Bharadwaja Rangavajhala…. స్వరకల్పన… చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరిమల్లెలు కొలిచీ … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు.
జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బాపు, జంధ్యాల, సింగీతం లాంటి క్రియేటివ్ జీనియస్సుల దగ్గర సంగీతం చేశారు. అనేక గుర్తుండిపోయే గీతాలకు ప్రాణం పోశారు.
కన్యాకుమారితో మొదలై జైత్రయాత్ర వరకు బాలు స్వరపరచిన తెలుగు పాటల సంఖ్య రెండొందలదాకా ఉంటుంది. ఈ లిస్టులో ప్రతి పాటా ప్రత్యేకంగా వినిపించేదే. ప్రతి పాటా బాలూ ముద్రను తెలిపేదే.
Ads
కెప్టెన్ కృష్ణ సినిమా కోసం ఆయన చేసిన కలకాలం ఇలా సాగనీ… నీలో నన్నే చూడనీ లాంటి పాటలు మరచిపోవడం సాధ్యమా? కె.ఎస్.ఆర్ దాస్ లాంటి మాస్ డైరక్టర్ మూవీలో ఈ పాటేంట్రా అనిపించినా… మనసుల్ని తడిమే గీతం అది.
విశ్వనాథ్ డైరక్ట్ చేసిన రెండో సినిమా ప్రైవేటు మాస్టారులో పాడుకో పాడుకో అనే ఓ పాటను బాలు పాడారు. బంగారు పిచ్చికలో హీరో వేషం బాలుతో వేయించాలనుకున్నారు బాపు రమణలు. బాలు కాదనేసరికి అతని సోదరుడు చంద్రమోహన్ను ఆ కారక్టర్ కి తీసుకున్నారు. అందులో మనసే గని లాంటి పాటలు పాడిన బాలు తో తూర్పువెళ్లే రైలుకు సంగీతం చేయించుకున్నారు బాపు.
అలా వేగుచుక్కపొడిచింది. బంగారు పిచ్చిక పరిచయంతో బాలుకి బాపు రమణలతో సాన్నిహిత్యం పెరిగింది. బాపు దగ్గర అద్భుతమైన మ్యూజిక్ కలెక్షన్ ఉండేది. ఆ గనిలోకి బాలు ప్రవేశించారు. మెహదీ హసన్ ఘజల్స్ తదితర అపురూప గీతాలెన్నో వినేవాడు.
ఆ తరవాత చాలా కాలానినికి బాపు డైరక్ట్ చేసిన తూర్పు వెళ్లే రైలుకు సంగీతం చేసేప్పుడు బాపు కోరిక మేరకు ఓ ఘజల్ ను తీసుకుని చుట్టూ చెంగావి చీర పాటను కూర్చాడు బాలు.
కన్యాకుమారితో ఛాన్సిచ్చిన దాసరి నారాయణరావే తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలకు బాలుతో బాణీలు కట్టించుకున్నారు. అందులో ఓ మల్టీ స్టారర్ మూవీ కూడా ఉండడం విశేషం.
అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణలతో దాసరి తీసిన ఊరంతా సంక్రాంతి సినిమాకు బాలు సంగీతం అందించారు. అందులో ప్రతి పాటా హిట్టే. రమేష్ నాయుడుతో ఎక్కువగా సంగీతం చేయించుకున్న దాసరి మనసెరిగి స్వరపరచిన గీతాలవి.
సినారే రాసిన కళ్లల్లో కనకాంబరం కాస్త ప్రత్యేకంగా వినిపిస్తుంది. సంగీత దర్శకుడుగా బాలు మీద చాలా మంది సంగీత దర్శకుల ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా రమేష్ నాయుడు, సత్యంలు కనిపిస్తారు. ఎప్పుడైనా మహదేవన్ కూడా తొంగి చూడవచ్చు… దీన్ని అనుకరణ అని ఎట్టి పరిస్ధితుల్లోనూ అనలేం. ఆ ప్రభావంలోంచి నడచి వచ్చిన సంగీతం అని మాత్రమే అనుకోగలిగేలా ఉంటాయి బాలు తీర్చిన పాటలు.
ముఖ్యంగా సీతమ్మపెళ్లిలో అమ్మనైనా నాన్ననైనా పాటా … మహదేవన్ ని గుర్తు తెస్తుంది. మహదేవన్ ప్రభావంతో బాలు చేసిన మరో పాట రారా కృష్ణయ్య సినిమాలో వినిపిస్తుంది. ఆ వన్నెలు ఎక్కడివి తూర్పు కాంత మోములో అంటూ సాగే ఆ గీతం చెప్తేగానీ బాలు కూర్చారని తెలీదు. తొలిసారి విన్నవారెవరైనా అది మహదేవన్ కంపోజిషన్ అనే అనుకుంటారు.
మహదేవన్ తో బాలుది శిష్య సంబంధం. ఆ అనుబంధానికి గుర్తుగా నిల్చిపోతుందీ గీతం. బాపుతో కలసి బాలు పనిచేసిన సినిమాలన్నిట్లోనూ సంగీతం అద్భుతంగా ఉంటుంది.
బాపు గారికి సంగీతాభిరుచే కాదు… అభినివేశం ఉండడమూ కారణం కావచ్చు. శోభన్ బాబు హీరోగా వచ్చిన జాకీ మూవీలో అలా మండిపడకే జాబిలీ సాంగ్ లో ఇంటర్ లూడ్ కాస్త కొత్తగా ఉంటుంది. దాన్ని బాపుగారి కోరిక మేరకు చేర్చినట్టు బాలూ చెప్తారు. బాపు సూచన మేరకు ఆ పాటకు శివరంజని రాగాన్ని వాడారు బాలు.
అలా మండిపడకే జాబిలీ పాట లింక్… (ఈటీవీ సినిమా)…
హిందోళ రాగంలో స్వరపరచిన త్యాగరాయ కృతి సామజవరగమన లో మొదటి పదాన్ని తీసుకుని ప్రతి లైను చివరల్లో పొదివి సిరివెన్నెలతో ఓ విచిత్ర గీతం రాయించుకున్నారు దర్శకుడు వంశీ. దివిని తిరుగు మెరుపు లలన .. సామజవరగమనా ఇలా సాగే వంశీ మార్క్ పాట లాయర్ సుహాసిని కోసం కంపోజ్ చేశారు బాలసుబ్రహ్మణ్యం. వంశీతో బాలు పనిచేసిన ఏకైక సినిమా అది.
బాలు సరదా పడి చేసిన సినిమా కళ్లు. గొల్లపూడి మారుతీరావుకు సాహిత్య అకాడమీ బహుమతి తెచ్చిన నాటకం కళ్లును సినిమాటోగ్రాఫర్ ఎమ్.వి.రఘు తెరకెక్కించారు. ఆ సినిమా కోసం సీతారామశాస్త్రి ఓ పాట రాసుకొచ్చారు. దాన్ని సంగీత దర్శకుడు బాలుకు పాడి వినిపించారు. బాలు ఇంక ట్యూనక్కర్లేదు…మీరే…ఇలానే పాడేయండి చాలు అన్నారు. అంతే తెల్లారింది లెగండో…పాటొచ్చేసింది.
బాలుకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రం మయూరి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన మయూరి యథార్ధ జీవిత చిత్రణ. అందులో ఓ అద్భుతమైన డ్యూయట్ కంపోజ్ చేశారు బాలు. ముందు ఇళయరాజా శైలిలా అనిపించినా… తర్వాత్తర్వాత బాలు పాటే అని తెల్సిపోయేలా ఉంటుంది ఆ గీతం. బాలుకు ఇష్టమైన కవి వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఆ గీతం… మౌనం రాగం మధురం మంత్రాక్షరం..
బాపుగారి తర్వాత బాలు గానాన్నే కాదు… సంగీతాన్నీ విపరీతంగా ఇష్టపడిన దర్శకుడు జంధ్యాల. జంధ్యాలతో నాలుగు సినిమాలకు పనిచేశారు. వీటిలో పడమటి సంధ్యారాగం కాస్త ప్రత్యేకం. అందులో ప్రతి పాటా శ్రోతలను అలరించినదే. తెలుగింటి అమ్మాయికీ ఓ అమెరికన్ అబ్బాయితో ప్రేమబంధం కలుస్తుంది. వారిద్దరూ పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లిచేసుకుంటారు. ఈ ప్రేమ నేపధ్యంలో సాగే గీతం …. ఈ తూరుపు…ఆ పశ్చిమం…అంటూ సాగే వేటూరి రచన లో సాగే అందమైన మెలోడీ.
బాలసుబ్రహ్మణ్యం తెలుగులోనే మూడు పదుల చిత్రాలకు సంగీతం అందించారు. తమిళం, కన్నడంతో కలిపి అరవై చిత్రాల వరకు ఉంటాయి. నాగార్జునతో ఉప్పలపాటి నారాయణరావు తీసిన జైత్రయాత్ర బాలు స్వరరచన చేసిన చివరి చిత్రం. అందులో ఎన్నాళ్లమ్మా… ఎన్నేళ్లమ్మా పాట బాలు శైలిలో వినిపించే ఓ మెత్తని సందేశాత్మక గీతం.
ఎస్.పి బాలసుబ్రహ్మణ్యానికి చాలా నచ్చిన సంగీత దర్శకుడు రమేష్ నాయుడు. రమేష్ నాయుడు గాయకుడు కూడా. తన సంగీత దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కెమేరా సాంగ్స్ పాడారాయన. ఆయనతో తను సంగీతం చేసిన కొంగుముడి చిత్రంలో ఓ కెమేరా సాంగ్ పాడించుకున్నారు బాలు. అలాగే తనకు ఇష్టమైన గాయకుడు జేసుదాస్ తో తమిళ సినిమా శిగరంలో ఓ పాట పాడించుకున్నారు బాలు.
సంగీత దర్శకులతోనూ గీత రచయితలతోనూ దర్శకులతోనూ అంతగా స్నేహం చేసిన గాయకుడు మరొకరు కనిపించరేమో … విశ్వనాథ్ అన్నట్టు దుర్యోధనుడితోనూ ధర్మరాజుతోనూ ఏకకాలంలో స్నేహంగా ఉండగలవాడు బాలసుబ్రహ్మణ్యం … అయినప్పటికీ ఎందుచేతో ఎక్కువ సినిమాలకు సంగీతం అందించలేకపోయారు. సంగీత దర్శకుడుగా చాలా మంచి ట్యూన్లే ఇచ్చారాయన….
Share this Article