మొన్న జూన్‌లో చెప్పుకున్నాం కదా… ఈటీవీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతోందని… ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్ వంటి చానెళ్లనే కాదు, ఈటీవీ రెండు న్యూస్ చానెళ్లను కూడా ఎవడూ దేకడం లేదు… ఇక మిగిలింది ఈటీవీ వినోద చానెల్… కొత్త సినిమాలు, మంచి సీరియళ్లు లేకపోయినా ఒకప్పుడు మస్తు రియాలిటీ షోలతో మంచి పోటీ ఇచ్చేది… కానీ క్రమేపీ అవి కూడా దెబ్బతిని, పట్టించుకునేవాడు లేక… మూడో స్థానానికి పడిపోయింది…
జీతెలుగు కాస్తో కూస్తో స్టార్ మాటీవీకి పోటీ ఇవ్వగలుగుతోంది… కానీ ఈటీవీ అయితే మరీ స్టార్ మాటీవీ రేటింగ్స్‌లో దాదాపు మూడోవంతుతో నానాటికీ దిగదుడుపు అన్నట్టుగా మారిపోయింది… మరోవైపు స్టార్ మాటీవీ దేశంలోనే నెంబర్ వన్ ప్లేసులో ఉంది… చివరకు ఆ గ్రూపులోని ప్రముఖ హిందీ చానెల్ స్టార్ ప్లస్‌కన్నా బెటర్‌గా… మరి ఇప్పుడెలా ఉందో చూద్దామని బార్క్ పరిశీలిస్తే… సేమ్… ఈటీవీ కాస్త మెరుగుపడిందీ లేదు, స్టార్ మాటీవీ కాస్త దిగజారిందీ లేదు…
Ads
స్టిల్, ఈరోజుకూ అవే దిక్కుమాలిన రియాలిటీ షోలనే నమ్ముకుంటోంది… బాలు ప్లేసులో ఎస్పీ చరణ్ ఆనడం లేదు… దాంతో సంగీత ప్రధానమైన ప్రోగ్రామ్స్ ఫ్లాప్… సుధీర్, రష్మి వెళ్లిపోయాక హైపర్ ఆది ఓవరాక్షన్ మరీ ఓవర్ అయిపోయి డాన్స్ షో ఢీ దెబ్బతినిపోయింది… అదే సేమ్ ఫార్మాట్, నాసిరకం స్కిట్లతో జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కూడా భ్రష్టుపట్టిపోయి రేటింగ్స్ రావడం లేదు… ఒక్క శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త నయం… ఇక మరో షో గురించి చెప్పాలి…
ఈటీవీలో గతంలో ఆలీతో సరదాగా అనే షో వచ్చేది… కాస్త బెటరే… తన పాత పరిచయాలతో అలనాటి నటీనటులను తీసుకొచ్చి మాట్లాడేవాడు… ఇంట్రస్టింగుగా ఉండేది… క్రమేపీ దాన్ని కూడా సినిమా ప్రమోషన్ల ప్రోగ్రాంగా మార్చేశారు… ఆసక్తి కలిగించని గెస్టులను పట్టుకురాసాగారు… దాంతో రేటింగ్స్ పడిపోయాయి… ఆలీకి కూడా ఏదో ప్రభుత్వ పదవి ఇచ్చి కొన్నాళ్లు మానేశాడు… ఈలోపు వెన్నెల కిషోర్‌తో ఏదో షో స్టార్ట్ చేశారు… అది మరింత దరిద్రంగా రేటింగ్స్ తీసుకొచ్చింది… దాన్నీ అర్థంతరంగా ఆపేశారు…
ఈలోపు ఆలీకి తన ప్రభుత్వ పదవితో పనేమీ లేదని గ్రహించినవాడై, తత్వం బోధపడి… ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే షోకు శ్రీకారం చుట్టాడు… ఎలాగూ వెన్నెల కిషోర్ అట్టర్ ఫ్లాప్ కదా, పాపం పోనీ, ఆలీ షో చేసుకోనీ అన్నది ఈటీవీ యాజమాన్యం… కాస్త మార్పులు చేర్పులతో, కొన్ని ఇతర ప్రోగ్రాముల్ని మిక్సీ పట్టి, ఓ కిచిడీ వంటి ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు ఆలీ… అదీ ఫ్లాప్ దిశగానే పయనిస్తోంది…
ఈసారి బార్క్ రేటింగ్స్‌లో ఈ షో రేటింగ్స్ తెలుసా..? మరీ ఘోరం… 1.94 రేటింగ్స్ వచ్చాయి… దిక్కుమాలిన, నాసిరకం సీరియళ్లకు కూడా ఇంతకుమించి రేటింగ్స్ వస్తాయి… నిజంగానే ఈ షో బోర్… ఈటీవీ కళ్లు తెరిచేనాటికి జరగాల్సిన మరింత డ్యామేజీ జరిగిపోతుంది… ఇక మరో షో అత్యంత సీనియర్, పాపులర్ యాంకర్ సుమ నిర్వహించేది… సుమ అడ్డా…
అంతటి చిరంజీవిని తీసుకొచ్చి షో చేస్తేనే రేటింగ్స్ రాలేదు, అంటే ఎవరూ పట్టించుకోలేదు… సుమ క్రమేపీ తన రొటీన్, మొనాటనస్ షోలతో విసిగిస్తోంది… కొత్తదనం ఉండటం లేదు… క్రమేపీ ఏమైనా కాస్త బెటర్ రేటింగ్స్ వస్తాయేమో అనుకుంటే అదీ హుళక్కే… ఈసారి బార్క్ రేటింగ్స్ జస్ట్, 2.13… అంటే ఆలీ షోతో పోటీపడుతుందన్నమాట… సుమ, ఆలీ షోలను అర్జెంటుగా రద్దు చేసిపారేసి, జబర్దస్త్ ఫార్మాట్ మార్చి, కొత్త కమెడియన్స్‌ను తీసుకొచ్చి, ఢీ షో బదులు మరేదైనా స్టార్ట్ చేస్తే తప్ప ఈటీవీ తన మూడో స్థానాన్ని కూడా కాపాడుకోవడం కష్టమే… కష్టమే…
Share this Article