద్వాజ… ’’ అంటూ ప్రవర చెప్పుకుని సాష్టాంగపడ్డాను. నా వెనకాలే వచ్చిన శ్రీనివాసన్… ‘‘శాస్త్రి గారూ, ఈయనే మీ ఉషశ్రీ’’ అన్నారు. ఆ క్షణంలో ఆయన నన్ను దగ్గరకు తీసుకుని, వెన్ను దువ్వుతూ, దీర్ఘాయుష్మాన్‌భవ! చిరంజీవీ, నువ్వే కదూ, మాధవ రాముడితో భద్రాచలంలో జానకమ్మ పెళ్లి కనులారా చూచి, మాకందరికీ చెవులతో చూపిస్తున్నావూ, చాలా సంతోషం. ఇంతకూ ఎవరి తాలూకు మనం?’’ అని ముసిముసి నవ్వులు నవ్వారు.
‘‘గోదావరికి ఆవల కాకరపర్రు అగ్రహారంలో పురాణపండవారి కుర్రవాణ్ని. వెంపరాల వారి శిష్య వంశం’’ అన్నాను. ‘‘అలా చెప్పు! అంత పునాది వుంది కనుకనే అంత ధీమా అన్నారు. డెబ్బయ్యో పడి దగ్గరవుతూన్న వయస్సు. నాల్గు దశాబ్దాలు బాలవ్యాకరణం పాఠం చెప్పిన వ్యక్తి. అంత అలవోకగా, ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లు రేడియో ప్రసంగం చెయ్యగల వ్యక్తిని అంతకుముందు చూడలేదు. ఈనాడు అవకాశం లేదు.
ఆ తరువాయి శ్రీనివాసన్ అన్నారు,
‘‘నేను అరవదేశం నుంచి వచ్చానని మీ వాళ్లకి నా మీద కోపం. కాని ఇందరు తెలుగువాళ్లు ఉండి ఇటువంటి వక్తను రేడియోకి రప్పించలేకపోయారు. నా జీవితంలో ఇటువంటి వారిని పట్టుకురావడం నాకు ఎంత తృప్తినిచ్చిందో…’’ అని ఆనంద బాష్పాలు విడిచారాయన. ‘‘మన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, చేతులు నలుపుతూ తిరిగేవారు కాదు రేడియోకి కావలసింది. మనం తిరగాలి. తిరిగి పట్టుకుని తీసుకురావాలి, దువ్వూరి వారి వంటి చక్కని ప్రసంగాలివ్వగలవారిని.
‘‘ఎవడో రాసి పెడతాడు. అది పూర్తిగా చదవడం రానివారు చాలామంది మన ద్వారా రేడియో పరువు తీస్తున్నారు. రేపు టీవీ వస్తే, వీరి మాటలతో, ముఖాలు కూడా హింసిస్తాయి ప్రజలను. అప్పటికి మనం బయటపడతాం’’ అన్నారు. అంతే జరిగింది. నేను చేసిందీ అదే – నా చుట్టూ తిరిగేవారికి కాక, నేను చుట్టూ తిరగవలసిన వారినే ప్రసంగాలకు పిలిచాను. పిలవనిచ్చారు రజనీ, శ్రీనివాసన్ వంటి డైరెక్టర్లు. భజనపరులకు అలవాటుపడిన అధికారుల ప్రవాహం ఆరంభమైంది. నన్ను రేడియో నుంచి విశ్రాంతి తీసుకోమన్నారు. ఉద్యోగం చేసినన్నాళ్లు ఎంత తృప్తిగా చేశానో, ఇంటికి పొమ్మన్నాక అంతకంటే తృప్తిగా ఉన్నాను. అదీ పరాత్పరుడు నాయందు చూపిన అనుగ్రహం! అందుకా శక్తికి వందనం!…. (09 – 03 – 1988లో ఉదయం దినపత్రికలో ప్రచురితం)
Share this Article