Sai Vamshi…. గాయని జీవితానికి తీరని షాక్… (‘రోజా’ సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ పాటతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు గాయని మిన్మిని. 1993లో లండన్‌లో ఒక స్టేజ్ షోలో ఉన్నట్టుండి ఆమె గొంతు పోయింది. ఆ కారణంగా కొన్నేళ్లపాటు ఆమె సరిగా మాట్లాడలేకపోయారు. పాటలు పాడలేని స్థితికి చేరారు. కొన్నాళ్లకు మళ్లీ గొంతు వచ్చినా పాటలు తగ్గిపోవడంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ఇటీవల ఓ మలయాళ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఇవి…)
1991 నుంచి 1994 దాకా నేను పాటలు పాడుతూనే ఉన్నాను. అప్పట్లో చెన్నైలో ఉన్న అందరు సంగీత దర్శకుల దగ్గరా పని చేశాను. రోజూ రికార్డింగ్స్ ఉండేవి. ‘రోజా’ సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ పాట పాడిన తర్వాత నాకు చాలా పేరొచ్చింది. కానీ అప్పటినుంచే నాకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ సమయంలోనూ నన్ను మర్చిపోకుండా నాకు ఆఫర్లు ఇచ్చిన వ్యక్తి సంగీత దర్శకుడు జాన్సన్.
ఆ రోజుల్లో ఇళయరాజా గారి దగ్గర రోజూ ఒక్క పాటైనా రికార్డింగ్ ఉండేది. ఆయన దగ్గర పాడేందుకు నేనెప్పుడూ అందుబాటులో ఉండాలి అనే స్థితికి వచ్చింది. అక్కడ పాడుతూనే దేవా, కీరవాణి, గంగై అమరన్, విద్యాసాగర్.. ఇలా అందరి దగ్గరా పాడుతూ ఉన్నాను. 1992లో ఎ.ఆర్.రహమాన్ సంగీత దర్శకత్వంలో ‘చిన్ని చిన్ని ఆశ’ పాడాను. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు!
Ads
ఆ తర్వాత ఒక రోజు ఇళయరాజా గారి పాట రికార్డింగ్ కోసం స్టూడియోకి వెళ్లాను. టేక్ చేసే ముందు కొన్ని కరెక్షన్స్ చెప్పేందుకు రాజాగారు వాయిస్ రూంలోకి వచ్చారు. నా పక్కనే గాయకుడు మనో ఉన్నారు. రాజాగారు నాతో మాట్లాడి వెళ్లిపోతూ, వెనక్కి తిరిగి మళ్లీ వచ్చారు. నన్ను చూస్తూ “నువ్వెందుకు ఎక్కడెక్కడో పాడుతున్నావ్? ఇక్కడ మాత్రం పాడితే చాలు!” అని అన్నారు. ఆ మాట వినగానే నాకు షాక్ తగిలినట్టు అయ్యింది. ఏం అనాలో అర్థం కాలేదు. అక్కడే చాలా ఏడ్చాను.
మైక్ ఆన్‌లోనే ఉండటంతో అందరూ విన్నారు. మనో గారు నన్ను సమాధానపరిచారు. ఆ సమయంలో కీబోర్డ్ ప్లేయర్ విజీ ఇమాన్యుయల్ బయటి నుంచి నా దగ్గరకి వచ్చి “ఏడవొద్దు పాపా! ఆయన ఏదో ఆలోచిస్తూ అలా చెప్పి ఉంటారు. నువ్వు అది పట్టించుకోకు! నువ్వు పాడు. కళ్లు తుడుచుకో” అంటూ నన్ను ఓదార్చారు.
నా గొంతు పోవడానికి ఈ సంఘటన ఒక కారణమా అనేది నాకు తెలియదు. కానీ నా మనసులో ఇదొక బాధలా వెంటాడి, అలా జరిగిందేమో మరి! ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఇళయరాజా గారు నన్ను పాట పాడేందుకు పిలవలేదు. ఆయన నా పట్ల చాలా వాత్సల్యంతో ఉన్నారు. కానీ ఈ ఘటన ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్థం కాదు. నా గొంతు పోయిన తర్వాత పాటలు పాడటం ఆపేశాను. 1994లో ‘కరుత్తమ్మ’ తమిళ సినిమాలో పాట పాడేందుకు ఎ.ఆర్.రహమాన్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. కానీ నా గొంతు బాగాలేదని చెప్పాను. “ఇప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నావ్ కదా! ఈ గొంతే చాలు” అని చెప్పారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో వెళ్లి ఆ పాట పాడాను… – విశీ
Share this Article