Amarnath Vasireddy…. కాలిపై కాలు వేసుకొని జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు – .. అనే డోపమైన్ హై కథ ! తండ్రి – కష్టపడి ఎదిగి పారిశ్రామిక వేత్త అయ్యాడు. కూతురంటే అమితమయిన ప్రేమ . పెళ్ళీడొచ్చిన ఆమె కోసం మంచి సంబంధం వెదికాడు . శ్రమ ఫలించింది. వెయ్యి కోట్ల సంపద కలిగిన ఉన్నత శ్రేణి పారిశ్రామిక వేత్తల సంబంధం . ఒక్కడే కొడుకు .
అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది .” అదృష్టం అంటే ఆమెదే .. ప్రేమంటే ఆ తండ్రిదే” అని అందరూ కొనియాడారు . ఇప్పుడామె కాపురం చేస్తోంది . లంకంత ఇల్లు . ఇంట్లో ఎప్పుడూ ఆరుగురు పనివారుంటారు . ముగ్గురు వంటవారు. పొద్దునే కనీసం అరడజను బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ డైనింగ్ టేబుల్ పై ఉంటాయి .
మామగారు భోజన ప్రియుడు . ఏరి కోరి స్టార్ హోటల్ లో చెఫ్ గా పని చేసిన వ్యక్తిని నియమించుకున్నాడు . ఆహా ఏమి రుచి .. అన్నట్లుంటాయి ఆహార పదార్థాలు . టిఫిన్ అయ్యాక కాసేపు స్మార్ట్ టీవీ.. లేటెస్ట్ మోడల్ ఆపిల్ ఫోన్ . భర్త ఇండస్ట్రీ పనులు చూసుకొంటారు . ” ఇంటి కోడలు ఇండస్ట్రీకి వెళ్లాల్సిన అవసరం లేదు . అక్కడ రఫ్ అండ్ టఫ్ మనుషులుంటారు . కావలిస్తే ఇంకో ఇద్దరు మేనేజర్లను పెట్టుకొంటాము .. ఇంటి కోడలు ఇండస్ట్రీ కి పోవడం ఎందుకు ? హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చెయ్యక ” అంటారు మామగారు అత్తగారు .
Ads
మధ్యాహ్నం లంచ్ . ఆపై కాసేపు నిద్ర . ఓటిటి సినిమా . ఇంటి బయట రెండు బెంజ్ కార్లు ఎప్పుడూ సిద్ధం . డ్రైవర్లు వుంటారు . సాయంకాలం కాసేపు దగ్గరలోని పార్క్ లో వాకింగ్ కెళ్లొచ్చు . రాత్రికి డిన్నర్ . సంవత్సరానికి రెండుసార్లు భర్తతో కలిసి ఫారిన్ టూర్ . కావలసినప్పుడు పెద్ద మాల్స్ లో షాపింగ్ . ఆమెకు తండ్రి పెట్టిన నగలు, పది కిలోల దాకా వున్నాయి . ఇంకా కావాల్సిన డ్రెస్సులు, నగలు ఎన్నయినా కొనుకోవచ్చు . చేతిలో క్రెడిట్ కార్డు . భర్త , అత్తామామ ఎప్పుడూ లెక్క అడగరు . ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు .
ప్రేమించే భర్త . సొంత కూతురులా చూసుకొనే అత్తామామలు . “పెట్టి పుట్టింది . బతికితే ఇలా బతకాలి . కాలిపై కాలేసుకుని దర్జాగా జీవితాంతం బతికే అదృష్టం ఎంతమందికి ఉంటుంది ? ” .. ఇవీ ఆమె గురించి నలుగురూ అనుకొనే మాటలు . మీరు ఆమె జీవితం గురించి ఏమనుకొంటున్నారు ? మీ ఇంటి అమ్మాయికి ఇంత మంచి సంబంధం దొరికితే బాగుండు అనుకొంటున్నారా ?
మీరే కాదు . నూటికి తొంబై ఎనిమిది మంది ఇలాగే ఆలోచిస్తారు. ఒక గొప్ప కుటుంబంలో ఇస్తే కూతురు సుఖపడుతుంది అనుకొంటారు . నాణేనికి మరో వైపు చూద్దామా ?
ఆమెకు కొన్నాళ్ళు హ్యాపీగానే లైఫ్ గడిచింది . ఇప్పుడేంటో తెలియదు . చెప్పలేని అసంతృప్తి . తనదీ ఒక బతుకేనా ? గానుగెద్దు బతుకు . లంకంత కొంప కాదు .. ఫైవ్ స్టార్ జైలు తనది . ఏదో తెలియని అసంతృప్తి . ఎవరైనా చెబితే నవ్వి పోతారు . “ఏంటమ్మా నీకు సమస్యలు ? భర్త సరిగా చూసుకోవడం లేదా ? అత్తా మామ పోరా ?” అని అడుగుతారు.
అయ్యో… వారు బంగారం . మరేంటి తన సమస్య ? ఎందుకు ఆమెలో అసంతృప్తి ? ఎందుకు లైఫ్ ను ఆమె ఎంజాయ్ చేయలేక పోతోంది ? ఎందుకు మెల్లమెల్లగా డిప్రెషన్ స్థాయికి చేరుకొంటోంది ?
కాలిపై కాలేసుకుని గంట కూర్చుంటే తిమ్మిరి పట్టేస్తుంది . అలాంటిది జీవితాంతం కాలిపై కాలేసుకుని కూర్చుంటే జీవితానికే తిమ్మిరి పట్టేస్తుంది .
సైన్స్ భాషలో దాన్నే డోపమైన్ హై అంటారు . దేన్నైనా అతిగా అనుభవిస్తే అందులో మాధుర్యం పోతుంది . బాగా రుచికరమైనయినా వంట నాలుగు రోజులు తింటే మీకు బోర్ కొట్టేస్తుంది . వంటైనా జీవితమయినా అంతే .
బాగా ఆకలేసినప్పుడు తినే పప్పన్నం ఎంత రుచో ! బాగా దప్పికేసినప్పుడు తాగే మంచి నీరు ఎంత హాయినిస్తుందో ? బాగా చెమట పట్టినప్పుడు చల్లటి గాలి వీస్తే ఎంత బాగుంటుందో . అనేక అపజయాల తరువాత వచ్చే విజయం ఎంత కిక్ నిస్తుందో ! దేవుడు / ప్రకృతి . భలే భలే సెట్ చేసాడు . సంతోషం కలిగితే డోపమైన్ హార్మోన్ వస్తుంది . సంతోషం తరువాత కాస్త కష్టముండాలి . అప్పుడే తిరిగీ సంతోషం కలుగుతుంది . అది ప్రకృతి రూల్ . సృష్టిలో వున్నది మొత్తం తనకే అన్నట్టు లాగేసుకొని ఎంజాయ్ చెయ్యడం మొదలెడితే సంతోషం కాదు . సమస్యలు వస్తాయి .
ఒక పెగ్ తాగితే కిక్. అదే కిక్ రావాలనుంటే కొన్ని నెలలకు ఫుల్ బాటిల్ కావాలి . అయినా కిక్ రాదు . అర్థం కాలేదా ? అప్పుడెప్పుడో దూరదర్శన్ కాలంలో .. శుక్రవారం చిత్రలహరి, శనివారం తెలుగు సినిమా వచ్చేది . గుర్తుందా ? అబ్బా .. ఎంత ఉల్లాసం .. ఉత్తేజం . శుక్రవారం కోసం ఎంతగా ఎదురు చూసేవారం ? . చిత్రలహరి చూసిన తరువాత ఎంత ఆనందం?
ఇప్పుడో? .. వామ్మో .. ఏ ఛానల్ పెట్టిన సినిమాలు .. పాటలు . అయినా బోర్ .. బోర్. రిమోట్ నొక్కుతూ నొక్కుతూ .. .. “ఛీ ఇదీ ఒక బతుకేనా అనిపిస్తోంది” . అవునా? కాదా ? అదేనండి డోపమైన్ హై . ఆమె బాగా చదువుకొంది. తెలివయినది . నాయకత్వ లక్షణాలు మెండుగా వున్నాయి . ఆమె చదువు- తెలివితేటలు ఇప్పుడు అడవి గాచిన వెన్నెల . పరాన్నబుక్కు జీవితం . తినడం కోసం బతకాల్సి వస్తోంది . మళ్ళీ పడుకోవడం కోసం నిద్ర లేవాల్సి వస్తోంది . సోమవారం మంగళవారం .. బుధ గురు శుక్ర శని ఆది వారాలు .. జనవరి నుంచి డిసెంబర్ దాాకా అన్ని నెలలూ తనకు ఒకటే . అదే రొటీన్ . బోర్ . బోర్ . అతి సుఖం . డోపమైన్ హై .
పుట్టింది ఎందుకు ? ఏమి సాధిస్తోంది ? పుట్టలో చెదలు పుట్టదా గిట్టదా ? తన బతుకూ చెదబతుకే. తండ్రి అత్తా మామ భర్త… తనకో అందమయిన బంగారు పంజరం తయారు చేసారు . ఫారిన్ పళ్ళు దానికి .. తనకూ అంతే . అంతా కాస్ట్ లీ లైఫ్ . జీవితంలో ఆనందం ఆవిరై పోయింది . బతుకంటే ఇంట్లో తొంగోని, తిని నిద్ర పోవడం కోసమే అయితే తాను ఎందుకు చదివినట్టు ? అవును .. తన నాన్నమ్మ, వారి ముందు ముందు తరాల స్త్రీలు ఇంటి పట్టునే ఉండేవారు . తాను అలాగే బతకాలి అనుకొంటే తనని ఎందుకు చదివించినట్టు ?
వారానికొక్కసారి వచ్చే చిత్రలహరి కోసం ఆఫీస్ నుండి త్వరగా ఇంటికొచ్చి.. త్వరగా వంట చేసి… ఎదురు చూసినమ్మ ఇప్పుడు రిమోట్ పట్టుకొని ఎందుకు పదే పదే ఛానల్ మారుస్తోందో .. తన బతుకు అంతే . చీకటి వెలుగుల రంగేళీ .. జీవితమే ఒక దీపావళి . సమస్య లేని బతుకూ ఒక బతుకేనా ? సమస్యలన్నీ మీరు అనుభవించి మీ కొడుక్కి / కూతురికి సమస్యల్లేని జీవితం ఇవ్వాలని చూస్తున్నారా ? అయ్యో .. ఎంత అన్యాయం ?
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెదుక్కొంటే రాటుదేలుతారు . నాయకులవుతారు . డోపమైన్ హై రాదు . సమస్యలన్నీ మీరు అనుభవించి వారికి వడ్డించిన విస్తరి లాంటి జీవితం ఇస్తే .. వారికి తమ జీవితమే సమస్య అయిపోతుంది . జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారముంటుంది . కానీ జీవితమే ఒక సమస్యే అయితే ? మానసిక వైద్యుడు / ఉరితాడు . మీ ఇల్లు బొమ్మరిల్లు కావాలి . కానీ మీరు బొమ్మరిల్లు ఫాదర్ కావొద్దు . అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత …
Share this Article