Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొందరు బ్రాండ్లను నమ్ముకోరు – వాళ్లే స్వయంగా బ్రాండ్లు అవుతారు…

March 22, 2026 by M S R

.

ముచ్చటగా మూడు ముళ్లు.. మురిపించే ముస్తాబు: బ్రాండ్లు వద్దు.. సంప్రదాయమే ముద్దు!

ప్రస్తుతం దురంధర్ సినిమా పుణ్యమాని… దర్శకుడు ఆదిత్య థర్‌తోపాటు ఆయన భార్య, నటి యామీ గౌతమ్ కూడా వార్తల్లోకి బలంగా వస్తోంది… వాళ్ల వ్యక్తిగత విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి…

Ads

ఓ వార్త ఏమిటంటే..? వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు… ఆమెవి హిమాచలీ రూట్స్… (పుట్టింది మండి జిల్లాలో, ప్రస్తుతం కంగనా రనౌత్ నియోజకవర్గం, యామీ తండ్రి ఓ దర్శకుడు, తను పంజాబీ సినిమాలు తీసేవాడు కాబట్టి చండీగఢ్‌లో ఉండేది ఆ కుటుంబం…)

ఆదిత్య రూట్స్ కశ్మీర్… అక్కడి నుంచి మతం పేరిట నిర్దాక్షిణ్యంగా తరిమేయబడిన పండిట్స్… ఢిల్లీకి వలస వచ్చిన (రాబడిన) కుటుంబం వాళ్లది… మొదట తమ పెళ్లికి ఓ ఫేమస్ డ్రెస్ డిజైనర్ దగ్గరకు వెళ్లింది… అప్పటికి ఆమె చిన్న నటి, ఆదిత్య పెద్దగా తెలిసిన పేరూ కాదు…

ఆ ఫేమస్ డిజైనర్ పెళ్లి దుస్తులను ఇవ్వడానికి నిరాకరించాడు… కారణం, తను హై ప్రొఫైల్ సెలబ్రిటీలకు మాత్రమే ఇస్తాడట, చిన్న (?) స్థాయి నటులైతే తన విలువ పడిపోతుందట… అప్పుడు యామీలో ఓ ఆలోచన… ఆదిత్యకు చెప్పింది… నవ్వుతూ సరే అన్నాడు…

పక్కాగా ఆమె హిమాచలీ ఆహార్యం… ఆయన కశ్మీరీ సంప్రదాయం… పెళ్లిబట్టలు, పెళ్లి తంతు మొత్తం పక్కా సంప్రదాయ పద్ధతిలో సాగాలి… ఎవరి కోసమో కాదు కదా, ఎవరు చప్పట్లు కొట్టడానికో కాదు కదా, మన పెళ్లి, మన సంబరం, మన కల్చర్… ఇదీ ఆలోచన… వేదిక హిమాచల్ ప్రదేశ్‌లోని యామీ ఫామ్ హౌజ్…

అంతేకాదు, ఆమె తల్లి 33 ఏళ్ల క్రితం ధరించిన ఎర్రటి పెళ్లి పట్టుచీరను ధరించింది… హిమాచలీ మార్క్ ముక్కుపుడక… దీన్ని ‘పహాడీ నత్’ (Pahadi Nath) అంటారు… ఇది హిమాచల్ సంస్కృతిలో ముఖ్యమైంది… (తన సంప్రదాయిక పెళ్లి  ద్వారా హిమాచల్ సంప్రదాయాన్ని సెలబ్రిటీ పటాటోప ప్రపంచం కొత్తగా మాట్లాడుకునేలా, అభినందించేలా చేసింది ఆమె)…

కాశ్మీరీ పండిట్ సంప్రదాయం ప్రకారం ఆదిత్య  ‘పిరోజ్’ ధరించాడు… కోట్ల రూపాయలకు ప్రసార హక్కులు, వీడియోలు, ఫోటోలు అమ్ముకోలేదు… అట్టహాసాలు, ఆడంబరాలు లేవు… ఆ ఫామ్ హౌజ్‌లో ఆత్మీయుల నడుమ రెండు సంప్రదాయల జుగల్‌బందీ వేడుకలు జరిగిపోయాయి…

yami

ఒక విలాసవంతమైన ‘ఈవెంట్’లా మారిపోయింది ఇప్పుడు సెలబ్రిటీల పెళ్లంటే… లక్షల రూపాయల డిజైనర్ లెహంగాలు, పట్టుచీరలు, బట్టలు, వేలల్లో పారితోషికం తీసుకునే మేకప్ ఆర్టిస్టులు, సోషల్ మీడియాలో లైకుల కోసం చేసే హంగులు… ఇవే నేటి పెళ్లిళ్లలో కనిపిస్తున్న ఆధునిక పోకడలు… కానీ, ఈ కృత్రిమ మెరుపుల మధ్య ఇదుగో ఆదిత్య, యామీ పెళ్లి అందుకే డిఫరెంట్… రూట్స్‌ను గౌరవించే పద్ధతి…

ఇదంతా చదువుతుంటే మొన్నటి విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి తంతు గుర్తొచ్చింది… దాదాపు సేమ్, రష్మిక కూర్గ్, కొడవ సమాజం… ఆ పద్ధతులు కాస్త డిఫరెంట్, అది ఓ మిలిటరీ జాతి… పెళ్లి పద్ధతి, బట్టలు అన్నీ డిఫరెంటుగా ఉంటాయి… విజయ్ అఫ్‌కోర్స్, పక్కా తెలంగాణ, మానుకోట బిడ్డ…

విజయ్

పెళ్లి అనేది ఓ వేడుక… అది ఆడంబర ప్రదర్శన కాదు, ఆత్మీయంగా జరగాలి, సంప్రదాయపు, మూలాల గుర్తింపు, గౌరవం… ఈ రెండు జంటలూ చూపించింది అదే… విజయ్, రష్మిక పెళ్లి కూడా కొడవ, తెలంగాణ పెళ్లి పద్ధతుల మేళవింపు… అందుకే ఆదిత్య, యామీ పెళ్లి సంగతులు చదువుతుంటే విజయ్, రష్మిక పెళ్లి గుర్తొచ్చింది అందుకే… ఇలాంటి వాళ్లు బ్రాండ్లను నమ్ముకోరు, వాళ్లే బ్రాండ్లుగా మారతారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions