Padmakar Daggumati……. నేను ఒక ఏడాది కిందట టిడిపికి జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం గురించి ఒకరితో మాట్లాడాను. సరైన వాచకం, ప్రజల్లో గుర్తింపు, ఫాలోయింగ్, నాయకత్వం లక్షణాలు, లోతైన ఆలోచనలు ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ కి ఉండాయికదా, పార్టీని కొత్త నాయకత్వానికి ఎందుకు అప్పగించకూడదు అని.
వాడెందుకండీ.. వేస్ట్ ఫెలో.. లోకేశ్ చాలా మెచ్యూర్డ్ లీడర్ గా మారాడు. మీకే తెలీదు. లోకేశ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ పనికిరాడని అతను అన్నాడు.
ఒక పార్టీని డబ్బుతో మేనేజ్ చేయడం, పాజిటివ్ ప్రచారంతో మేనేజ్ చేయడం, ఇతర పార్టీలపై దుష్ప్రచారం చేయడం, వ్యవస్థలతో కట్టడి చేయడం వంటి ఎత్తుగడలకు కాలం చెల్లింది.
Ads
ప్రజాస్వామ్య వ్యవస్థలో చక్కటి ప్రతిపక్ష పార్టీ ఉండడం వ్యవస్థకి చాలా అవసరం. రానురాను అధికారపార్టీ నేతలను దూషించడమే ప్రతిపక్ష పార్టీ ప్రధాన బాధ్యతగా మారిపోవడంతో టిడిపి అభిమానులకి బాగా ఉండొచ్చేమోగాని, సీనియర్ జర్నలిస్టులు అనేకమంది రాజకీయాలు గురించి రాయాలంటేనే పెంటమీద రాయివేయడం అనే పరిస్థితికి వచ్చేశారు.
దశాబ్దాలుగా బిజెపిని రాష్ట్రంలో అంగుళం కూడా ఎదగనీకుండా చేసిన టిడిపిని… అనేక కారణాలతో… ఇప్పుడు సమూలంగా తుడిచిపెట్టేసేలా బిజెపి పావులు కదిపి యుద్ధం మొదలెట్టి దూసుకుపోతుంది అన్నది వాస్తవం. ఇదంతా తెలిసీ బయటకి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటూ, బిజెపి ప్రాపకం కోసమే ఎదురు చూడక తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపి చిక్కుకుని పోయి, జగన్ ని బూచిగా చూపిస్తుంది. జడ్జీలని కూడా ఆరోపిస్తుంది.
పైగా గతంలో అమిత్ షా రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ కలిసివెళ్లాడు. ఆ విషయాలు బయటకి పొక్కనేలేదు. బహుశా ఆ వివరాలు రామోజీ చంద్రబాబుకి చెప్పాడో లేదో కూడా తెలీదు. చాలామంది విశ్లేషకులు అన్నట్టు టిడిపి తుడిచిపెట్టుకొని పోతే ప్రధాన ప్రతిపక్ష హోదాలోకి రావాలని బిజెపి భావిస్తుందని అనుకోవడానికి అవకాశం ఉంది.
బిజెపి గ్రిప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి అయినా అన్ని బాధ్యతలు ఇవ్వడానికి టిడిపి సిద్దపడుతుందిగాని, జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించడానికి సిద్దపడడంలేదు. లోకేష్ కి తనని తాను నిరూపించుకోవడానికి పాదయాత్రలో అవకాశం వచ్చిందిగాని, కేవలం సవాళ్లకి తిట్లకి పరిమితం అవడంతో ప్రజలకి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ పోయింది. నాయకుడు సౌమ్యంగా, ఉదాత్తుడిగా ఉండాలని అభిమానులు భావించకపోవచ్చు, కాని ప్రజలు భావిస్తారు. తగినంత రాజకీయ చైతన్యం ఉందని పాదయాత్రలో తాను నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం వదిలి రెడ్ బుక్ లో పేర్లు రాస్తుండానని పదేపదే అనడంతో తాను కేవలం ప్రతీకార రాజకీయాలు మాత్రమే చేస్తాడనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుని పోయింది. చంద్రబాబును కేసులు చుట్టుముట్టిన ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ పార్టీని కాపాడగలడనేది వాస్తవం.
అన్నీ ఉండి జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు ఆహ్వానించడంలేదనే కారణాలు రెండు. ఒకటి దాదాపు అందరికీ తెలిసిందే. రెండవది అర్ధిక కోణం. మూడవది రెండు బలమైన కేంద్రాలు ఒకే పార్టీలో ఇమడలేవు.
ఈ మూడూ కాకుండా ఇంకొకటి ఉంది. లోకేశ్ ప్రాధాన్యత తగ్గడం చంద్రబాబుకి బాలకృష్ణకు ఇద్దరికీ ఇష్టం ఉండదు. పార్టీ ఏమైనాగానీ చంద్రబాబునే ఎలివేట్ చేసుకుంటూ ఈ ఎన్నికల్లో గట్టెక్కి అధికారంలోకి రావాలని వారి తపన.
ఈ అనేక అంతర్గత కారణాలతో టిడిపికి ఒక రాకెట్ బూస్ట్ అవసరం అనేది పట్టించుకోకుండా జగన్ పాలనని సైకోపాలన అంటూ నెట్టుకుంటూ వచ్చారు. అదీ కుదరక మరిన్ని పథకాలు అదనంగా ఇస్తామని ప్రచారం చేశారు. చివరికి ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కేసులు జైలు వరకూ వచ్చింది. కారణం జగనా లేక మోడీనా లేక స్వయంకృతమా అనేది పక్కన పెడితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నమ్మదగ్గ వ్యక్తి బిజెపి పొత్తులోనే ఉన్న పవనా, లేక జూనియర్ ఎన్టీఆర్ నా అనేది టిడిపి తేల్చుకోవాలి. కొత్తనీరు అనే ప్రచారంతో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఇప్పుడు ఉన్న పరిస్థితి సంబాళించగలడని అనిపిస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా లేదా అనేది వేరే విషయం. కనీసం తన హృదయానికి చేసిన గాయాన్ని ఓదార్చి మరీ అతన్ని గౌరవంగా ఆహ్వానిస్తే టిడిపికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది అని నా అభిప్రాయం. ఇది టిడిపిలో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ టీడీపీ (అంటే చంద్రబాబే) మొహమాటం పక్కన పెట్టి ఆలోచించుకోవాలి.
◆ ఈ విషయంలో ఆర్జీవీ చెప్పేది నిజమే అనిపిస్తుంది. నేను ఆర్జీవీ మాటలు వినకుండానే థంబ్ నెయిల్ చూసి ఇదంతా రాశాను.
Share this Article