Sai Vamshi……… సుధామూర్తి గారి కామెంట్లు – ఒక పరిశీలన….. కొన్ని రోజుల నుంచి FBలో సుధామూర్తి గారి ‘మాంసాహార ఛాయిస్’పై చర్చ నడుస్తూ ఉంది. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, రచయిత్రి, సామాజికవేత్త, దేశంలో అనేకమందికి తెలిసిన వ్యక్తి. నటుడు, ఆహార విశ్లేషకుడైన కునాల్ విజయ్‌కర్‌తో కలిసి ‘ఖానే మే కౌన్ హై’ అనే కార్యక్రమంలో ఇటీవల మాట్లాడుతూ శాకాహారురాలిగా తనకుండే ప్రాధాన్యాలు వివరించారు. తాను మాంసాహారం తిననని, వెల్లుల్లి కూడా వాడనని చెప్పారు. విదేశాలకు వెళ్లినా శాకాహార హోటళ్ల కోసం చూస్తానని, అందుకే తన బ్యాగులో 20-30 చపాతీలు చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటానని వివరించారు. తనకు పెద్దగా వంట రాని విషయం కూడా ఆమె అందరి ముందూ వెల్లడించారు.
సుధామూర్తి గారి కామెంట్లు చాలా వైరల్ అయ్యి, సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీశాయి. కొందరు ఆమె ఆహార స్వేచ్ఛను సమర్థిస్తే, మరికొందరు ఆ మాటల్ని ఆమెలోని కులకోణానికి ప్రతీకగా చూపి విమర్శించారు. రెండు రకాల స్పందనల్లోని దేనికీ ఇదిమిద్దంగా మొగ్గు చూపలేక చాలా మంది మౌనంగా ఉండిపోయారు. సుధామూర్తి గారి సంగతి వదిలేయండి. నిజంగా ఆహారంలో కులం కోణం ఉంటుందా? కొన్ని ఆహారాలు తినడం/తినకపోవడం కులాన్ని సూచిస్తుందా? చర్చ జరగాల్సిన విషయాలు ఇవి.
సుధామూర్తి గారికి ఇప్పుడు 72 ఏళ్లు. ఆమె పుట్టింది కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని శిగ్గావి. కర్ణాటకలో మఠాలు, మఠాధిపతులు, స్వామిజీలు, గురుశిష్య పరంపర సంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. అక్కడ బ్రాహ్మణ, వైశ్య వర్గాలతోపాటు ఇతర వర్గాల్లోనూ కొందరు శాకాహారులుగా ఉంటారు. మొక్కుబడి అని, స్వామీజీల శిష్యపరంపర అని, దీక్ష తీసుకున్నాం అని కొన్ని కుటుంబాలు పూర్తిగా శాకాహారం పాటిస్తాయి. ఇందులో కులం కన్నా నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరికొందరు అనారోగ్య కారణాలతో, ఇంకొందరు స్వచ్ఛందంగా శాకాహారులుగా ఉంటారు. కాబట్టి ప్రతి శాకాహారీ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తే కానవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్న స్వర్ణకారులు కర్ణాటకలో పాంచాల్‌లుగా ఉన్నారు. వారిలో కొందరు పూర్తి శాకాహారులు. అది అక్కడి సంప్రదాయం.
Ads
1950లో అక్కడ పుట్టిన సుధామూర్తి ఇటువంటి వాతావరణంలో పెరిగారు. చిన్ననాటి నుంచే శాకాహారులుగా ఉన్నారు. అలాగే డెబ్బై ఏళ్లు గడిపారు. ఒక వయసు దాటాక చాలామంది మాంసాహారం మానేస్తారు. ఆమె మొదటి నుంచే శాకాహారులుగా ఉండి, దాన్నే అలవాటు చేసుకున్నారు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఇందులో కులం ఏర్పాటు చేసిన అలవాటు తప్పించి, కులకోణానికి తావుందని నాకైతే అనిపించడం లేదు. అంతెందుకు? మాంసాహారం తినేవారిలో కొందరు చికెన్, మటన్ మినహా మరేదీ ముట్టరు. ఎద్దు, పంది లాంటి మాంసాల పేర్లు చెప్తే వాంతి చేసుకుంటారు. ఆ ఊహే రానివ్వరు. అంతమాత్రాన వారిలో కులం కోణం ఉంది అనలేం! అదొక చాయిస్ అనుకోవాలి.
సుధామూర్తి గారిదీ ఛాయిస్ మాత్రమే అనుకునేవాళ్లం. ఎటొచ్చీ ఆమె “మాంసాహారంతో కలిసిన స్పూన్లు శాకాహారంలో కలుస్తాయేమో అని నా భయం” అనే మాట చెప్పి వివాదంలో చిక్కారు. తద్వారా Casteist అనే ముద్ర ఒకటి తెలియకుండానే మోయాల్సి వచ్చింది. బోలెడన్ని వ్యంగ్య కామెంట్లు ఆమె మీద ట్రోల్ అయ్యాయి. కానీ ఆహారం విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. కొందరికి ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ నచ్చదు. కొందరు పేపర్ ప్లేట్‌లలో భోజనం చేయరు. ఇంకొందరు చెప్పులు విప్పేసి తింటారు. నాతోసహా చాలామందికి ఆహారం విషయంలో చాలా చాదస్తాలు ఉంటాయి. వాటిని దాటాలని ప్రయత్నించి ఓడిపోయిన అనుభవాలూ ఉంటాయి. ఏళ్లుగా వాళ్ల శరీరం పాటించే నియమాలు ఉంటాయి. అవేవీ తెలియకుండా మనం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు.
“పంది మాంసం తింటే పందిలా పుడతారు” అని చినజీయర్ లాంటి సిల్లీ కామెంట్లు సుధామూర్తి గారు చేయలేదు. “మాంసాహారం తినే వాళ్లంటే నాకు అసహ్యం” అనే నిర్హేతుకమైన మాట చెప్పలేదు. మాంసాహార వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. ఆహార అలవాట్ల ప్రాతిపదికగా ఏనాడూ ఎవర్నీ ఆమె వివక్షతో చూసిన దాఖలా లేదు. కేవలం తన ఇష్టాన్ని, అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారు. ఆమె పెరిగిన జీవన విధానం కారణంగా ఏ అలవాట్లయితే ఆమె చిన్ననాటి నుంచి పాటించారో, అవే ఆ కార్యక్రమంలో వివరించారు.
ఇక్కడ అసలు ప్రశ్న వస్తుంది. సుధామూర్తి గారికి ‘శాకాహారం’ ఛాయిస్ అయినట్టు, మరెవరికో ‘శాకాహారులు’ ఛాయిస్ అయ్యి, వారికే ఇల్లు అద్దెకిస్తాం అంటే? శాకాహారులకే ఉద్యోగాలు ఇస్తాం అంటే? దాన్ని కూడా ఛాయిస్‌గా వదిలేయాలా? లేదు. ఒకరు తీసుకునే ఆహారం వారి వ్యక్తిగత ఇష్టం. అలవాటు కోసమో, ఆరోగ్యం కోసమో వారు కొన్ని భౌతిక నియమాలు పాటిస్తారు. కానీ ఇల్లు, ఉద్యోగాలు లాంటివి సామాజిక అంశాలు. అందులో Individual Choiceతోపాటు Social Responsibility కూడా కలిసి ఉంటుంది. అక్కడ వివక్ష చూపి, “It’s my Choice” అనేస్తే కుదరదు.
ఒకానొక సమయంలో నా ఫ్రెండ్ ఒకరు నాతో మాట్లాడుతూ ‘గొడ్డుకూర’ గురించి చెప్పింది. నేను మామూలుగా వింటున్నాను. ఉన్నట్టుండి “మీ ఇంట్లో అది వండుతారా?” అంది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు. “అలాంటివి ఉంటాయని కూడా మా ఇంట్లో తెలియకపోవచ్చు” అన్నాను. “అయితే ఒకసారి తిని ట్రై చెయ్” అంది. ఆ మాటని నేను చాలా సింపుల్‌గా తీసుకుని “నాకు చికెన్ చాలు! అదే హాయి” అనేశాను. ఆపైన టాపిక్ మారిపోయింది. ఆ తర్వాత ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ గురించి చర్చ వచ్చినప్పుడు వారికి మద్దతుగానే నిలిచాను. నా ఆహార ఛాయిస్ అది కాకపోయినా, వాళ్లకు నచ్చిన పదార్థం తినే హక్కు వారికి ఉందని, దాన్ని మనం గౌరవించాలని నమ్మాను. ఇప్పటికీ అదే నమ్ముతున్నాను.
శాకాహారులే గొప్ప కాదు, మాంసాహారులేం తక్కువ కాదు. శాకాహారులు మాంసాహారం తినరు సరే, అన్ని ఆకుకూరలూ తింటారా ఏంటి? అలర్జీ అని, ఇష్టం లేదని ఎన్ని మానేయరు? ఎవరు ఏది తిన్నా మిగిలిన వారిని వివక్షతో చూడకపోవడం అవసరం. ఒకరి తిండిని మరొకరు గౌరవించుకోవడం అవసరం.
Share this Article