తెలంగాణకు అదేం దురదృష్టమో కానీ … జీవితంలో ఒక్కసారి గెలిచి, మళ్లీ అడ్రెస్ లేకుండా పోయినవారి మాటలకే తెలుగు మీడియా ప్రాధాన్యత ఇస్తుంది … ఆరు నెలల్లో ఆంధ్రాలో కలిపేయాలంటూ ఉద్యమం తెలంగాణలో వస్తుంది చూడండి అని జ్యోతిష్యం చెప్పారు కొందరు … బోరు బావులకు విద్యుత్ లేక కరువుతో పోతారు అన్నారు … ఆ మేధావుల్లోని ఒకరు జయప్రకాశ్ నారాయణ… మెట్రో గురించి మరో జోస్యం చెప్పారు .
మెట్రో గురించి ఇది మొదటి జోస్యం ఏమీ కాదు . వారి ఆలోచనాధోరణికి చెందిన జ్యోతి పత్రిక , ప్రపంచంలో టాప్ యువనాయకుడిగా అవార్డు పొందిన నారా లోకేష్ కూడా మెట్రోపై గతంలోనే జోస్యాలు చెప్పారు . హైదరాబాద్ లో మెట్రో మొదలు కాలేదు కానీ మేం విజయవాడలో ప్రారంభించాం అని నారా లోకేష్ బహుశా 2016లో ట్వీట్ చేశారు . హైదరాబాద్ మెట్రో పరుగులు తీస్తోంది . విజయవాడ మెట్రో లోకేష్ లాంటి ప్రపంచ స్థాయి నాయకులకు తప్ప సామాన్యులకు కనిపించడం లేదు .
హైదరాబాద్ మెట్రో లాభసాటి కాదు , నిర్మించరు , వెనక్కి వెళతారు అని జ్యోతి అనేక సార్లు రాసింది . మీడియా అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మెట్రోనేమో పరుగులు తీస్తోంది .ఇప్పుడు నగరానికి నాలుగు వైపులా మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు . మెట్రో పై జెపి కొత్త జ్యోస్యం చెప్పాక .. గతంలో నేను ఆయనకు చెప్పిన జోస్యం గుర్తుకు వచ్చింది .
Ads
*******
ప్రతి రోజు ఏ బీట్ రిపోర్టర్ అయినా సచివాలయంలో ప్రెస్ రూమ్ బయట , చెట్టు కింద కాసేపు కబుర్లు చెప్పుకొనే అలవాటు ఉండేది . 2006 లో ఓ రోజు నేను అలా ప్రెస్ రూమ్ వద్దకు వెళుతుంటే కొందరు జర్నలిస్ట్ లు అక్కడ సీరియస్ గా చర్చిస్తున్నారు . కొమ్మినేని, భార్గవ్, ఇంకా కొంతమంది సీరియస్ చర్చ … జయప్రకాశ్ నారాయణ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడు అనేది ఆ చర్చ అంశం . అప్పటికి నియోజక వర్గాల పునర్విభజన అమలులోకి రాలేదు …
అప్పట్లో కూకట్పల్లి ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది . కూకట్ పల్లి ప్రాంతం ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందో అక్కడ పోటీ చేస్తే జెపి ఒక్కరే గెలుస్తారు . అంతకు మించి అయన పార్టీకి వేరే పెద్ద సీన్ ఉండదు అని జోస్యం చెప్పాను . అంత నెగిటివ్ ఎందుకు ? ఏమో, జెపి పార్టీ భవిష్యత్తు బాగుండవచ్చు, ఇప్పుడే ఎలా చెప్పగలం అని కొమ్మినేని తన అభిప్రాయం చెప్పారు .
లోక్ సత్తా పేరుతో జెపి అంతకు ముందు నుంచే వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించేవారు . కూకట్ పల్లి ప్రాంతంలో లోక్ సత్తా సంస్థ సభ్యులు బలంగా ఉండేవారు . స్థానిక సంస్థలకు అధికారాలు వంటి అంశాలపై లోక్ సత్తా బాగానే పని చేసింది . ఆ ప్రచారంతో దాన్ని రాజకీయ పార్టీగా మార్చాలి అని జెపి నిర్ణయించుకున్నారు …
****
చంద్రబాబు విఫలం కావడంతో బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీరావు తెరపైకి తీసుకువచ్చారు అని అప్పుడు బలంగా ప్రచారం ఉండేది . ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఈనాడులో టీడీపీ తరువాత జెపికి బాగా ప్రచారం లభించేది . జేపీ అందరు ఎడిటర్లకు ఫోన్ చేసి సీనియర్ జర్నలిస్ట్ లను పంపండి అని కోరేవారు .
ఈనాడు మంచి ప్రచారం ఇస్తున్నప్పుడు సాధారణంగా అన్ని పత్రికలు ఈనాడును తోకలా అనుసరిస్తాయి . బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీ రంగంలోకి దించారు అనే దానిపై నాకు పెద్దగా నమ్మకం లేదు కానీ ఈనాడులో జేపీకి మంచి ప్రచారం లభించేది . టీడీపీని తీవ్రంగా అభిమానించే వర్గాలు టీడీపీతో పాటు జేపీని అభిమానించేవి .
బిర్లా టెంపుల్ నౌబత్ పహాడ్ వద్ద జెపి పార్టీ కార్యాలయం ప్రారంభించారు . శుభమ్ పలకరా అంటే ఏదో అన్నట్టు ఆ రోజే జేపీకి అయన రాజకీయ భవిష్యత్తు చెప్పాను . మీరు సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకం అని చెబుతున్నారు ( కులం , ప్రాంతం, వంటివి సాంప్రదాయ రాజకీయాలు అనేది జెపి భావన ) కానీ మీరు కూడా సాంప్రదాయ రాజకీయ ఎత్తుగడతోనే గెలిచారు . మీరు ప్రస్తుతం నివాసం ఉంటున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి , లేదా మీరు పుట్టిన ప్రాంతం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి కానీ ఈ రెండు కాకుండా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్నారు అంటే మీరు కూడా సాంప్రదాయ రాజకీయాలు చేస్తున్నట్టే .
కూకట్ పల్లిలో ఆంధ్ర ప్రాంతం వారు , మీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే కదా అక్కడి నుంచి పోటీ . ఇది సాంప్రదాయ రాజకీయ కాకపోతే మరేమిటి అని అడిగాను . ఐతే కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలి అనేది తెలివైన నిర్ణయం . ఇదే వ్యూహంతో 2018 లో టీడీపీ నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నుంచి పోటీ చేయించారు . నిజంగానే సాంప్రదాయ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఇంకో చోట నిలబడితే మొదటికే మోసం వచ్చేది .
మీ పార్టీ నిలబడదు మీరొక్కరే తప్ప ఇంకొకరు గెలవరు అని ఆయనకే జోస్యం చెప్పాను . మీరు ప్రజలను అర్థం చేసుకోవడం లేదు … మా పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు ఆయన. రెండోసారి కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తే ఏమవుతుందో తెలిసి జెపి రెండో ఆసారి ఆ సాహసం చేయలేదు . 2014లో తిరిగి అదే వ్యూహంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై గురిపెట్టారు . బీజేపీని బాబును ఆకాశానికెత్తారు . పొత్తులో మల్కాజిగిరి టికెట్ ఆశించారు . సొంతంగా పోటీ చేసి పార్లమెంట్ లో ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడుతాను అని బహిరంగంగా ప్రకటించారు . ఐనా ఓటర్లు పట్టించుకోలేదు .
(శుక్రవారం ఆప్కాబ్ డైమండ్ జుబ్లీ సంబరాల వేళ జగన్తో జేపీ)
జేపీని టీడీపీ మీడియా , టీడీపీ వర్గమే ఆకాశానికెత్తింది . కానీ జెపి తమ కొంప ముంచుతున్నాడు అని ఎన్నికల తరువాత గ్రహించింది . 2009 ఎన్నికల్లో లోక్ సత్తాకు దాదాపు 2 శాతం ఓట్లు వచ్చాయి . అవన్నీ టీడీపీని అభిమానించే వారివే అని టీడీపీ భావించింది . మీరు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అని సామెత చెప్పినట్టు జేపీకి మన వాళ్ళే ప్రచారం కల్పిస్తే మన కొంపనే కొల్లేరు చేస్తున్నాడని టీడీపీ జేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది .
లోక్ సత్తాకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో బయటపెట్టాలి అని యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ భవన్ లో రోజూ విలేకరుల సమావేశాలు పెట్టి తీవ్రంగా దాడి చేశారు . యనమల ఆరోపణలకు జెపి స్పష్టంగా సమాధానం చెప్పలేదు . పార్టీ పెట్టినప్పుడే మీ వల్లకాదు అని ఆ మేధావికి నేను జోస్యం చెప్పాను .. 2014 తరువాత ఔను, నా వల్ల కాదు అని జెపి గ్రహించి పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు .
మీరెలా రద్దు చేస్తారు అని కొందరు తిరగబడ్డారు . దాంతో మీరు నడుపుకోండి అని జెపి చెప్పారు . ఇంతకూ జెపి పార్టీ ఉందా ? లేదా ? అంటే ఏమో జెపికే తెలియదు .. నాకెలా తెలుస్తుంది .? తెలంగాణ ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన జెపి , చివరలో హైదరాబాద్ ఆదాయాన్ని ఆంధ్రకు కేటాయించాలి అని డిమాండ్ చేశారు . తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం వేరు, కానీ ఒక రాష్ట్రంలో వచ్చిన ఆదాయం ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి అని డిమాండ్ చేయడం అదేం మేధావి తనమో …. – బుద్దా మురళి
Share this Article