Nancharaiah Merugumala…. హెచ్1బీ వీజా- ‘ఒప్పంద పనిపత్రంతో నడిచే బానిసత్వం’ అంటున్న పాలక్కాడ్ తమిళ బ్రాహ్మణ అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష టికెట్ అభ్యర్తి వివేక్ రామస్వామి!
……………………………………………………………..
అమెరికాలో తాత్కాలికంగా కొన్నేళ్లు పనిచేయడానికి, నివాసానికి వీలు కల్పించే ఎచ్1బీ వీజా పొందాలని భారతీయులందరూ కోరుకుంటారు. అమెరికా కంపెనీలు ఇప్పించే ఈ వీజాల పద్ధతిని తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రద్దు చేస్తానని వివేక్ గణపతి రామస్వామి ప్రకటించారు. ఇది నిజంగా ఎంతో సాహసంతో కూడిన విషయం. ఇలా మాట్లాడితేనే మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభిమానులకు నచ్చుతుంది మరి. ఇండియాలో ఇప్పుడు ముస్లిం వ్యతిరేకత ఎలా ఓట్లు తెచ్చిపెడుతుందో అదే తీరున– అమెరికాలోకి వలసొచ్చే ఇమిగ్రెంట్లను కట్టడిచేస్తామనే నేతలకు పిచ్చి జనాదరణ ఉంటుంది.
Ads
ఇది పదేళ్లుగా కొనసాగుతున్న అవాంఛనీయ ట్రెండ్. ఈ ధోరణి అమెరికా ప్రయోజనాలకు నష్టమని చాలా మంది పౌరులకు, ఓటర్లకు తెలుసు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి మితవాద రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఈ బయోటెక్నాలజీ (ఫార్మా) మిలియనీర్ రామస్వామి ఇప్పటికే తన ఎన్నికల హామీలతో అలజడి సృష్టించారు.
అమెరికా న్యూజ్ వెబ్‌సైట్ ‘పొలిటికో’కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ అమెరికాలో ఎచ్1బీ వీజాతో పనిచేయడం– ‘కూలి ఒప్పంద పత్రంతో బానిసత్వం చేయడమే’ (ఇన్డెంచర్డ్ సర్విట్యూడ్) అని రామస్వామి వ్యాఖ్యానించారు. తాను అమెరికా అధినేత అయితే హెచ్1బీ వ్యవస్థను ‘మురికి కాలవలో’ పడేస్తానని కేరళలో తమిళ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన పాలక్కాడ్‌లో మూలాలున్న రామస్వామి చెప్పడం విశేషమే.
తాను కూడా తన బయోటెక్ ఫార్మా కంపెనీ రాయ్‌వంట్ కోసం సిబ్బందిని ఇతర దేశాల నుంచి రప్పించడానికి ఎచ్1బీ వీజాల కోసం దరఖాస్తుచేసి వాటిని అవసరమైన సంఖ్యలో పొందానని ఆయన వివరించారు. ప్రతిభాపాటవాల ఆధారంగా (మెరిటోక్రసీ) గాక లాటరీ పద్ధతి ద్వారా ఎచ్1బీ వీజాలు ఇవ్వడం అత్యంత దిగజారుడు వ్యవహారమని రామస్వామి అన్నారు.
‘పాలక్కాడ్ తమిళ బ్రాహ్మణులు’– అయితే ‘కుక్స్’ లేకుంటే ‘క్రూక్స్’:శేషన్
……………………………………………………………………………….
పాలక్కాడ్ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రామస్వామి 38 ఏళ్లకే అధ్యక్ష పదవికి గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీఓపీ– రిపబ్లికన్) టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉత్తర భారత దేశానికి (హిందీ మాట్లాడే ప్రాంతాలు) చెందిన అపూర్వ తివారీ అనే కాన్యకుబ్జ బ్రాహ్మణ మహిళను పెళ్లాడిన రామస్వామి ‘నిర్మొహమాటంగా’, ‘కుండబద్దలు కొట్టినట్టు’ మాట్లాడుతూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ పాలక్కాడ్ తమిళ బ్రాహ్మణ మేధావులు నిజంగా ‘గొప్పవాళ్లే’.
మాజీ సీఈసీ టీఎన్ శేషన్, సినీ నటులు విద్యా బాలన్, ప్రియమణి కూడా పాలక్కాడ్ తమిళ బ్రామ్మలే. శేషన్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉండగా, ‘ పాలక్కాడ్ తమిళ బ్రాహ్మణులు– అయితే వంటోళ్లు (కుక్స్) లేకుంటే జిత్తులమారి దొంగలు (క్రూక్స్) అయి ఉంటారు,’ అని ఓ ఇంటర్వ్యూలో చమత్కరించారు. రామస్వామి మాటలు విన్నాక కేరళ పాలక్కాడ్ బ్రామ్మలు (వారిలోనూ చదువుకున్న బుద్ధిజీవులు) నిర్మొహమాటంగా మాట్లాడతారని, తెలుగు బ్రాహ్మలతో పోల్చితే ‘శానా మంచోళ్లని’ అర్ధమౌతుంది.
అయితే, అంతమంది గొప్పోళ్లున్నప్పటికీ పాలక్కాడ్ తమిళ బ్రామ్మలు ఎవరూ భారత ప్రధాని పదవికి కనీసం రాష్ట్రపతి పదవికి ఎన్నికకాలేకపోయారు. అదే గొప్ప బతుకుతెరువు తెలివితేటలున్న తెలుగు బ్రాహ్మణ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు గారు ఐదేళ్లు ప్రధానమంత్రి పదవిపై నిశ్చింతగా కాలుమీద కాలేసుకుని కూర్చున్నారు.
మళ్లీ వివేక్ రామస్వామి విషయానికి వస్తే–ఆయన ఇమిగ్రేషన్, జాతి ఆధారంగా కోటాలు (రిజర్వేషన్లు) వంటి వివాదాస్పద విషయాలపై డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న అభిప్రాయాలే ఈ యువ అభ్యర్థికీ ఉన్నాయి. రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కే అవకాశం లేకున్నా ట్రంప్ జీఓపీ కాండిడేట్ అయినప్పుడు తాను ఆయనకు రనింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థి)గా ఎంపికైతే చాలనేది రామస్వామి కోరిక అంటున్నారు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ కూడా సగం తమిళ బ్రామ్మణ మహిళ అనే విషయం తెలిసిందే. అమెరికాలో తెలుగువారి కన్నా తమిళలకే ఎక్కువ ‘బ్రాండ్ వాల్యూ’ ఉందనుకోవాలా మరి?
Share this Article