నిజం… వార్తాపత్రికల పఠనం గ్రామీణ, ఉప-పట్టణ ప్రాంతాల్లో క్రమేపీ తగ్గుముఖం పడుతున్నది… రాజకీయ చైతన్యం ఎక్కువగా కనిపించే ఉత్తర తెలంగాణలో సైతం పాఠకుల పఠన ప్రాధాన్యాలు మారిపోతున్నాయి… సాధారణంగా రోడ్ సైడ్ చిన్న చిన్న హోటళ్లు పత్రికల పఠనకేంద్రాలుగా కనిపించేవి గతంలో…
ఇప్పుడు ఆ కేంద్రాల్లో కూడా జనం ఉదయం నుంచి సాయంత్రం దాకా స్మార్ట్ ఫోన్లలో రీల్స్ చూస్తూ, యూట్యూబ్ చానెళ్లు వీక్షిస్తూ కనిపిస్తున్నారు… ఓ ప్రైవేటు జర్నలిజం సంస్థకు చెందిన జర్నలిజం స్టూడెంట్స్ సహకారంతో జరిగిన ఓ సర్వేలో తేలిన నిజం ఇదే… పాఠకుల అభిరుచిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది…
దశాబ్దకాలంలో ఉత్తర తెలంగాణలో నక్సలైట్ల యాక్టివిటీ బాగా తగ్గిపోయింది… ఆ వార్తల కవరేజీ కూడా లేదు… గతంలో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో నక్సలైట్ల కార్యకలాపాలు, వాటి కవరేజీ అధికంగానే ఉండేది… గతంలో జిల్లా టాబ్లాయిడ్లలో కనీసం 25 శాతం వార్తలు నక్సల్స్ రిలేటెడ్ ఉండేవి…
Ads
పాఠకులు కూడా నక్సల్స్ రిలేటెడ్ వార్తల్ని చదువుతూ, చర్చించేవాళ్లు… గ్రామాల్లో రోడ్ సైడ్ హోటళ్లే రచ్చబండలు కదా, జోరుగా చర్చలు వినిపించేవి… కరోనా అనంతరం చాలా మెయిన్ స్ట్రీమ్ పత్రికలు టాబ్లాయిడ్లను బంద్ పెట్టాయి… గ్రామీణ వార్తల కవరేజీ కూడా బాగా తగ్గిపోయింది…
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వార్తలు కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బాగానే కనిపించేవి… కానీ ఇప్పుడవన్నీ లేవు… ఎలక్ట్రానిక్ మీడియా కొంత, సోషల్ మీడియా మరికొంత పత్రికలపై నెగెటివ్‌గా పడింది… నక్సల్స్ వార్తలు తగ్గిపోయి, ఉద్యమం వార్తలు పెరిగాయి ఓ దశలో… తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఇక ఆ వార్తలూ తగ్గిపోయాయి మలిదశలో…
నిజానికి ఎలక్ట్రానిక్ మీడియా ఎంత రీచ్ పెరిగినా సరే, తొలినాళ్లలో పత్రికల మీద నెగెటివ్ ప్రభావం పెద్దగా లేదు… కానీ ఎప్పుడైతే ఫోన్ నెట్‌వర్క్ పెరిగిందో.., త్రీజీ, ఫోర్ జీ, ఫైవ్ జీ సాయంతో వీడియో న్యూస్ వీక్షణం విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి పత్రికల మీద వార్తల కోసం ఆధారపడటం బాగా తగ్గిపోయింది…
ఒక ఉదాహరణ… హన్మకొండ, రాంపూర్ విలేజ్‌లో ఒక దశలో 125 పత్రికలు వచ్చేవి… 2021 ప్రాంతంలో… రోడ్ సైడ్ హోటళ్లలో పత్రికలు చదివాక జోరుగా చర్చలు సాగేవి… క్రమేపీ ఆ పత్రికల సంఖ్య డబుల్ డిజిట్‌కు పడిపోయింది… హోటళ్లలో పత్రిక పఠనం దాదాపు జీరో ఇప్పుడు… తెలంగాణ ఉద్యమం పీక్స్‌లో ఉన్నప్పుడు టీవీ చానెళ్ల వీక్షణం బాగా ఉండేది… ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, యూట్యూబ్ న్యూస్, డిజిటల్ న్యూస్ ప్రభావం వాటిపైనా పడుతోంది…
చూడబోతే… రాబోయే రోజుల్లో ఉప-పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పత్రిక పఠనం ఇంకా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి… అంతేకాదు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రభావం టీవీ న్యూస్ వీక్షణం మీద కూడా పడే సూచనలున్నాయి… సహజం… కాలానుగుణంగా పాఠకుల అభిరుచుల్లో టెక్నాలజీని బట్టి మార్పులు చోటుచేసుకుంటాయి కదా… (సీనియర్ జర్నలిస్ట్ పీవీ కొండల్ రావు ఇన్‌పుట్స్ ఆధారంగా…)
Share this Article