Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ పవర్ రాజకీయాల్లో మూడు గంటల ‘ముసలం’…

July 19, 2023 by M S R

‘Power’ Politics: అప్పుడు నేనొక టీ వీ ఛానెల్లో రిపోర్టర్ గా పని చేస్తున్నాను. యాజమాన్యం, ఎడిటర్, బ్యూరో చీఫ్ అండదండలు లేనివారికి సాధారణంగా అప్రధానమయిన బీట్లు దక్కుతాయి. అలా ఉన్నవాటిల్లో ఎందుకూ కొరగాని బీట్లు నాకు కేటాయించారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పి…నన్ను సాహిత్యంలో, మీడియా వ్యాపారంలో స్థిరపరిచింది కాబట్టి దాని మీద నాకు బాధ లేదు. ఆ వివరాలు ఇక్కడ అనవసరం.

అప్పుడు శాసన సభ డెప్యుటీ స్పీకర్ గా ఉన్న కె సి ఆర్ విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. నిజానికి ఆ ఉత్తరం వార్తను సి ఎం బీట్ లేదా అధికార పార్టీ బీట్ చూసే రిపోర్టర్ కవర్ చేయాలి. అదొక పనికిరాని లేఖ అన్న భావంతో షిఫ్ట్ ఇన్-ఛార్జ్ పనికిరాని బీట్లు చూసే నా చేతిలో పెట్టి…ఒక నిముషానికి మించకుండా వార్తను వండమన్నాడు. సొంత ముఖ్యమంత్రి విధానాలను అదే పార్టీ ఎమ్మెల్యే, డెప్యుటీ స్పీకర్ కె సి ఆర్ తప్పుబట్టడం, ఆ లేఖలో తీవ్రత ప్రకారం- “తెలుగుదేశంలో ముసలం” అని ముఖ్యాంశాలకు పనికి వచ్చే వార్తగా రెండే వాక్యాల యాంకర్ పార్ట్, నాలుగే వాక్యాల వాయిస్ ఓవర్ పార్ట్ తో నిముషం దాటకుండా ఐటెం రాశాను. లేఖను ఎత్తి చూపుతూ వార్త ఎడిట్ అయ్యింది. “తెలుగు దేశంలో ముసలం” అన్న ముఖ్యాంశంతో ఎనిమిది గంటల బులెటిన్ లో ప్రసారమయ్యింది. అప్పట్లో ఆ ఎనిమిది గంటల బులెటిన్, మరో ఛానెల్లో తొమ్మిది గంటల బులెటిన్ లకు విపరీతమయిన ఆదరణ ఉండేది.

Ads

…అంతే…భూమ్యాకాశాలు ఒకటయిపోయాయి. అప్పటి సీ ఎం ముఖ్య పౌర సంబంధాల అధికారి- సి పి ఆర్ ఓ విజయ్ కుమార్ ఛానెల్ బ్యూరో చీఫ్ నుండి యజమానుల దాకా అందరికీ ఫోన్లు చేశారు. “ముసలం” అన్న మాటకు తెలుగులో, తమిళంలో, ఇంగ్లీషులో ఆఫీసంతా అర్థాలు వెతుక్కుంటున్నారు. ఆ రాత్రికే నా ఉద్యోగం ఊడిపోతుందని నా బాగు కోరే సహచర ఉద్యోగులు వణుకుతున్నారు. ఇంకా అప్రధానమయిన బీటుకు మారుస్తారని నన్ను సిద్ధం చేశారు. ఆఫీసు ముందు రోడ్డు మీద టీ తాగి నేను, నా సీనియర్ తాపీగా న్యూస్ డెస్క్ లోకి వెళ్లాం.

రెండు మానభంగాలు, నాలుగు హత్యలు చేసి…ఆ ఎర్రటి రక్త హస్తాలతో...మెడలో పేగులు వేలాడేసుకుని నడిచివస్తున్న నరరూప రాక్షసుడిలా నావైపు అందరూ భయం భయంగా చూస్తున్నారు. ఏమయ్యిందని అడిగా. అది “ముసలం” ఎలా అవుతుంది? అని అందరూ ఒక్కసారిగా మీద పడ్డారు. అది “ముసలమే” అని వాదించాను. “యాదవ కులంలో ముసలం పుట్టినట్లు…” సామెత పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పా. నథింగ్ డూయింగ్! అని పది గంటల బులెటిన్ లో “ముసలం” మాటను తీసేసి, ముఖ్యాంశాల్లో లేకుండా…లేఖ రాశారు అని…లేఖలో ఏముందో కూడా చెప్పకుండా…వార్తను డైల్యూట్ చేసి ప్రసారం చేశారు.

తరువాత అది “ముసలం” ఎలా అయ్యిందో కాలం కళ్లప్పగించి చూసింది. తరువాత అదే సి పి ఆర్ ఓ విజయ్ కుమార్ చంద్రబాబు శిబిరాన్ని వదిలి...వై ఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి…ఎస్ వీ బీ సి ఛానెల్లో ఉద్యోగం చేస్తుండగా నేను చాలా సార్లు కలిశాను.

ఆ “వార్తా ముసలం” పుట్టించిన రోజు అందరూ నన్ను తిట్టారు కానీ…నా సీనియర్ మాత్రం మెచ్చుకున్నాడు. అంతమంది అంతలా భయపడి వణికిపోతుంటే నువ్వేమిటి అలా తాపీగా అర్థ తాత్పర్యాలు చెబుతున్నావ్? అని ముసిముసిగా నవ్వాడు. తరువాత నిజంగానే నిలువెల్లా వణికిపోయేలాంటి…బయటికి వెళ్లిపోక తప్పని వాతావరణం సృష్టించారు. సభా మర్యాద దృష్ట్యా ఆ పేర్లు, వివరాలు అనవసరం.

తెలంగాణాలో “మూడు గంటల విద్యుత్- మూడు పంటల విద్యుత్” అంటూ కాంగ్రెస్- బి ఆర్ ఎస్ మధ్య మాటల యుద్ధం, వీధి పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో అప్పటి “ముసలం” గుర్తుకొచ్చింది. ఈసారి పుట్టిన “ముసలం” ఎవరిని ముంచుతుందో మరి?

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
  • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
  • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…
  • పూకి… కాకపోతే బూకి… ఏదో ఓ పిచ్చిపదం… తెలుగోడంటే అలుసే కదా…
  • నీ నల్లకోటు పుస్తకంలో కథలు చాలా బాగున్నయ్ మిలార్డ్…
  • ఎంత తేడా..? కేసీయార్ జనంలోకే రాడు… రేవంత్ మాత్రం పూర్తి భిన్నం..!!
  • అవ్‌ గణేశా… ఇంకొన్నొద్దులు ఇక్కడే ఉండిపోరాదు ప్లీజ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions