దేశంలోని 15 మంది ప్రముఖ జ్యోతిష్కులు బాబే గెలుస్తాడని చెప్పారు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు
————————————-
తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , దేశంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు . పత్రికలు చదివే అలవాటు , కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఈజీగానే గెస్ చేసి చెప్పవచ్చు . రిపోర్టర్ గెస్ చేసి చెబితే వంద శాతం నిజం అయినా రూపాయి కూడా జీతం పెరగదు . అదే ఓ జ్యోతిష్కుడు చెబితే , అది ముందుగా వీడియోలోనో , పత్రికలోనో రికార్డ్ అయి ఉంటే ఫలితాలు వచ్చాక ఆ వీడియోలు చూపి నేను ముందే చెప్పాను అని ఓ వీడియో రిలీజ్ చేస్తే అతని గిరాకీ పెరుగుతుంది …
Ads
ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానులు పివి నరసింహారావు , మన్మోహన్ సింగ్ లకంటే సంస్కరణలపై ఎక్కువ ప్రచారం పొందింది చంద్రబాబు నాయుడు . పివి ప్రధానిగా దిగిపోయి బాబు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేగంపేట రామానంద తీర్ధ ట్రస్ట్ లో ఓ కార్యక్రమం . బాబు కోసం పివి నిరీక్షించడం చూసి రాజకీయాల్లో ఇంతే అనిపించింది . ఆ కార్యక్రమంలో బాబు ఆర్థిక సంస్కరణలు , ట్రిలియన్ , మిలియన్ లు అంటూ చెబితే , పివి వాటి గురించి తనకు అంతగా తెలియదు అన్నారు .
ఇంగ్లీష్ మీడియా బాబును ముద్దుగా మీడియా డార్లింగ్ అంటూ పిలిచేది . దేశవ్యాప్తంగా మీడియాలో ప్రచారానికి బాబు తీవ్రంగా కృషి చేసేవారు . సంక్షేమ పథకాలు , రైతులు , వ్యవసాయం , ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు వంటి అంశాలు ఇంగ్లీష్ మీడియాకు బోరింగ్ అంశాలు . బాబు చెప్పే ఐటీ కబుర్లు , ఉచితాల రద్దు , సబ్సిడీ బియ్యం ధర పెంపు, ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలకు జాతీయ మీడియాలో సైతం మంచి అనుకూల ప్రచారం లభించేది .
దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న జ్యోతిష్కుడు ఐనా ఒకటే కదా ? పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా రాజకీయ జ్యోతిష్యం చెబుతారు .
2004 ఎన్నికల ముందు ఇండియా టుడే వారు ఓ ప్రయోగం చేశారు . బహుశా వాళ్ళు ఇంగ్లీష్ ఇండియా టుడే కోసం ఈ ప్రయోగం చేసి తెలుగు ఇండియా టుడేలో కూడా ప్రచురించి ఉంటారు . తెలుగు ఇండియా టుడే లో చూశాను . దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రముఖ జ్యోతిష్కులను 2004 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అని అడిగారు . 16 మందిలో 15 మంది దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జ్యోతిష్కులు చంద్రబాబు జాతకం అద్భుతంగా ఉందని , బాబే మళ్ళీ బ్రహ్మాండంగా గెలుస్తాడు అని చెప్పారు . ఆ ప్రముఖుల పేర్లు , వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు , అంతకు ముందు వారు చెప్పిన గొప్ప గొప్ప జ్యోతిష్యాలు కూడా ఆ వ్యాసంలో పేర్కొన్నారు .
16 మందిలో ఒకే ఒక్కరు బాబు గెలువరు , ఓడిపోతారు అని జోస్యం చెప్పారు . మిగిలిన వారు నిజమైన జ్యోతిష్కులు కాదు, వీరు ఒక్కరే నిజమైన వారు అని అపోహ అవసరం లేదు . బాబు ఓడిపోతాడు అని చెప్పిన ఏకైక జ్యోతిష్కుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు . అప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం , ఆ సమయంలో కమ్యూనిస్ట్ లు బాబును తీవ్రంగా వ్యతిరేకించారు . సహజంగా బెంగాల్ కమ్యూనిస్ట్ మీడియాలో సైతం బాబు విధానాల పట్ల వ్యతిరేక వార్తలు సహజం . ఆ ప్రభావంతో బాబు ఓడిపోతారు అని బెంగాల్ జ్యోతిష్కుడు చెప్పారు .
****
అదే సమయంలో నేను ఏకంగా బాబుకే చెప్పాను ఈసారి మీరు ఓడిపోతారు అని … రోడ్డు మీద ఉన్న వారితో మాట్లాడిన తరువాత ఓటమి ఖాయం అని గట్టిగా అనుకున్నా … రోడ్డు మీద చిలక జోస్యం వాడితో కాదు .. రోడ్డు మీద వ్యాపారం చేసే సామాన్యుల మాటలు విన్నాక ఓటమి ఖాయం అనిపించింది … గ్రామాల్లో బస్టాండ్ లో సామాన్యులు , కూరగాయల వ్యాపారులు , ఆర్డనరీ బస్సుల్లో ప్రయాణికులు , మాములు ఇరానీ హోటల్స్ లో వాళ్ళు మాట్లాడుకున్నది వినాలి . మహా మహా మీడియాలో మాట్లాడే విశ్లేషకుల మాటలు విని ఏర్పరచుకునే అభిప్రాయంకన్నా వీరి మాటలు విని ఏర్పరచుకునే అభిప్రాయం ఫలితాలను తేలుస్తుంది .
****
2004 ఎన్నికలకు ముందు బాబు ఇంట్లో బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ . టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఏఎం రాధా కృష్ణ ఉండేవారు . ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక, సార్ మీతో మాట్లాడుతాడట, ఆ గదిలో ఉండమన్నారు అంటే .. ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక రాధాకృష్ణ చూపిన గదిలో కూర్చున్నా . కొద్దిసేపటి తరువాత బాబు వచ్చి మాట్లాడితే ఈసారి మీరు ఓడిపోతారు, ఎందుకు ఓడిపోతున్నారో వివరంగా చెప్పాను .
ఎన్నికల ముందు పూజారిని కూడా హెలికాఫ్టర్ లో తీసుకువెళ్లి దేవాదుల ప్రాజెక్ట్ శంకుస్థాపన పూజ చేశారు . ఇలాంటివి జనం నమ్మరు . మీడియా ప్రచారం తప్ప గ్రామీణుల్లో , సామాన్యుల్లో అనుకూలత లేదు అని రోడ్డు మీద పండ్లు అమ్ముకునేవారు , ఇరానీ హోటల్ లో సామాన్యులు మాట్లాడిన మాటలు బాబుకు చెప్పాను . లేదు ఈ సారి గెలుస్తాం, గెలిచాక తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తాను అని బాబు చెప్పుకొచ్చారు .
****
అడిగిన వారికి , అడగని వారికి మాత్రమే బాబు ఎందుకు ఓడిపోతారో చెప్పేవాడిని . అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు క్లింటన్ హైదరాబాద్ వచ్చి వెళ్లారు . బాబుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు . ఆంధ్రభూమిలో డెస్క్ ఇంచార్జ్ బుద్ధవరపు రాజేశ్వర ప్రసాద్ అని ఉండేవారు . బాబు ఎలా ఓడిపోతారో చెబితే అతనికి నచ్చలేదు . చివరగా నీకు అమెరికా అధ్యక్షుడు క్లింటన్ కన్నా ఎక్కువ తెలుసా? క్లింటన్ మెచ్చుకుంటే నువ్వేమో ఓడిపోతాడు అంటున్నావు అని ప్రశ్న సంధించాడు .
క్లింటన్ కు తెలిసినట్టుగా అమెరికా గురించి నాకు సముద్రంలో నీటి చుక్క అంత కూడా తెలియదు . బేగంపేట విమానాశ్రయం నుంచి అత్యంత వేగంగా కారులో హైటెక్ సిటీకి వెళ్లి , తిరిగి అంతే స్పీడ్ గా విమానాశ్రయానికి , అటు నుంచి అమెరికాకు వెళ్ళిపోయిన క్లింటన్ కు ఏం తెలుస్తుంది ఇక్కడ సామాన్య ఓటరు మనసులో ఏముందో ? క్లింటన్ కు తెలియదు, సామాన్యుడి గురించి సామాన్యుడికే తెలుస్తుంది అని బదులిచ్చాను .
****
అలిపిరి లో నక్సల్స్ దాడి వల్ల సానుభూతి తో గెలుస్తానని భావించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది . కాంగ్రెస్ , తెరాస కూటమి విజయం సాధించింది . దేశంలోని 16 మంది ప్రఖ్యాత జ్యోతిష్కుల్లో 15 మంది చెప్పిన జ్యోతిష్యం అబద్దం అయిందని ఇండియా టుడే వాళ్ళు రాయలేదు . మేం చెప్పింది నిజం కాలేదు అని ఆ జ్యోతిష్కులు కూడా ప్రకటించలేదు … – బుద్దా మురళి
Share this Article