ఖచ్చితంగా వార్తే… సమాచార, ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఓ ఉన్నతాధికారి, పేరు చంద్రవదన్, ఆంధ్రజ్యోతిని తొక్కేద్దామని ముఖ్యమంత్రి కేసీయార్ 2014లోనే తనకు చెప్పాడని వెల్లడించడం ఖచ్చితంగా వార్తే… పత్రికలు, మీడియాకు సంబంధించి వార్తే… అణిచివేయాలని, ప్రకటనలు ఆపేయాలని ఆదేశించాడని కూడా ఆయన వెల్లడించాడు… ఎప్పుడు..? ఇదే మీడియా సంస్థ నిర్వహించిన ఒక డిబేట్‌లో పాల్గొని చెప్పాడు…
స్వాతంత్య్ర వేడుకలకు కూడా ఏబీఎన్- ఆంధ్రజ్యోతిని పిలవకపోవడంపై అవమానంగా భావించిన ఆంధ్రజ్యోతి ఈ డిబేట్ పెట్టినట్టుంది… సరే, చంద్రవదన్ సంబంధిత అధికారే కాబట్టి ఆయన చెబుతున్నది నిజమే అని కాసేపు నమ్ముదాం… రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎవరైనా తెలంగాణ ఏర్పాటు స్పూర్తికి విరుద్ధంగా వెళ్తే ఆ మీడియాను పాతేస్తానని బెదిరించింది కూడా నిజమే…
ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం అనుకూల మీడియా కావడం, ఆంధ్రా లేదా ఆంధ్రా రూట్స్ యాజమాన్యాలు కావడం, అప్పట్లో తెలుగుదేశం నేత చంద్రబాబు కేసీయార్ ప్రభుత్వాన్ని అస్థిరతకు గురిచేసే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా కేసీయార్ సీరియస్‌గా హెచ్చరించి ఉండవచ్చు… పెద్దగా నమ్మకపోవడానికి ఏమీ లేదు… ఇప్పటికీ ఆ రెండు పత్రికల ధోరణి యెల్లో బాటే… పైగా పాలకులకు ఎప్పుడూ పత్రికలు కంట్లో నలుసులే… కేసీయార్ అయితే మరీనూ… ప్రశ్నను అస్సలు సహించలేడు… జర్నలిస్టులన్నా, మీడియా అన్నా తనకు గిట్టదు… హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాలపై తన ధోరణి చూస్తున్నదే కదా…
Ads
ఎవరికీ అర్థం కానిది ఏమిటంటే… నిజంగా కేసీయార్‌కు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చెడిందా..? అప్పట్లో జాన్ జిగ్రీ దోస్తులు… అదేదో పాత ఇంటర్వ్యూలో రాధాకృష్ణ ఏకంగా కేసీయార్‌ను రారా పోరా అని సంబోధించడం కూడా కనిపిస్తుంది… మరి వాళ్లిద్దరి నడుమ ఎందుకు చెడింది..? సరే, ఏదో గుప్త కారణంతో చెడిందే అనుకుందాం… మరి మధ్యలో బాగానే ఉన్నారుగా… దానికి కారణమేమిటి..? మళ్లీ ఎందుకు దెబ్బతిన్నయ్ సంబంధాలు..?
ఏ విపత్తు, ఏ ప్రమాదం సంభవించినా కేసీయార్ ఇల్లు కదలడు… కొండగట్టు ప్రమాదం మనకు తెలిసిందే కదా… కానీ ఆంధ్రజ్యోెతి ఆఫీసులో ప్రమాదవశాత్తూ ఒక ఫ్లోర్ దగ్ధమైపోతే కేసీయార్ హుటాహుటిన వెళ్లాడు… పరామర్శించాడు… ఏదో ప్రభుత్వ స్థలాన్ని ఆఫర్ చేశాడని కూడా ఓ ధ్రువపడని వార్త అప్పట్లో వ్యాపించింది… కేటీయార్, కవిత కూడా రాధాకృష్ణను అంకుల్ అంకుల్ అని సంబోధిస్తూ ప్రేమగా, గౌరవంగా ఉంటారు… బీఆర్ఎస్ నాయకులు సరేసరి…
మరి అంతటి సన్నిహితుడి మీద ఏ కోపంతో తొక్కేద్దామని కేసీయార్ నిర్ణయం తీసుకున్నాడు..? మళ్లీ ఎందుకు ప్యాచప్ అయిపోయింది..? ఎవరికీ అంతుపట్టని మిస్టరీ… నిజంగానే ఈమధ్య గతంలో ఎప్పుడూ లేనట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాధాకృష్ణ నెగెటివ్ ధోరణితో వెళ్తున్నాడు… అటు జగన్, ఇటు కేసీయార్… రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ తను ఇప్పుడు వ్యతిరేకమే… సరే, జగన్ మీద ఏదో ఆజన్మ ద్వేషం ఏదో ఉన్నట్టుగా… ఎలాగూ చంద్రబాబు ప్రత్యర్థి కాబట్టి ఆ వ్యతిరేకత చూపిస్తున్నాడేమో… మరి కేసీయార్ మీద..?
ప్రకటనలు ఇవ్వకపోతే పోనీ అని రాధాకృష్ణ తేలికగా తీసుకోవచ్చు… మరి అలాంటప్పుడు స్వాతంత్య్ర వేడుకలకు పిలిస్తే ఎంత..? పిలవకపోతే ఎంత..? రాధాకృష్ణ సీక్రెట్ కెమెరాలు, స్పై మైకులు నాయకుల ఆంతరంగిక గదుల్లో కూడా పనిచేస్తుంటాయని చెబుతుంటారు కదా… పంద్రాగస్టు వేడుకల్ని కవర్ చేయలేడా..? అవునూ, చంద్రవదన్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు వెల్లడిస్తున్నట్టు..? చాలామంది ఉన్నతాధికారులకు తరువాత కాలంలో సలహాదారు కొలువులు దొరికాయి కదా ఈయనకెందుకు దొరకలేదు..? ఆమధ్య బీజేపీలో కూడా చేరినట్టున్నాడు కదా..!!
Share this Article