“మీకేంటి రెండు చేతులా సంపాదిస్తారు .. జీతానికి జీతం, పై ఆదాయానికి పై ఆదాయం ” ఈ మాట ప్రతి జర్నలిస్ట్ తన వృత్తి జీవితంలో అనేకసార్లు విని ఉంటారు . జర్నలిస్ట్ జ్ఞాపకాలు రాస్తుంటే కూడా కొందరు తెలిసినవారు జర్నలిస్టులకు రెండు చేతులా ఆదాయం ఉంటుంది, మీరేమో దినదిన గండం అని రాస్తున్నారు అని అడిగారు . వారి సందేహాలు నిజమే , జర్నలిస్టుల జీవితాలు దినదిన గండం అనేదీ నిజమే .
ఓ సినిమాలో బ్రహ్మానందం ఒకవైపు బాధపడుతున్నట్టు నటిస్తూ మరుక్షణమే ఇంకోవైపు సంతోష పడుతున్నట్టు అద్భుతంగా నటన పండించాడు . చాలా మంది జర్నలిస్ట్ లు ఇలాంటి నటనను దాదాపు రోజూ తన వృత్తి జీవితంలో ప్రదర్శించాల్సి ఉంటుంది . బయటి వారే కాదు రిపోర్టర్లను చూసి సబ్ ఎడిటర్లు , సబ్ ఎడిటర్లను చూసి రిపోర్టర్లు మా కంటే వీరి జీవితమే బెటర్ అని ఈర్ష్య పడుతుంటారు .
నెలనెలా జీతం ఇచ్చే పత్రికల్లో జర్నలిస్ట్ లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని , అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుంది . జీతం ఇవ్వడం మాట దేవుడెరుగు ఉల్టా జర్నలిస్ట్ ల వద్దనే డబ్బులు తీసుకోనే మీడియాలో వారు ఆడింది ఆటగా ఉంటుంది . తిను తినిపించు అనే నినాదం వీరు నమ్ముతుంటారు . అప్పుడప్పుడు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న జర్నలిస్ట్ ల అరెస్ట్ అంటూ వచ్చే వార్తలు ఇలాంటి వారి గురించే .
Ads
నెలనెలా జీతం ఇచ్చే సంస్థల్లో జర్నలిస్ట్ ల జీవితాలు మాత్రం దినదిన గండం లాంటిదే . ఉద్యోగం నిలుపుకోవడానికి బ్రహ్మానందంను మించి నటించాల్సి ఉంటుంది . సంస్థలో ఒక్కరు కాదు బోలెడు మంది బాస్ లు ఉంటారు . కొన్ని సంస్థల్లో బాస్ ల సొంత పనులు చేయకపోయినా ఇబ్బందే .. ఇదే సమయంలో ఇలాంటి పైరవీలు ఎంజాయ్ చేస్తూ ఎదిగే వారు కూడా ఉంటారు . మీరు ఎన్నయినా చెప్పండి .. నిజాయితీగా మన పని మనం చేస్తే బాస్ కే కాదు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని సినిమా డైలాగు చెప్పవచ్చు… కానీ వాస్తవ పరిస్థితి అలా ఉండదు .
****
ఒకరోజు ఆఫీస్ కు వెళ్ళగానే వాతావరణం వేడిగా ఉంది . చీఫ్ రిపోర్టర్ యస్ఎన్ సిఎన్ ఆచారిని పిలిచి ఎడిటర్ శాస్త్రి చెడామడా తిట్టి పంపించారు . సాధారణంగా ఏదైనా ముఖ్యమైన వార్త మిస్ అయితే అలా తిడతారు . దానితో రిపోర్టర్లు అందరూ అప్రమత్తమై తమ బీట్ కు సంబంధించిన వార్త ఏమైనా మిస్ అయిందా అని అన్ని పత్రికలు చూశారు . ఏమీ మిస్ కాలేదు . మరి దేనికోసం ఆ తిట్లు అని విచారిస్తే … ఆస్ట్రేలియాలో భారీ భూకంపమో ఏదో ప్రకృతి వైపరీత్యం .. ఆ వార్త భూమిలో మిస్ అయ్యారు . విషయం తెలిసి ఆఫీస్ లో మౌనంగానే ఉండి .. నవ్వు ఆపుకోలేక మిత్రులం టీ డబ్బా వద్దకు వెళ్లి పగలబడి నవ్వుకున్నాం . ఆస్ట్రేలియాలో ఏదో జరిగితే హైదరాబాద్ లో ఉన్న రిపోర్టర్ కు ఏం బాధ్యత అది డెస్క్ వాళ్ళ పని …
ఐతే ప్రతి తిట్టుకు తెరవెనుక ఓ కథ ఉంటుంది . ఎడిటర్ ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయడానికి ఉపయోగిస్తారు . యజమాని ధృతరాష్ట్రుడు అయినప్పుడు దుర్యోధనుడు పూనడం సహజం . ఈ పుస్తకాలను అమ్మడం జర్నలిస్టుల ప్రధాన విధిగా మారిపోతుంది . ప్రభుత్వ సంస్థలకు పెద్ద మొత్తంలో పుస్తకాలు అంటగట్టారు . బిల్లులు మాత్రం రావడం లేదు . ముఖ్యమంత్రి స్థాయిలో చెబితే తప్ప పని కాదు .
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి . కిరణ్ కుమార్ రెడ్డి ఆచారికి సన్నిహితుడు .. ఎంత స్నేహం అంటే ఓసారి చారికి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే, చారి ‘బాబాయ్ నేను పనిలో ఉన్నాను , తరువాత నేనే కాల్ చేస్తాను’ అని ఫోన్ పెట్టేయడం నా ముందే జరిగింది . అంత సన్నిహితంగా ఉండేవారు పని చెబితే చేయడం లేదు అంటే ఎవరూ నమ్మరు . పుస్తకాల బిల్లుల కోసం ఎడిటర్ చారి మీద ఒత్తిడి , చారి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిని బతిమిలాడడం అసంకల్పిత ప్రతీకార చర్య సూత్రంలా వరుసగా జరుగుతున్నా బిల్లు మాత్రం మంజూరు కాలేదు .
బిల్లు కోసం చారి చిత్త శుద్దితో ప్రయత్నం చేయడం లేదు అని ఎడిటర్ నమ్మకం . చారి ఎంత ప్రయత్నించినా కిరణ్ కుమార్ రెడ్డి వినలేదు . దాంతో అమెరికాలో తుఫాన్ వచ్చినా , , ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చినా చారి వణికిపోయే పోయే పరిస్థితి . పుస్తకాల డబ్బుల కోసం ఎడిటర్ కక్ష కట్టాడు అని అర్థమైన చారి ఇక ఉండలేను అని గ్రహించి భూమిని వదిలేసి డక్కన్ క్రానికల్ లో చేరిపోయారు . మనం నిజాయితీగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే డైలాగు ఇతర ఉద్యోగాలకు పని చేస్తుందేమో కానీ జర్నలిస్ట్ లకు పని చేయదు . ఎడిటర్ పని కాక పోయినా , ఓనర్ కు కోపం వచ్చినా వణికిపోవలసిందే .
ఇదే సమయంలో ఓనర్ పనులు, ఎడిటర్ పనులు చేస్తూ సొంత పనులు చక్కపెట్టుకుని ఎంతో ఎత్తుకు ఎదిగి ఓనర్లు గా మారి సమాజానికి నైతిక విలువలు బోధిస్తున్నవారు కూడా ఉన్నారు . అదేదో సినిమాలో పాము కాటుకు మంత్రం వేసే వాడు పాము కాటుకే పోయాడు అని శ్రీహరి చెప్పిన డైలాగులా , పుస్తకాల అమ్మకాల కోసం ఎందరినో బలి చేసిన ఎడిటర్ ఉద్యోగం చివరకు ఆ పుస్తకాల కాటుతో ఊడింది . ఆ కథ మరోసారి … – బుద్దా మురళి
Share this Article