My First Crush In Telugu Journalism… గుబురు చెట్ల నీడల్లో పొగడ పూలు ఏరుకుంటున్న రోజులవి. నిజానికవి అక్షరాలు, నా దోసిట్లో మెరిసే నక్షత్రాలు. అవి నన్ను పిలిచేవి, నవ్వి రమ్మనేవి… ప్రేమించేవి.. మాధుర్యాన్ని పంచియిచ్చేవి. 1977 హైద్రాబాద్ ఈనాడులో తొలి రోజులవి. తెలుగు తక్కువ. ఇంగ్లీషు రాదు. అనువాదం తెలీదు. అలా అని పిచ్చి మొహాన్ని అనుకునేరు!
మందార మకరంద మాధుర్యమును గ్రోలు… అటజనికాంచె భూమీసురుడు… బాలరసాలసాల నవ పల్లవ కోమలమైన పద్యాలెన్నో వచ్చు నాకు. పోతన రుక్మిణీ కల్యాణమూ, ఎన్టీఆర్ కృష్ణపాండవీయమూ- రెండూ కలిసి ఉక్కిరిబిక్కిరి చేసేవి. ‘‘నమ్మితి నా మనమ్మున సనాతనులైన ఉమామహేశులన్…’’ అని జాజితీగలాంటి కే.ఆర్.విజయ పాడుతుంటే కరిగినీరై పోయేవాణ్ణి. అంతలోనే ప్లేటు ఫిరాయించేది రుక్మిణి. ‘‘నీవు భోగింపగా లేని తనులత వలన సౌఖ్యమేలా…’’ అంటూ పోస్ట్ మోడర్న్ ఫెమినిస్ట్ లాగా పేట్రేగిపోయేది.
అసలు పోతన గదా అల్ట్రా మోడర్న్ విప్లవకవి అని సరిపెట్టుకునే వాణ్ణి. ఆ బ్లాక్ అండ్ వైట్ కన్యాకుమారి కే.ఆర్.విజయకేమన్నా సహాయం చేయాలని మనసు కొట్టుకులాడేది. పొద్దున్నే నాలుగు యిడ్లీలూ, నెయ్యీ అల్లం పచ్చడీ రుక్మిణీకి యిచ్చి, తింటూ వుండు, నేనెళ్లి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి పిలుచుకొస్తానని… నా పేరు అగ్నిజ్యోతనుడుగా మార్చుకొని, పద్యాలు పాడుకుంటూ సముద్ర తీరాల వెంట పరుగులాంటి నడకతో వెళ్లాలనే తాపత్రయమేదో నన్ను తరుముతుండేది.
Ads
ఇటు కొత్త అక్షరాలేవో… పూలతోటలై పిలుస్తున్నట్టు… నా చుట్టూ వికసిస్తున్న wonder ని విభ్రాంతితో చూస్తూ, గుండెల్లో నింపుకుంటున్న తొలి వెన్నెల రుతువు అది.
ఈనాడు ఎడిటోరియల్ సెక్షన్ యవ్వనోత్సాహంతో నిండివుండేది. ఎక్కువ మంది 20-25 ఏళ్ల వాళ్లే. విలాసిని, రమాదేవి, కామేశ్వరి, సుష్మ, సరస్వతి, భారతి వార్తలు రాస్తుండేవాళ్లు. స్నేహంగా మెలిగేవాళ్లు. వాళ్లలో 95 శాతం మందికి రాయడం రాదని ఓ రోజు కంప్లెయింట్ చేశాను. ‘‘భలే వాడిలా వున్నావ్, నువ్వూరుకో, వాళ్ల వల్లే కదా కుర్రాళ్లంతా టైమ్ కి ఆఫీసుకొస్తున్నారు’’ అన్నారు మోటూరి వెంకటేశ్వరరావు. రాచమల్లు రామచంద్రారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి వచ్చి రాయడం, అనువాదాల గురించి చెప్పేవారు.
షిఫ్టు ఇంఛార్జి అని ఒకడు ఉంటాడు. ఆ రోజు పేపర్ ప్రొడ్యూస్ చేసే బాధ్యుడు. శ్రీకారం రామ్మోహన్ అనే వ్యక్తి ఆ పని చేస్తుండేవాడు. నొక్కుల జుత్తు, దళసరి కళ్లద్దాలతో ఆకర్షణీయంగా వుండేవాడు. నవ్వితే మరింత బావుండేవాడు. చక చకా రాసేవాడు. హెడ్డింగులు పెట్టేవాడు. ఏ డౌటు అడిగినా చెప్పేవాడు. తొలి రోజుల్లోనే అతని ప్రేమలో పడ్డాను. అతను గనక ఆడపిల్ల అయివుంటే సాయంకాలాలు టాంక్ బండ్ కి తీసుకెళ్లి mandatory పానీపురీ, ఛాట్ కొనిచ్చి… ‘‘ఈష్ లీబీ దీష్ ఐ లవ్ యూ, యా లుబ్ లూబా ఐ లవ్ యూ…’’ అంటూ రాజ్ కపూర్ లా పాటలు పాడేవాణ్ణి.
1977 ఆగస్టులో కావచ్చు.. తల యెత్తకుండా రాస్తున్నాడు శ్రీకారం రామ్మోహన్. వుంగరాల జుత్తు వూగుతోంది. పక్కకెళ్లి నించున్నాను. ఒక్క కొట్టివేత లేదు. మాటల కోసం వెతుక్కోవడం లేదు. దీక్షగా రాసుకుపోతున్నాడు. అప్పట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక తమిళ అధికారిని నియమించారు. అతను బాగా వోవర్ యాక్షన్ చేసి, ఉక్కు ఫ్యాక్టరీ పేరుని ‘ఇస్పాత్ నిగం’ అని మార్చాడు. తమిళుల్ని పిలిచి మరీ ఉద్యోగాలు యిచ్చాడు. తెలుగువాళ్లను గెటౌట్ అన్నాడు. ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి ప్రాణత్యాగాలు చేసినందుకు యిదా బహుమతి అంటూ ఆగ్రహ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ వార్తే రామ్మోహన్ రాస్తున్నాడు. ‘‘ఈ రోజు బేనర్ ఐటం యిదే’’ అన్నాడు… అంటే నన్ను కొద్దిసేపు వెయిట్ చేయమని. రాయడం ముగించాడు. మరో న్యూస్ ప్రింట్ కాగితం తీసుకుని,
‘‘ఇస్పాత్ నిగం- రొంబ తమిళ మయం’’ అని హెడ్డింగ్ పెట్టాడు. పదండి, మొదటి పేజీ పెడదాం అని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసికెళ్లాడు. ఇలా చాలా చమత్కారాలు చేసేవాడు. ఓసారి చాయ్ తాగుతున్నప్పుడు ‘‘నేను కథలు రాస్తుంటాను’’ అని చెప్పాడు. 1974లోనే, రామ్మోహన్ రాసిన ‘‘నేలక్లాసు’’ కథకి ఆంధ్రజ్యోతి వీక్లీ బహుమతి ఇచ్చింది.
ఆ కథ: ఒక అప్పర్ మిడిల్ క్లాస్ భార్య భర్త వుంటారు. ఓ రోజు సినిమాకి వెళ్తారు. బాల్కనీలో కూర్చుంటారు. లైట్లు ఆర్పేస్తారు. సినిమా మొదలవుతుంది. చీకట్లో తడుముకుంటూ వచ్చిన యిద్దరు వీళ్ల పక్క సీట్లో కూర్చుంటారు. యింట్రవెల్. లైట్లు వెలుగుతాయి. పక్కవాళ్లను చూసి భార్యా భర్త ఒక్కింత ఆశ్చర్యపోతారు. వాళ్లింటి పని మనిషి, ఆమె భర్త! అప్పర్ మిడిల్ క్లాసు వాళ్లిద్దరూ లేచి వెళిపోతారు. మిగిలిన సగం సినిమా చూడరు. అంతే కథ.
‘ నేల క్లాసు’ ఎవరు అని రచయిత ప్రశ్న!
1978లో న్యూజెర్సీ కథల పోటీలో ‘అటక మీద వీణ’ కథకి బహుమతి పొందాడు. ‘కడలి’ అనే సాహిత్య మాసపత్రికని రెండేళ్లు నడిపాడు. రామ్మోహన్ గురించి నాకు తెలిసింది అంతే!
ఆ తర్వాత… 20 సంవత్సరాలు దొర్లిపోయాయి. విశాఖ, తిరుపతి, విజయవాడ, హైద్రాబాదుల్లో ఉద్యోగం చేసినా నేను ఏనాడూ రామ్మోహన్ని కలవలేదు. ఫోనూ చెయ్యలేదు.
1998 మే నెల:
డెట్రాయిట్ లో జూలైలో జరిగే ‘ఆటా’ సభలకి ఆర్టిస్ట్ మోహన్, అల్లరి నవ్వుల హాస్య సంచిక ఒకటి ప్లాన్ చేశాడు. ‘‘చిరునవ్వు’’ దాని పేరు. అందులో కొన్ని మంచి కథలు వేయాలని అనుకున్నాం. అప్పుడు గుర్తొచ్చి రామ్మోహన్ కోసం ఎంక్వయిరీ చేశాను. భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ (NMDC)లో పీఆర్వో అని తెలిసింది. మాసబ్ టాంక్ లోని ఆఫీసుకి వెళ్లి కలిశాను. కాఫీ. చాలా కబుర్లు.
మీ కథ, ఫోటో కావాలన్నాను. యిచ్చాడు.
‘‘నాకు నచ్చేదీ, నన్ను ఉత్తేజ పరిచేదీ అతి సామాన్యమైనదైనా, అసాధారణమైనదైనా ఏ రకమైన అనుభూతి కలిగించినా దాన్ని వ్యక్తీకరించడం కోసం రాస్తాను. బుచ్చిబాబు, కొడవటిగంటి, మామ్, చెహోవ్ లు యిష్టం నాకు. విశ్వసాహిత్యం నుంచి చాలా నేర్చుకున్నాను. అది నాకెంతో మనోబలాన్నిచ్చింది. టీన్స్ లో ప్రతి వొక్కడూ ఆదర్శవాదే. కవీ, నక్సలైటు, ఎడిటర్… ఎవరైనా చివరికి సిస్టంలో పార్ట్ అయిపోయాక, దాన్నుంచి బెనిఫిట్ పొందుదామనే చూస్తాడు’’ అన్నాడు 30 కథలు రాసిన శ్రీకారం…
‘‘నేను మీకో చిన్న అడ్వర్ టైజ్ మెంట్ యివ్వగలను. మూడు వేల రూపాయలైతే నేనే శాంక్షన్ చేయగలను’’ అన్నాడు. ప్రింటయిన పత్రిక యిచ్చి, చెక్కు తీసుకోవాలని చెప్పాడు. ఓకే అన్నా.
‘‘చిరునవ్వు’’లో శ్రీకారం రామ్మోహన్ గురించి రాసి, ఫోటో వేసి, ‘‘శుభం’’ అనే అతని కథ పబ్లిష్ చేశాం. బహుశా జూన్ చివరి వారం. మల్టీ కలర్ లో మెరిసిపోతున్న ‘‘చిరునవ్వు’’ పత్రిక పట్టుకుని NMDC ఆఫీసుకు వెళ్లాను.
పీఆర్వో కేబిన్ డోర్ తెరిచే వుంది.
ఆయన లేడు. బైట ఒక అర డజను మంది క్లర్కులు వున్నారు. రామ్మోహన్ గారు లేరా? అనడిగాను. ఇద్దరు గుమస్తాలూ ఒకళ్లనొకళ్లు చూసుకున్నారు. జవాబు చెప్పలేదు.
ఇంత వోవర్ చేస్తున్నారేంటో అనుకుని శ్రీకారం రామ్మోహన్ గార్ని కలవడానికి వచ్చానండీ అన్నాను. నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడలేదు. నాకేమీ తోచలేదు. ఒక క్లర్కు లేచి బయటకి వెళ్లాడు.
ఒక అధికారి లోపలకి వచ్చాడు. ‘‘రండి’’ అంటూ
ఒక గదిలోకి తీసికెళ్లాడు. రామ్మోహన్ గారు చనిపోయారు అని చెప్పాడు.
ఒక విదేశీ ప్రతినిధుల బృందాన్ని రామ్మోహన్ కొన్ని రోజుల కిందట మధ్య ప్రదేశ్ తీసుకెళ్లాడు. నిన్న ఉదయం ఒక ఎత్తయిన కొండ మీద అంచులో నిలబడి విదేశీయులకు ఆ ప్రాంతం చూపిస్తూ, వివరిస్తూ వుండగా రాయి జారిందో, కాలు పట్టు తప్పిందో మరి, లోయలోకి పడిపోయాడు. అక్కడ బాడీని వెతికి వెలికితీయడం చాలా శ్రమ అయింది. ఇపుడు మేమంతా ఆయన బాడీ కోసం ఎదురు చూస్తున్నాం. కింద ఒక గదిలో రామ్మోహన్ గారి భార్యా, ఇద్దరు పిల్లలూ వెయిట్ చేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఇక్కడ నుంచి తిన్నగా వాళ్ల వూరు వెళతాం అని చెప్పాడు. ‘‘కూర్చోండి’’ అని చిరునవ్వు పత్రిక తీసుకుని ఒక కవరు నా చేతికిచ్చాడు. అందులో చెక్కు వుంది. ‘‘మీరొస్తే యిమ్మన్నారు’’ అన్నాడు అధికారి.
*** *** ***
కాలం ఎంత కర్కశమైంది!
పచ్చని చెట్టులాంటి మనిషి.
చేయి తిరిగిన కథా రచయిత.
నిజంగా ఇంకెప్పటికీ
శ్రీకారం రామ్మోహన్ ని చూళ్లేనా?
ఆ భార్య కన్నీళ్లని ఎవరు తుడవగలరు?
ఆ యిద్దరు బిడ్డల్నీ ఎవరు వోదార్చగలరు?
20 ఏళ్ల తర్వాత కలిసినందుకు నాకిదా ప్రతిఫలం?
*** *** ***
రామ్మోహన్ చనిపోయి 2023 జూన్ కి 25 సంవత్సరాలు అవుతోంది …. By…Taadi Prakash
Share this Article