Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేణుకా చౌదరి టోపీలో పంకా… వైఎస్ఆర్‌కు తలపాగా… జర్నలిస్టు జ్ఞాపకాలు…

July 14, 2023 by M S R

వైయస్ఆర్ కు తలపాగా – రేణుకా చౌదరి తలపై క్యాప్ లో ఫ్యాన్… అధికారమనే శక్తే నడిపిస్తుంది అన్నాను… జర్నలిస్ట్ జ్ఞాపకాలు –

—————————————-

‘‘ఎన్టీఆర్ వద్ద ఉన్నప్పుడు నేను ఎన్నో చూశాను . వైయస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పాను. ఇది సరైన సమయం కాదు, ఇప్పుడే పాదయాత్ర వద్దు . ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పాను. కానీ ఆయన వినలేదు .,,’’ – ఇది పర్వత నేని ఉపేంద్ర చెప్పిన మాట . మెదక్ జిల్లా జోగిపేట ప్రాంతంలో వైయస్ఆర్ పాదయాత్ర సాగుతున్నప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుతుంటే ఉపేంద్ర ఈ మాట చెప్పారు .

Ads

ఉపేంద్ర ఆ మాట చెబుతుంటే ఇతనేనా ఒకప్పుడు టీడీపీలో నంబర్ టూ అనిపించింది . ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పుతుంటే , రాజ్యసభ సభ్యునిగా ఉపేంద్ర ఢిల్లీలో చక్రం తిప్పేవారు . ఒక రకంగా ఆయనది దాదాపు నంబర్ 2 పవర్ సెంటర్ . తరువాత కాంగ్రెస్ లో చేరారు . మెదక్ జిల్లాల్లో పాదయాత్ర కవర్ చేయడానికి వెళ్ళాను .

పాదయాత్ర జరుగుతున్న కాలంలో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఎండలు . ఆ సమయంలోనే తొలిసారిగా తలపై క్యాప్ లో ఫ్యాన్ ఉండడం చూశాం . రేణుకా చౌదరి తలపై క్యాప్, దానిలో ఫ్యాన్ ధరించి ప్రత్యేకంగా కనిపించడం మీడియాలో ఫొటోతో మంచి ప్రచారం లభించింది . ఆ సమయంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం కార్యాలయంలో రిపోర్టర్లు అందరూ ఉన్నప్పుడు కెవిపి రామచంద్రరావు ఓ సలహా అడిగారు . ఎండలు బాగా ఉన్నాయి , ఫ్యాన్ ఉన్న క్యాప్ ధరిస్తే ఎలా ఉంటుంది అని …

ఫ్యాన్ ఉన్న క్యాప్ ధరిస్తే బాగుంటుంది అని ఒకరిద్దరి సలహా . ఆ సమయంలో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఎండలు , ఇంట్లో నుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితి . అందరూ ఈ ఎండలు చూసి వైయస్ఆర్ ఎలా నడుస్తున్నాడో అనుకుంటున్నారు … క్యాప్ , దానికో ఫ్యాన్ ఒక్క రోజు బోలెడు ప్రచారం వస్తుంది కానీ ఇప్పటి వరకు వచ్చిన సానుభూతి పోతుంది . పడే ఇబ్బంది ఏదో పడుతున్నారు అలానే కొనసాగించాలి అన్నాను . నేను ఎవరో కెవిపికి తెలిసే అవకాశం లేదు . నేను టీడీపీ బీట్ రిపోర్టర్ ను కాబట్టి.. పేరు తెలియక పోయినా ఓ రిపోర్టర్ అని తెలిసే అవకాశం ఉంది .

***********

తరువాత ఫ్యాన్ ఉన్న క్యాప్ కాదు కానీ ఎండ దెబ్బ తాకకుండా పెద్ద తలపాగా చుట్టుకొని , దాన్ని నీటితో తడుపుతూ పోయారు . వైయస్ఆర్ కు సన్నిహితంగా ఉండే రవిచంద్ పరిచయం ఉండడం వల్ల అతనితో చెప్పి ఈ పాదయాత్రలో జోగిపేటలో వైయస్ఆర్ ఇంటర్వ్యూ చేశాను . సరైన సమయం కాదు అనే మాటకు బదులిస్తూ కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు పాదయాత్ర ద్వారా వారిని పలకరించాలి కానీ మనకు కుదిరిన సమయంలో పలకరిద్దాం అంటే ఎలా అన్నారు .

ఇంత ఎండలో ఎలా నడుస్తున్నారు ? మిమ్ములను నడిపిస్తున్న శక్తి ఏమిటీ అని అడిగితే .. ప్రజలు అంటూ ఏదో చెప్పారు . మిమ్ములను నడిపిస్తున్న ఆ శక్తి ఏమిటో చెప్పాలా అని నేనే చెప్పాను . పవర్ మిమ్ములను నడిపించే శక్తి … అధికారానికి ఆ శక్తి ఉంటుంది అదే మిమ్ములను నడిపిస్తుంది అని నా అభిప్రాయమని చెబితే వైయస్ఆర్ నవ్వారు . 2004 లో టీడీపీ ఓటమి ఖాయం అని తేలిపోయింది . పాదయాత్రతో మీకు కాంగ్రెస్ లో ఎదురు లేకుండా పోతుంది అని నా అభిప్రాయం నేను చెప్పాను . ప్రశ్నకు వైయస్ నుంచి ఏం సమాధానం వస్తుందో నాకు తెలుసు. నిజానికి నా ఈ అభిప్రాయం చెప్పడానికే ఆ ప్రశ్న అడిగాను .
అలిపిరిలో తనపై నక్సల్స్ హత్యా యత్నం చేయడంతో సానుభూతిపై ఆశలు పెట్టుకొని చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు . ఉపేంద్ర చెప్పినా వినకుండా సరైన సమయంలోనే వైయస్ఆర్ పాదయాత్ర చేయడం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది . మేం ఎన్నికల కోసం పాదయాత్ర చేయడం లేదు అని చెప్పినట్టు అయింది , ముందస్తు వల్ల పాదయాత్ర ఎన్నికలకు ఉపయోగపడింది .

****

టీడీపీలో ఢిల్లీలో అధికార కేంద్రంగా చాలా కాలం చక్రం తిప్పిన ఉపేంద్ర మారిన పరిస్థితిని జీర్ణం చేసుకోలేక పోయారు . ఆయన ఒక్కరే కాదు, రాజకీయాల్లో చాలామంది ఒకప్పుడు చక్రం తిప్పి ఉంటారు . అది శాశ్వతం అనుకుంటారు … ఉపేంద్ర కాంగ్రెస్ లో చేరినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు . ప్రాధాన్యత ఇవ్వలేదు . కాంగ్రెస్ లో తన ప్రభావం చూపాలి అని ప్రయత్నించినా సాధ్యం కాలేదు . 99లో స్వల్ప తేడాతో టీడీపీ గెలిచింది . విద్యుత్ ఉద్యమం , తెలంగాణ ఉద్యమం వల్ల టీడీపీ ఓటమి ఖాయం అని తేలిపోయింది . ఎర్రటి ఎండలో ధైర్యంగా పాదయాత్ర చేసిన వైయస్ఆర్ కు కాంగ్రెస్ లో ఎదురు లేకుండా పోయింది ….. – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions