సార్, ఇప్పుడు అంతా అయిపొయింది కదా ? కనీసం ఇప్పుడన్నా చెప్పండి ఎన్టీఆర్ ను అధికారం నుంచి ఎందుకు దించేశారు, చెప్పండి అని మీడియా సమావేశంలో బాబును అడిగితే , నన్ను ప్రశ్నార్ధకంగా చూసి, మీ అందరికీ తెలుసు కదా ? అని సమాధానం చెప్పారు . ఇది 95 సెప్టెంబర్ లో జరిగింది . ఎన్టీఆర్ ను ఎందుకు దించేశారో బాబు చెబితే వినాలి అని ఉన్న నా కోరిక తీరలేదు .
ఆ మధ్య ఆహా ఛానల్ లో బాలకృష్ణ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ దించే అంశంలో ఆ రోజు మనం చేసింది కరక్టే కదా ? అని బాలకృష్ణతో ఒప్పించారు కానీ ఎన్టీఆర్ ను దించి 28 సంవత్సరాలు గడిచిపోయినా ఈ రోజుకు కూడా ఎన్టీఆర్ ఏం తప్పు చేశారు , ఎందుకు దించారు అనేది బాబు నేరుగా చెప్పలేదు .
ఇక లక్ష్మిపార్వతి ఎర్ర బస్సు ఎక్కి పోవలసిందే అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీడియా ముందు విమర్శించారు కానీ .. బాబు కాదు. లక్ష్మి పార్వతికి దుష్ట శక్తి అని హరికృష్ణ పేరు పెడితే, సినిమా నటుడు రజనీకాంత్ పాపులర్ చేశారు . దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి అని ఈనాడులో బ్యానర్ వార్త వచ్చింది కానీ . చంద్రబాబు మీడియాలో ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు .
Ads
లక్ష్మిపార్వతి భుజం మీద తుపాకి పెట్టి ఎన్టీఆర్ ను పేల్చేసిన వ్యూహం బాబుది కానీ.. ఆ దంపతులను బాబు ఒక్క మాట అనలేదు . జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ అల్లుడిని అనరాని మాటలు అంటూ క్యాసెట్లు తయారు చేసి జనం మీదకు వదిలారు కానీ బాబు ఎన్టీఆర్ ను ఒక్క మాట అనలేదు .
*******
చంద్రబాబు రాజకీయం అంటే అది …. ఎన్టీఆర్ ను దించేసి మూడు దశాబ్దాలు అవుతున్నా సరే, అదే ఆశ్చర్యం ఇప్పటికీ… ఒక్క మాట అనకుండా దించేయడం ఎలా సాధ్యం అని ఆశ్చర్యం కలుగుతుంది . కానీ ఇది నిజం .. నమ్మకం లేకుంటే పాత పత్రికలు వెతికి చూడండి . జర్నలిస్ట్ లు కావచ్చు , జర్నలిజం విద్యార్థులు కావచ్చు , పరిశోధకులు కావచ్చు ఎన్టీఆర్ ను ఎందుకు దించేస్తున్నామని చంద్రబాబు ఎక్కడైనా చెప్పారా ? గ్రంథాలయాల్లో కాస్త శ్రమిస్తే పాత పత్రికలు దొరుకుతాయి . 95 నాటి పత్రికలు పరిశోధించండి. చాలా మటుకు ప్రభుత్వ గ్రంధాలయంలో 95 నాటి పత్రికలను 95-96 లోనే మాయం చేశారు . వేటపాలెం లాంటి గ్రంధాలయంలో ఉన్నాయి .
*****
ఆగస్టు సంక్షోభం అంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలు కనిపిస్తాయి . ఎన్టీఆర్ ను ఎందుకు అధికారం నుంచి దించేస్తున్నారు , ఎందుకు దించేయాలి , దించేయడం వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది అని బోలెడు వార్తలు , వ్యాసాలు , వ్యాఖ్యానాలు , సంపాదకీయాలు కనిపిస్తాయి కానీ ఒక్క చోట కూడా నేరుగా చంద్రబాబు చెప్పినట్టు వార్త ఉండదు . చంద్రబాబు మనోగతం , చంద్రబాబు భావిస్తున్నారు అనే వార్తలు కనిపిస్తాయి కానీ ఒక్క చోట కూడా నేరుగా బాబు మాట్లాడినట్టు ఉండదు .
ఎన్టీఆర్ సామాన్య నాయకుడు కాదు , వెన్నుపోటుకు గురికాకపోతే దేవేగౌడ స్థానంలో ప్రధాన మంత్రి స్థానంలో ఉండే అవకాశం ఉన్నవారు . కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా పార్టీని గెలిపించిన నాయకుడు . అలాంటి నాయకుడిని గద్దె దించినప్పుడు , అలా దించడానికి నాయకత్వం వహించిన వారు ఎందుకు దించుతున్నామో చెప్పినట్టు మీడియాలో లేదు అంటే ఆశ్చర్యమే . బాబు మనోగతం తప్ప నేరుగా బాబు దించేయడానికి కారణం ఏమిటో ఆ రోజు చెప్పలేదు . ఈ రోజుకు చెప్పలేదు .
భారత రాజకీయాల్లో , మీడియా చరిత్రలో ఇదో అద్భుతం . అద్భుతాలు జరగడానికి కాలం అనేది కీలక పాత్ర వహిస్తుంది . ఆనాటి మీడియా దాదాపు 90 శాతానికి పైగా ఈ కుట్రలో భాగస్వామ్యం . మీడియా మొత్తం అటు ఉన్నప్పుడు ఇది సాధ్యం అయింది . ఆ తరువాత ఎలక్ట్రానిక్ మీడియా రావడం , పత్రికల సంఖ్య పెరగడం , అన్ని పార్టీలకు మీడియా రావడం , తరువాత సామాజిక మాధ్యమాలు వచ్చి ప్రతి మనిషి ఒక మీడియా కావడం వల్ల పరిస్థితులు మారాయి . 90 శాతం మీడియా చెప్పుచేతుల్లో ఉండడం వల్ల ఒక్క మాట కూడా ఓపెన్ గా మాట్లాడకుండా ఎన్టీఆర్ ను దించడం వంటి కార్యం సాధించగలిగారు .
*****
బాబు జైలుకు వెళ్లడంతో పవన్ దూసుకెళ్తున్నారు అని కొందరు .. ఇది పవన్ కు లాభమా ? బాబుకా ? అని లెక్కలు వేస్తున్నారు . అలా లెక్కలు వేస్తున్నారు అంటే చంద్రబాబు రాజకీయంపై అవగాహన లేనట్టే … విశ్వ విఖ్యాత నటసార్వ భౌమను దించేసిన వారికి పవన్ ఓ లెక్కనా ? బిర్యానీ ఆరగించుకున్న వారికి బఠాణీ నమిలినంత ఈజీ . కూటమి అధికారంలోకి వస్తే చేరి రెండున్నరేళ్లు సీఎం అని , ముందు బాబు అని కాదు పవన్ అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు తప్ప బాబు ఓపెన్ గా నోరు విప్పలేదు … అచ్చం దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి వార్తలాగే ఇదీనూ …
పవన్ కళ్యాణ్ పాత వీడియో ఒకటి – మీరు వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి సిద్ధంగా లేము అని పవన్ వార్నింగ్ ఇస్తున్నారు . పవన్ కు తెలియంది ఏమిటంటే .. పవన్ సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు . అసలు తెలియకుండా పోటు పొడిచేంత రాజకీయ సామర్ధ్యం బాబుకు ఉంది …. – బుద్దా మురళి
Share this Article