టీవీ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది… ప్రత్యేకించి టీవీ న్యూస్ మీడియాలో భాష పరిస్థితి అధ్వానం… అన్నింటికీ మించి రిపోర్టర్లు ఫీల్డ్ నుంచి వివరించే గ్రౌండ్ రిపోర్ట్ భాష, మరీ ప్రత్యేకించి ‘పరిస్థితి, జరిగింది’ వంటి పదాలు కర్ణకఠోరం… ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా, అనగా పత్రికలు కాస్త నయం అనిపిస్తుంది… కాకపోతే ఈమధ్య పత్రికల్లో భాష, హెడింగులు, ప్రయారిటీలు, ప్రజెంటేషన్లు, రచనశైలి కూడా మరీనాసిరకంగా ఉంటున్నాయి… ట్రెయిన్డ్ గాకుండా అన్ ట్రెయిన్డ్ సిబ్బంది విపరీతంగా వచ్చిపడుతున్న తీరే ప్రధాన కారణం…
కొన్ని మచ్చుకు చెప్పుకుందాం… అన్నీ ఈరోజువే… ఈనాడు బ్యానర్ వార్త హెడింగ్ వైనాట్ పులివెందుల… చంద్రబాబు ‘పులి’వెందులకు వెళ్లి ఇక్కడ మనం ఎందుకు గెలవకూడదు అని సొంతంగా సవాల్ విసురుకున్నాడు… సరే, ఈమధ్య పదే పదే జగన్ వైనాట్175 అంటున్నాడు కదా, అదే టోన్‌లో చంద్రబాబు కూడా వైనాట్ పులివెందుల అన్నాడు… ఆ కోణంలో ఇది సరైన హెడింగే… కానీ..?
Ads
క్షుద్ర అనువాదాలతో అదే తెలుగు సంరక్షణ, సేవగా చెప్పుకునే ఈనాడు చివరకు పేర్లను కూడా అనువదిస్తూ అపహాస్యం చేస్తుంటుంది కదా… మరి ఒక బ్యానర్ హెడింగ్‌ను పూర్తి ఇంగ్లిషులో ఎలా పెట్టింది..? అదీ నవ్వొచ్చే కారణం… అది చంద్రబాబుకు ఓ నినాదంగా ఉపయోగపడే ఇంగ్లిషు వాక్యం కాబట్టి, ఆ టోన్ అలాగే ఉండాలి కాబట్టి దానికి తెలుగును రుద్దలేదు…
ఇదీ ఈనాడు వార్తే… వరద ప్రభావిత ప్రాంతాలను ‘అగ్ర ప్రజాప్రతినిధి’ సందర్శించాలని గవర్నర్ అన్నట్టుగా వచ్చిన ఓ వార్త… ఇక్కడ అగ్ర ప్రజాప్రతినిధి అంటే ఆమె దృష్టిలో ముఖ్యమంత్రి అని…! అదే రాయొచ్చు కదా ఈనాడు… (ఏమో, అగ్రప్రజాప్రతినిధి అంటే కేటీయార్ కావచ్చు, ఏమో, ఏకంగా ప్రధాని రావాలని కోరుతున్నదేమో…) కానీ ఇలాంటి విషయాల్లో వక్త భాషణంలో ఎవరి గురించో కనీసం బ్రాకెట్లలో రాసినా బాగుంటుందిగా…
నిజానికి ఇది ప్రింట్ మీడియా కాదు, డిజిటల్ మీడియా… చాలా చిన్న వెబ్ పత్రిక… సిబ్బంది కూడా ట్రెయిన్డ్ కాదు, సంస్థ సాధనసంపత్తిని కూడా పరిగణనలోకి తీసుకుని, లోతైన విమర్శ నుంచి మినహాయించాలి… కానీ వార్త రాసే శైలి విషంయలో ఓ వార్త గురించి చెప్పుకోవాలనిపించింది… మంచిర్యాలలో మరో జలపాతం ఏర్పడిందట… అంటే ఆల్రెడీ ఉన్న జలపాతాన్ని మనం చూడలేకపోతే, ఇప్పుడు ఎవరో చూసి ఆ ఫోటోల్ని వైరల్ చేస్తే అది కొత్తగా పుట్టుకొచ్చినట్టా..? అది అప్పటివరకూ లేనట్టే లెక్కించాలా..?
ఇది మరో ఈనాడు హెడింగ్… ఛిద్ర మార్గాలు… అంటే ధ్వంసమైన మార్గాలు అనే అర్థంలో వాడింది… మరి అదే పదాన్ని వాడొచ్చు కదా… ఈ ఛిద్రం, తూటు, రంధ్రం పదాలు దేనికి..? ఇలా చెబుతూ పోతే బోలెడు ఉదాహరణలు… ఒకప్పటి ఛాందస, గ్రాంథిక భాష నుంచి వ్యవహార భాషలోకి వచ్చాం, సరళమైన తెలుగుకు పట్టం కట్టుకుంటున్నాం… మళ్లీ ఇదేం తిరోగమనం ఈనాడూ..?
Share this Article