దక్షిణ తమిళనాడులో అమలులో ఉన్న తలైకూతల్ అనే ఆచారం ఆధారంగా తీసిన సినిమా బారం (బరువు అనే అర్ధం). ప్రియా కృష్ణస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2019 లో జాతీయ అవార్డు గెలుచుకుంది. తలైకూతల్ అనేది వృద్ధాప్యం వలన మంచం పట్టి ఇక వారు కోలుకునే అవకాశం లేదనుకున్న పెద్దవారిని కుటుంబసభ్యులే చంపివేసే దారుణమైన ఆచారం.
మెర్సీ కిల్లింగ్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మెర్సీ కిల్లింగ్ ముసుగులో ఈ తలైకూతల్ అనేది ఒక organized crime గా ఎలా రూపుదిద్దుకుంది అనేది ఈ సినిమాలో చూపించిన ప్రధాన అంశం. యాక్సిడెంట్ అయి కాలి ఎముక విరిగి మంచం పట్టిన తండ్రికి ఆపరేషన్ చేస్తే తిరిగి నడుస్తాడు అని డాక్టర్ చెప్పినా అందుకు ఖర్చు అవుతుందని తలైకూతల్ ముసుగులో తండ్రిని చంపిస్తాడు సెంథిల్ అనే వ్యక్తి . ఆ హత్య గురించి చనిపోయిన ముసలాయన మేనల్లుడు బయటపెట్టిన తర్వాత ఏమి జరుగుతుంది అనేది ఈ సినిమా కథ.
ఈ సినిమా గురించి పక్కన పెడితే తలైకూతల్ చట్ట వ్యతిరేకమైన ఆచారం. కానీ దానికి అక్కడి సమాజ ఆమోదం ఉంది. మంచం పట్టిన వారిని చంపాలి అని కుటుంబం నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు 26 రకాల పద్ధతులున్నాయని చెబుతారు. తలకు నూనెతో మర్దన చేసి కొబ్బరి నీళ్ళు అధికంగా తాగించి దాని ద్వారా కిడ్నీలు పనిచేయకుండా చేసి రెండు రోజులలో మనిషి ప్రాణం తీసే పద్దతిని ఒక మహిళ ద్వారా ఈ సినిమాలో చెప్పించారు.
Ads
దానిని ఆమె ఉచితంగా చేస్తానని దీనిని వారికి చేసే సేవగా భావిస్తానని చెప్పడం అక్కడి సమాజంలో ఈ ఆచారానికి ఎంత గౌరవం, మద్దతు ఉందో తెలియచేస్తుంది. తమను పెంచి పెద్దచేసిన తల్లితండ్రులు మంచంపట్టి ఇక తేరుకోలేని బాధ పడుతుంటే చూడలేక ఈ ఆచారానికి శ్రీకారం చుట్టారని చెబుతారు కానీ దాని ముసుగులో కోలుకునే అవకాశం ఉన్న వారిని కూడా ఎంత దారుణంగా సమాజ ఆమోదంతోనే హత్య చేస్తారు అనేది చూస్తుంటే ఎంత దుర్మార్గమైన సమాజంలో బతుకుతున్నాం మనం అని బాధ కలుగుతుంది.
ప్రపంచంలోనే ఎక్కడా లేని అతి గొప్ప కుటుంబ వ్యవస్థ మనది అని చెప్పుకునే దేశంలో ప్రేమ పేరుతో, దయ పేరుతో కుటుంబమే చేసే హత్యలను ఏ జడ్జిమెంట్స్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మన కళ్ళముందుకు తీసుకువచ్చిన సినిమా ఇది. ఏ నాటకీయత లేకుండా చాలా సహజమైన సన్నివేశాలు, సంభాషణలు నిజానికి ఒక డాక్యుమెంటరీ చూస్తున్న అనుభవాన్ని ఇస్తాయి. ఎటువంటి మనుషుల మధ్య ఉన్నాం మనం అని ఉలిక్కిపడేలా చేస్తాయి.
దక్షిణ తమిళనాడులో ఈ ఆచారాన్ని పాటించే గ్రామాలలో ముసలివాళ్ళు కొందరు తలనొప్పి వచ్చినా మంచాన పడితే పిల్లలు ఎక్కడ చంపేస్తారో అనే భయంతో ఇంటినుండి పారిపోతారని విన్న తర్వాత ఇంత క్రూరత్వం నింపుకున్న సమూహంలోని మనుషులమేనా ప్రేమ, దయ, మానవత్వం వంటి విలువల గురించి సందేశాలిచ్చేది అని బాధ కలిగింది…. (వాట్సప్ నుంచే సేకరణ.., మన సొసైటీలోనే ఇలాంటి క్రూర ఆచారాలు ఇంకా ఉన్నాయా అనే ఆశ్చర్యం, గగుర్పాటు కలుగుతాయి సినిమా చూస్తుంటే… ఇలాంటి కథాంశాలు తెలుగు సినిమా పెద్దలు కలలోనైనా టేకప్ చేయగలరా..? ఈ విశ్లేషణ రచయిత … భారతి కోడె)
Share this Article