మనకు ప్రగాఢమైన ఓ నమ్మకం… హిందీ వాళ్లు కూడా సౌత్ బాట పట్టారంటే మన దగ్గర క్రియేటివిటీ, కొత్తదనం మత్తళ్లు దూకుతోందని… అందులోనూ తమిళ, మలయాళ దర్శకులైతే కథను కథలాగా… ఓ బేకార్ హీరోయిజాన్ని దగ్గరకు రానివ్వకుండా ఇంప్రెసివ్ కథనాన్ని ప్రజెంట్ చేస్తారనీ… భిన్నమైన కథలతో ప్రయోగాలు చేస్తారనీ మనకు బోలెడంత విశ్వాసం…
అంతే కాదు, హీరోయిన్లలో మలయాళ లేడీస్ అయితేనే నటన ఇరగదీస్తారని కూడా ఓ అంచనా ఉండనే ఉంది… అందం గిందం గాకుండా మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ బాగా పలుకుతాయని అనుకుంటాం… అందులో నిజముంది… కొందరు దర్శకులు చౌకగా భిన్నమైన కథలతో కథన ప్రయోగాలు చేస్తున్నారనేది కూడా నిజమే… కానీ ఈమధ్య గాలి కన్నడ సినిమా వైపు మళ్లింది…
కోలీవుడ్, మాలీవుడ్‌కు దీటుగా శాండల్‌వుడ్ సినిమాలు తీస్తోంది… కేజీఎఫ్, కాంతారా, చార్లి తదితర సినిమాలు కన్నడ ఇండస్ట్రీకి కొత్త దిశను చూపించాయి… చూపిస్తున్నాయి కూడా… రక్షిత్ శెట్టి మనకు రష్మిక మంథన భగ్న నిశ్చితార్థుడిగానే తెలుసు… కానీ తను మంచి నటుడు… చార్లి సినిమా తనలోని అసలైన నటుడిని బయటికి తీసి, కన్నడ ఇండస్ట్రీ బయట ప్రపంచానికి పరిచయం చేసింది… మన తెలుగు ప్రేక్షకులకు కూడా… కేజీఎఫ్ ద్వారా యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు… కాంతారతో రిషబ్ శెట్టి కూడా హైలైట్ అయ్యాడు… కేజీఎఫ్ ద్వారా ప్రశాంత్ నీల్ మరో రాజమౌళి అనిపించుకున్నాడు…
Ads
హీరోయిన్ల విషయానికొస్తే తెలుగు టీవీ సీరియళ్లలో సింహభాగం కన్నడందాలే… ఆశిక పడుకోన్ దగ్గర నుంచి శోభాశెట్టి వరకు బోలెడు మంది స్టార్స్… రష్మిక, శ్రీలీల కూడా కన్నడమే కదా… ఇప్పుడు కొత్తగా రుక్మిణి వసంత్ పేరు చెప్పుకోవాలి… చేసినవి మూడే సినిమాలు… అన్నీ కన్నడమే… కర్నాటక నుంచి అశోక చక్ర పొందిన తొలి కల్నల్ వసంత్ వేణుగోపాల్ బిడ్డ… ఇప్పుడు ఆమె నటించిన Sapta Saagaradaache Ello హిట్…
దాన్ని తెలుగులోకి ‘సప్త సాగరాలు దాటి’ పేరిట అనువదించారు… అనగా డబ్ చేసి వదిలారు… మంచి పేరు తెచ్చుకుంటోంది… ఇద్దరు ప్రేమికుల కథ… కాకపోతే దర్శకుడు హృద్యంగా చిత్రీకరించాడు… ఆ కన్నడ ట్యూన్లు మనకు పెద్దగా ఎక్కవు, వాటిని వదిలేద్దాం గానీ… (కాంతార సూపర్ హిట్ ట్యూన్ మినహాయింపు) మిగతా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి… చెప్పుకోదగింది హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రుక్మిణి వసంత్ నటన… తమ పాత్రలకు ప్రాణం పోసి, ఆ కథను రక్తికట్టించారు… సమర్థుడైన దర్శకుడు, సరైన పాత్రలు దొరికితే నటులు ఎలా ఇరగదీస్తారో చెప్పడానికి వీళ్లు ఓ ఉదాహరణ…
నిజం చెప్పాలంటే… రక్షిత్ శెట్టిని పలు సీన్లలో రుక్మిణి డామినేట్ చేసింది… అంటే రక్షిత్ తక్కువ చేశాడని కాదు… ఆమె తన ముద్రను బలంగా వేసింది అని..! సినిమాటోగ్రఫీ కూడా బాగుంది… ఇక్కడ మనం కథలోకి, ఈ సినిమా రివ్యూలోకి వెళ్లడం లేదు… కన్నడ సినిమా సరిహద్దులు దాటి వ్యాపిస్తోందని చెప్పడానికి ఈ ప్రయత్నం… కన్నడ సినిమాల బిజినెస్ కూడా ఈమధ్య బాగా పెరుగుతోంది… నిర్మాణవ్యయం పెరుగుతోంది… సినిమాల్లో క్రియేటివిటీ, క్వాలిటీ పెరుగుతోంది… గుడ్… గుడ్… అన్నట్టు… ఆల్ ది బెస్ట్ రుక్మిణీ… రష్మిక, శ్రీలీలకు దీటుగా నిలబడాలి నువ్వు…
Share this Article