కొన్ని పత్రికల్లో వార్తలు చదువుతుంటే నవ్వొస్తుంది… అన్ని పార్టీలూ ఫస్ట్ లిస్టు రెడీ చేసేశాయనీ, త్వరలో ప్రకటించబోతున్నాయనీ, బహుశా ఈ పేర్లు ఫస్ట్ లిస్టులో ఉండవచ్చుననీ రాబోయే తెలంగాణ ఎన్నికల మీద తెగరాసేస్తున్నాయి… టీవీలు, సినిమాల వార్తలకే ప్రాధాన్యం కాబట్టి పెద్దగా వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రాజకీయాల్ని లైట్ తీసుకుంటున్నాయి, టీవీల్లో పెద్దగా రాజకీయ విశ్లేషణలు చేయగల రిపోర్టర్లకు కొరత కాబట్టి వాటిల్లోనూ పెద్దగా కనిపించడం లేదు…
కానీ పత్రికల్లో చాలా వార్తలు వస్తున్నాయి… అవన్నీ మరిచిపోయిన ఓ ముఖ్యమైన సంగతి ఏమిటంటే… కేసీయార్ బుర్ర నిరంతరం రాజకీయాల చుట్టే పరిభ్రమిస్తుందనీ, తన వ్యూహాలు బయట ఎవరికీ అంతుపట్టవనీ, తను మిగతా పార్టీలకన్నా ఎన్నికల దిశలో మైళ్ల దూరం ముందుంటాడని..! మీడియా విశ్లేషణలకు ఎప్పుడూ కేసీయార్ అంతుపట్టడు… తన అడుగులు ముందుగా ఊహించడం కష్టం…
వేరే ప్రముఖ పార్టీలతో పోలిస్తే కేసీయార్ పార్టీలో అంతా తనిష్టమే… సవరణలు, అభిప్రాయాలు చెప్పే గొంతులు ఉండవు… మంచైనా సరే, చెడైనా సరే ఒక్కరి చేతుల మీద నడుస్తుంది పార్టీ… కాంగ్రెస్, బీజేపీల్లో అది కుదరదు… ప్రతిదానికీ హైకమాండ్స్ అనబడే ఢిల్లీ దర్బార్లు నిర్ణయాలు తీసుకుంటాయి… రకరకాల పైరవీలు నడుస్తుంటయ్… ఫలానా వారికి పార్టీ టికెట్టు అనే గ్యారంటీ ఏమీ ఉండదు… అంతెందుకు..? గత ఎన్నికల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీటుకే ఎసరు పెట్టారు తెలుసు కదా…
Ads
పొలిటికల్ అడుగులకు సంబంధించి ఎప్పుడూ మైళ్ల దూరంలో ముందుండే (ఫలిస్తాయా లేదానేది వేరే సంగతి) కేసీయార్ ఆల్రెడీ రాబోయే ఎన్నికల కోసం వేగంగా అడుగులు వేస్తున్నాడు… సంక్షేమ పథకాలకు పదును పెట్టి వరుసగా ప్రకటిస్తున్నాడు… ఆయనకు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కనిపిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తున్నారు, రుణమాఫీ కనిపిస్తోంది… బీసీ బంధు కనిపిస్తోంది… గద్దర్ కనిపిస్తున్నాడు… ఒక్క హైదరాబాద్ జర్నలిస్టులు మినహా అందరూ కనిపిస్తున్నారు తనకు…
అన్నింటికీ మించి రాబోయే రోజుల్లో డబ్బు పంపిణీ వంటి అంశాల్లో బీజేపీ తన కాళ్లుచేతులకు బంధనాలు వేసి, కదలనివ్వకుండా చేస్తుందనే డౌట్ ఉంది తనలో… అందుకే ఎవరికైతే తను ఖచ్చితంగా టికెట్లు ఇస్తాడో వాళ్లకు ముందే ‘‘వర్క్ చేసుకొండి’’ అని చెప్పేస్తున్నాడు… పార్టీపరంగా డబ్బు కూడా పంపిస్తున్నాడు… ఆ డబ్బు ఎవరెవరి దగ్గర భద్రంగా పెట్టాలో కూడా వెల్ ప్లాన్‌డ్… ఎన్నికల ముందు కేసీయార్‌ను కట్టేయడానికి బీజేపీ ఏం చేసినా పెద్ద ఫలితం ఉండదు… ఐనా ఇప్పుడు రెండు పార్టీలూ పరస్పర సుహృద్భావంతో మెలుగుతున్నాయి కాబట్టి ఈ సీన్ రాకపోవచ్చు…
ఎటొచ్చీ కాంగ్రెస్… పార్టీపరంగా ఆర్థికసాయంకన్నా ఎవరి తిప్పలు వాళ్లు పడాల్సిందే… రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అభ్యర్థులను కట్టడి చేయడానికి అన్నిరకాల సాధనసంపత్తులను వినియోగిస్తుంది… ఎలాగూ ఉన్నతాధికారగణం కూడా దాదాపుగా గులాబీ చొక్కాలు ధరించినట్లే వ్యవహరిస్తోంది… ఎలాగూ ఫీల్డ్‌లో బీజేపీ చాలా వేగంగా పడిపోయింది… కాంగ్రెస్ కాస్త పుంజుకున్నట్టు కనిపిస్తోంది… సో, బీజేపీ అభ్యర్థిత్వాలు, పోల్ కసరత్తులపై పెద్ద చర్చ లేదు కానీ కాంగ్రెస్ అడుగుల మీదే అందరికీ ఆసక్తి… ఎందుకంటే, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతాయి కదా…!!
Share this Article