1, ది స్టోరీ టెల్లర్ (హిందీ), 2, మ్యూజిక్ స్కూల్ (హిందీ), 3, మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 4, ట్వెల్త్ ఫెయిల్ (హిందీ), 5, విడుథలై పార్ట్-1 (తమిళ్), 6, ఘూమర్ (హిందీ), 7, దసరా (తెలుగు), 8, వల్వి (మరాఠీ), 9, గదర్-2 (హిందీ), 10, అబ్ తో భగవాన్ సే భరోసే (హిందీ), 11, బాప్ లాయక్ (మరాఠీ), 12, రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ (హిందీ), 13, జ్విగాటో (హిందీ), 14, ది కేరళ స్టోరీ (హిందీ), 15, బలగం (తెలుగు)…
పైగా చెప్పిన సినిమాలన్నీ కొద్దిరోజులుగా బహుళ ప్రచారానికి నోచుకున్నాయి… ఆస్కార్ ఎంట్రీ కోసం పరిశీలనలో ఉన్న సినిమాల పేర్లుగా పత్రికలు, టీవీలు, సైట్లు, ట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలో టాంటాం జరిగింది… దసరా, బలగం సినిమాల మీద మనవాళ్లు కూడా ఎడాపెడా రాసేశారు… నిజానికి దసరా సినిమాకు అంత సీన్ ఉండకపోవచ్చునేమో గానీ బలగం ఎమోషన్స్‌పరంగా, కుటుంబబంధాల పరంగా మంచి కోణంలో అల్లబడిన కథ…
కమర్షియల్ మసాలా వాసనలేవీ లేకుండా కథను రక్తికట్టించాడు దర్శకుడు… ఊరూరా ఫ్రీ షోలు వేయించుకుని చూశారు జనం… కన్నీళ్లు పెట్టుకున్నారు… అయితే పైన చెప్పిన సినిమాల్లో కూడా కొన్ని తక్కువేమీ కాదు… మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే… ఓ తల్లి తన బిడ్డ కోసం ఓ దేశ ప్రభుత్వ విధానాల మీద పోరాడిన కథ… భిన్నమైన కంటెంట్… ఒరిజినల్ స్టోరీ… అలాగే జ్విగాటో కూడా… నందితాదాస్ దర్శకత్వం వహించిన స్టోరీ… స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ హీరోగా చేశాడు… ఒడిశాలో వినోదపన్ను మినహాయింపు కూడా లభించింది…
Ads
నిజానికి వీటిలో కొన్ని కమర్షియల్ రొటీన్ మసాలాలు ఉన్నాయి… కానీ హిందీ చిత్రాలు కదా… హిందీ మీడియా ప్రచారం ఇచ్చి పడేసింది… మనవాళ్లూ గుడ్డిగా రాసేసుకున్నారు… తీరా ఇప్పుడు జరిగిందేమిటో తెలుసా..? ఏ మీడియా ఊహించని చిత్రం… 2018, ఎవరీ వన్ ఈజ్ హీరో అనే పాన్ ఇండియా సినిమా ఆస్కార్ ఎంట్రీగా ఎన్నికైంది… అప్పట్లో వచ్చిన కేరళ వరదల్లో ప్రజలు ఒకరికొకరు అన్ని భేదాలు మరిచిపోయి ఎలా సహకరించుకున్నారనేది కథ… బాగా తీశారు కూడా సినిమాను… కమర్షియల్‌గా కూడా హిట్…
అబ్బే, గత సంవత్సరం ఇలాగే ఓ గుజరాతీ సినిమా ‘చెల్లో షో‘ను ఆస్కార్ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసి పంపించారు… ఏమైంది..? ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది ఆ సినిమా టీం… ఈసారి కూడా అంతే…… ఇదుగో ఈ వ్యాఖ్యలు అప్పుడే మొదలయ్యాయి… కానీ 2018 సినిమాను తేలికగా తీసిపడేయాల్సిన అవసరం లేదు… గిరీష్ కాసరవెల్లి నేతృత్వంలోని 17 మంది టీం బాగానే జల్లెడ పట్టినట్టుంది… బలగం సినిమా సెలక్టయితే బాగుండు… కానీ 2018 ఎంపిక కూడా అభినందనీయమే…
ఐనా… రాజమౌళి దత్తపుత్రుడు కార్తికేయ వంటి మంచి మేనేజర్ దొరకాలే గానీ… కోట్లు ఖర్చు పెట్టి, బలమైన లాబీయింగ్ చేసుకోవాలే గానీ… ఆస్కార్ మరీ అబ్బురమైన అవార్డు ఏమీ కాదని, ప్రయత్నిస్తే ఇట్టే దక్కే అవార్డులేననీ గత సంవత్సరం ఆర్ఆర్ఆర్ ఆస్కార్లు నిరూపించాయి… సో, ఆస్కార్ ‘కొనడానికి’ ఆస్కారం ఉందనేది నిజం… మరీ నాటునాటు అనే ఓ నాసిరకం పాటకు కీరవాణి, చంద్రబోస్ అవార్డులు పొందడమే నిదర్శనం… సో, 2018 సినిమా అధికారిక ఎంట్రీగా వెళ్తేనేం… ఆసక్తి ఉన్న ‘డబ్బున్న నిర్మాతలు’ బలమైన లాబీయిస్టును వెతుక్కుంటే ప్రైవేటుగానే ఆస్కార్ బరిలో నిలబడొచ్చు… ఏమో… ఉట్టి కొట్టినా కొట్టొచ్చు…!!
Share this Article