అడ్డెడ్డె… ఇదేం అన్యాయమప్పా… ఈ జగన్ అటు బీజేపీ వాళ్లతోనూ, ఇటు కాంగ్రెసోళ్లతోనూ దోస్తీ చేస్తున్నాడు… మాయ చేస్తున్నాడు… ఎంత దారుణం..? అసలు సోనియాకు, రాహుల్‌కు రాజకీయం తెలియదు, అందుకే జగన్‌ను నమ్మేస్తున్నారు… ఫాఫం… అందుకే కోరి దగ్గరకు వచ్చిన షర్మిలను సందేహంలో పడేశారు… కాంగ్రెస్‌లో ఆమె చేరిక గందరగోళంలో పడింది… జగన్ డబ్బుతో మేనేజ్ చేసి, కాంగ్రెస్ శిబిరాన్ని లోబర్చుకున్నాడు…
అంతేనా..? కాంగ్రెస్ వైపు రాయబేరాలు నడుపుతున్నా సరే జగన్‌కు మోడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు… ఇది రొంబ అరాచకం… ఫాఫం మోడీ… జగన్‌ను గుడ్డిగా నమ్మేస్తున్నాడు… రేప్పొద్దున అవసరమైతే కాంగ్రెస్‌కు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు జగన్ సహకరిస్తాడు… తరువాత మీ ఇష్టం… అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలు పెట్టేశాడు… తను అనుకున్నట్టుగా, ఆశపడుతున్నట్టుగా ఏమీ నడవడం లేదనే అసంతృప్తి ఆ రాతల్లో అడుగడుగునా ద్యోతకం…
పోనీ, ఓసారి ఈ కోణంలో ఆలోచించి చూడు ఆర్కే సాబ్… ‘‘అసలు షర్మిల వర్సెస్ జగన్ అనేదే ఓ పెద్ద అబద్ధం… తెలంగాణలో కేసీయార్ నుంచి మైనారిటీలు, రెడ్లు, పాత వైఎస్ఆర్ అభిమానుల వోట్లను చీల్చడానికి, తద్వారా బీజేపీకి ఫాయిదా చేకూర్చడానికి ఆమెను జగన్ తెలంగాణలో తన రహస్య బాణంగా వదిలాడు జగన్… బీజేపీ కోసమే… ఫాఫం, తెలంగాణ ప్రజలు వీరసమైక్యవాదిగా ప్రచారం పొందిన ఆమెను విశ్వాసంలోకి, పరిగణనలోకి తీసుకోలేదు…
Ads
ఇప్పుడిక ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నయ్… ప్రజలు ఆశీర్వదిస్తే ‘ఇండియా కూటమి’ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు… లీడ్ చేసేది కాంగ్రెసే… ఏమో, గుర్రమెగురావచ్చు… మరప్పుడు తన కేసుల పరిస్థితి ఏమిటి..? కేసులు పెట్టించిందే కాంగ్రెస్ కదా… సో, తన బాణాన్ని ఇప్పుడిక రహస్య ప్రతినిధిగా కాంగ్రెస్ శిబిరంలోకి జగనే పంపిస్తున్నాడు… మరోవైపు డీకే శివకుమార్ ద్వారా డబ్బులతో కాంగ్రెస్‌కు సన్నిహితమవుతున్నాడు… అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ జగన్ ప్రయత్నాలకు సానుకూలంగా స్పందిస్తోంది…
ఒకప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరైంది కూడా డబ్బులతోనే కదా… కేసీయార్ కూడా డబ్బుల రాజకీయాలే కదా చేస్తోంది… అవసరమైతే తనను లీడర్‌గా ఎన్నుకుంటే మొత్తం ప్రతిపక్షాల ప్రచారఖర్చు బాధ్యత తనదేనని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కూడా ఆ ధోరణే కదా… కాకపోతే తనను బీజేపీయేత పక్షాలు నమ్మవు, బీజేపీ గుప్తబాణంగానే పరిగణిస్తాయి…’’ ఈ వాదన ఎలా ఉంది ఆర్కే సాబ్…
ఆమెను తెలంగాణలో పోటీచేయించరట… ఏపీలో కూడా ప్రచారం చేయవద్దట ఇప్పుడు… ఎంత దారుణం అని శోకాలు పెట్టడానికి ముందు… జగన్ నిజంగానే కాంగ్రెస్ పార్టీని డబ్బు కట్టలతో లోబర్చుకున్నదే నిజమైనప్పుడు… తన ప్రయత్నాలు, రాజకీయాలు నిజంగానే సక్సెస్ అవుతున్నప్పుడు… మరిక షర్మిల కాంగ్రెస్‌లో చేరడం సందేహంలో ఎలా పడుతుంది..? జగన్, కాంగ్రెస్ ఒక్కటైతే, రహస్యంగానైనా సరే… అప్పుడిక మా చంద్రబాబు పరిస్థితేమిటి అనేదేనా ఆంధ్రజ్యోతి బాధ…!
సో వాట్..? అవి పట్టుకుని, విశ్లేషిస్తే అది పాత్రికేయ ప్రతిభ, అంతేతప్ప… అయ్యో అయ్యో… షర్మిల కాళ్లుచేతులు కట్టేసి కాంగ్రెస్‌లో చేర్చుకుంటారట, పైగా జగన్ పట్ల సానుకూలంగా ఉంటారట అని ఏడిస్తే ఏం ఫాయిదా ఆర్కే సాబ్…? షర్మిలకు రాజకీయాలు అంతుపట్టడం లేదని తేల్చేస్తే ఎలా..? షర్మిల ఒక బాణం… ధనుర్ధారికి లక్ష్యాలు, ఎత్తుగడలు ఉంటాయి… బాణాలకు కాదు…!!
అన్నట్టు… సోనియా అప్పటి పరిస్థితుల్లో జగన్‌ను వంచడానికి కేసులు పెట్టించింది… ఇప్పుడు కూడా తన అవసరం కోసమే జగన్‌తో చేతులు కలుపుతుంది… మోడీ, రాహుల్… ఎవరి చంకనెక్కాలో తేల్చుకునేది జగన్… దాన్ని తేల్చేది రాబోయే ఎన్నికల ఫలితాలు మాత్రమే… మోడీ, నీ వెనుక ఏం చేస్తున్నాడో తెలుసా జగన్… నీ ప్రత్యర్థి కాంగ్రెస్‌తో ముందస్తు బేరాలు కుదుర్చుకుంటున్నాడు తెలుసా అని రాధాకృష్ణ రాస్తే, అది గుజరాతీలోకి అనువదింపజేసుకుని, వెంటనే జగన్ మీద కోపం పెంచుకుంటాడని, దూరం పెట్టేస్తాడని, తద్వారా జనసేన, బీజేపీ, టీడీపీ ఇక ఒక్కటైనట్టే అని అనుకుంటే, ఆశిస్తే అదీ అసలైన భ్రమ పదార్థం…!!
Share this Article