Off-line Murder: ద్వాపర యుగం వరకు దేవుళ్లు, రాక్షసులు, మనుషులకు విడి విడిగా డ్రస్ కోడ్ ఉండేది. దేవుళ్లకు కనురెప్పలు మనలాగా పదే పదే పడవు. అనిమేషులు. భూమి మీద కనీసం ఒక అడుగు పైన వారు గాల్లో ఉండాల్సిందే కానీ…భూమి మీద దిగడానికి వీల్లేదు. వారి మొహం వెనుక సూర్య లేదా చంద్ర కాంతి దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. రాక్షసులు నల్లగా సింగరేణి బొగ్గు సిగ్గుపడేలా ఉండేవారు. నెత్తిన కొమ్ములు, నోట్లో కోరపళ్లు, వాడి గోళ్లు, చింపిరి జుట్టు, మెడలో ఎముకల హారాలు, చేతిలో కత్తితో చూడగానే వణుకుపుట్టేలా ఉండేవారు. మనుషులు మనుషుల్లానే ఉండేవారు.
కలియుగంలో దేవుళ్లు, రాక్షసులు మనుషుల్లోనే ఉండాలి తప్ప వారికి విడిగా ఉనికి లేదు. ఉనికే లేనప్పుడు విడిగా వేష భాషలతో కూడా పని లేదు. అంటే మనిషే దేవుడు కావాలి. మనిషే రాక్షసుడు కావాలి. మనిషే మనిషి కావాలి.
“ప్రతిది సులభమ్ముగా
సాధ్యపడదులెమ్ము ;
నరుడు నరుడవుట
ఎంత దుష్కరము సుమ్ము?”
అని దాశరథి మనిషి మనిషి కావడమే చాలా కష్టమని దశాబ్దాల క్రితమే తేల్చిపారేశారు.
“మాయమైపోతున్నడమ్మా! మనిషన్నవాడు” అని అందెశ్రీ చాలా బాధపడ్డారు. అవకాశం దొరికితే చాలు…మనిషిలో మృగం తొంగి చూస్తూ ఉంటుంది. సందు దొరికితే చాలు…మనిషి రాక్షసుడుగా మారిపోతూ ఉంటాడు. నెత్తిన కొమ్ములు, నోట్లో కోర పళ్లు, వాడి గోళ్లు కనపడక చాలా మంది రాక్షసులు మనుషులుగా చలామణి అవుతుంటారు. అసలు రాక్షసుల కంటే వీరు మరింత భయంకరమయినా… మనిషి ముసుగు ఉండడం వల్ల కనుక్కోవడం కష్టమవుతోంది.
Ads
హైదరాబాద్ కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అబ్బాయికి- సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన అమ్మాయితో పెళ్లి జరిగింది. లండన్లో స్థిరపడ్డారు. ఒకమ్మాయి పుట్టింది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. భార్యను హింసించడం మెదలు పెట్టాడు భర్త. ఒక స్థాయి దాటిన తరువాత భర్తపై లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. అప్పటి నుండి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
భార్యపై కక్ష పెంచుకున్న భర్త హైదరాబాద్ లో ఉంటున్న భార్య కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి లండన్ నుండి పెద్ద క్రిమినల్ ప్లాన్ రచించి...అక్కడి నుండే అంతా పక్కాగా అమలు చేశాడు. తన దగ్గర పని చేసే ఒక తెలుగు ఉద్యోగికి ఈ పనిని అప్పగించాడు.
కూతురితో పాటు భార్య తమ్ముడి పెళ్లికి హైదరాబాద్ వెళ్లే టైమ్ తెలుసుకుని…భార్య కుటుంబం మొత్తాన్ని లేపేయాలన్నది ఈ క్రిమినల్ ప్లాన్. మొత్తం కుటుంబానికి విషపు ఇంజక్షన్లు ఎక్కించాలన్న తొలి ప్రయత్నం విఫలం కావడంతో…వంటల్లో వాడే పసుపు, మిరప్పొడి లాంటి పొడులు డెలివరీ అయ్యే విషయం తెలుసుకుని…ఆ పోడుల్లో విషం కలిపారు. ఆ పొడులు వాడిన ఆహార పదార్థాలు తిన్న భార్య తల్లి మరణించింది. ఐదుగురికి కాళ్లు, చేతులు శాశ్వతంగా పడిపోయాయి.
కుటుంబంలో అందరికీ ఏదో ఒక తీవ్రమయిన ఆరోగ్య సమస్య రావడంతో అనుమానం వచ్చి… పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…భర్త పాత్ర బయటపడింది. ఇక ఆ భర్తను భారత్ తీసుకొచ్చి జైల్లో పడేయడం పెద్ద తతంగం. భారత్ లో కోర్టు ఆదేశాలు బ్రిటన్ కు చేరాలి. నేరస్థుల అప్పగింతకు సంబంధించి రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం లండన్లో కోర్టు అనుమతించిన తరువాతే భర్త గారిని గౌరవంగా తెచ్చి హైదరాబాద్ జైల్లో పడేయాలి.
ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో “నో అంటే నో- అంతే” అని అమితాబచ్చన్ చెప్పిన ఒక డైలాగ్. అలా నో అంటే నో అనుకుని మర్యాదగా ఎవరి దారిన వారు వెళ్లకుండా…భార్య, కూతురు, భార్య కుటుంబం మొత్తాన్ని చంపేయడానికి లండన్ నుండి తన చావు తెలివి తేటలన్నిటినీ ఉపయోగించిన భర్తలో ఎందరు నరరూప రాక్షసులు దాగున్నారో!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article