మొత్తానికి బీఆర్ఎస్ అధినేత కేసీయార్‌ను ఒక విషయంలో మెచ్చుకోవాలి… అసలు ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే ఆరేడు మినహా మొత్తం స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేయడం స్థూలంగా చూస్తే సాహసమే… అది పార్టీ మీద తనకున్న గ్రిప్‌ను సూచిస్తోంది… అంతేకాదు, అభ్యర్థుల ఎంపికలో అందరూ సందేహించినట్టు కేటీయార్, హరీష్‌లు సహా ఇంకెవరినీ వేలు పెట్టనివ్వలేదు… లిస్టులు పైపైన చూస్తే అలాగే అనిపిస్తోంది కదా… కానీ అది నిజం కాదు….
జనరల్‌గా పల్లెల నుంచి, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ సాధారణ అభిప్రాయం ఏమిటంటే..? జనంలో కేసీయార్ మీద వ్యతిరేకత పెద్దగా లేదు, కానీ తన ఎమ్మెల్యేల మీద మాత్రం భారీగానే వ్యతిరేకత ఉంది… కేసీయార్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన వ్యవస్థాపరమైన అలుసుతో అలా పాతుకుపోయి, చాలామంది ప్రజాకంటకులని పేరు తెచ్చుకున్నారు… ఐనా సరే, ఆరేడు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే సాహసానికి కేసీయార్ పూనుకోలేదు…
ఇప్పటిదాకా ముదిరిపోయిన వాళ్లకు టికెట్లు నిరాకరిస్తే బలమైన రెబల్స్ అవుతారేమో, ప్రతిపక్ష అభ్యర్థులుగా మారి బీఆర్ఎస్‌కే థ్రెట్స్ అవుతారేమో… ఇదేనా కేసీయార్ భయం..? రాజయ్య, ముత్తిరెడ్డి వంటి వాళ్లు మాత్రమే ప్రజాకంటకులా..? సీట్లు దొరికిన వాళ్లంతా ప్రజాసంక్షేమవాదులేనా..? కొత్తవాళ్లను పెడితే గెలిపించుకోగలననే ఆత్మవిశ్వాసం లేదా ఇప్పుడు..? అసలు తను పాత కేసీయారేనా..? కొత్త తరానికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ మళ్లీ వాళ్లకే టికెట్లు దేనికి..? మోయడం దేనికి..? కొత్త నాయకత్వం రావద్దా..?
Ads
నిజానికి కేసీయార్ మంచి స్ట్రాటజిస్టు… కానీ ఈ జాబితాలో ‘సిట్టింగులతో తలనొప్పి’ దేనికనే సమీకరణం తప్ప మరో స్ట్రాటజీ ఏమీ కనిపించడం లేదు… అసలు తనే రెండు స్థానాల నుంచి పోటీ చేయడం ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పంపించినట్టే… రెండింట్లోనూ గెలిచి, తరువాత కామారెడ్డిని బిడ్డ కవితను అప్పగించవచ్చుననే వ్యూహం ఉందేమో తెలియదు గానీ, ఒకవేళ అదే నిజమైనా సరే సరైన స్ట్రాటజీ కాబోదు…
స్టేషన్ ఘనపూర్ రాజయ్యకు టికెట్టు నిరాకరించారు… ఒకప్పుడు ఇదే కేసీయార్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం… చివరకు తనకే టికెట్టు లేదిప్పుడు… పోనీ, రాజయ్య అనర్హుడు సరే, ఇప్పుడు టికెట్లు దొరికినవాళ్లంతా నిజంగా అర్హులేనా..? పల్లా రాజేశ్వరరెడ్డి కోసమేనా జనగామ ముత్తిరెడ్డిని పంపించేసింది..? ఇద్దరూ నాన్- లోకల్ కేండిడేట్లే కదా… మైనంపల్లి వంటి నేతలు ఏం మాట్లాడినా సరే తనను ఆ మల్కాజిగిరికే పరిమితం చేసి, మెదక్ కూడా కావాలన్న కోరికను డోన్ట్‌కేర్ అని తీసిపారేశారు కదా, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టే కదా, మరి ఆ ధైర్యం మిగతా సిట్టింగ్ నాయకుల విషయంలో ఏమైంది..?
పరిస్థితులను బట్టి అభ్యర్థుల మార్పు ఉంటుందనే కేసీయార్ మాట నిజంగానే మాటవరుసకు… పెద్దగా మార్పులేమీ ఉండవు… ఈ జాబితాలు చెబుతున్న సత్యం కూడా అదే… వేములవాడలో ఎమ్మెల్యే పౌరసత్వం మీద కేసులు నడుస్తున్నాయి కాబట్టి అనివార్యంగా ఆయన్ని మార్చేసి వేరెవరినో ఎంపిక చేశారు… పుట్టా మధు అభ్యర్థిత్వం ఆశ్చర్యపరిచిన మరో విశేషం… ఇలా చెబుతూ పోతే బోలెడు… అవునూ, ఆమధ్య కవిత అరెస్టు ఖాయం అనే ప్రచారం జరిగినప్పుడు ఆమె మహిళలకు రిజర్వేషన్ల మీద ఉధృత పోరాటం చేస్తానని ప్రకటించింది కదా… అమ్మా… మీ తండ్రి గారు ప్రకటించిన మా పార్టీ అభ్యర్థుల జాబితాలో ఎందరు మహిళలున్నారో ఓసారి లెక్కించు…!!
చివరగా…. ప్రధాని కావాల్సిన కెసిఆర్ అసెంబ్లీకి పోటీ చేయడం ఏమిటీ..!!!
Share this Article