అదేదో సినిమాలో ప్రకాష్‌రాజ్ కోటశ్రీనివాసరావును పట్టుకుని ‘ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు’ అనడుగుతాడు… ఏబీఎన్, మహాన్యూస్ ఈటీవీ, టీవీ5 చానెళ్లు కూడా చంద్రబాబు అరెస్టు వార్తలపై మొత్తం లాజిక్కులను వదిలిపెట్టేశాయి… ప్చ్ పాపం, నవ్వులపాలు అవుతున్నాం అని తెలిసీ, స్వామిభక్తితో రగిలిపోతున్నయ్… ఊగిపోతున్నయ్…
తాజాగా ఓ వార్త చూసి జనమంతా నవ్వుకున్నారు… అదేమిటంటే… చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణలో బీఆర్ఎస్‌పై పడుతోందని తెలంగాణ ఇంటలిజెన్స్ రహస్యంగా కేసీయార్‌కు నివేదిక ఇచ్చిందట… దాంతో కేసీయార్‌లో కలవరం మొదలైందట… అంతా ఇంతా కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ 10 నుంచి 40 వేల ఓట్ల మేరకు గండిపడే ప్రమాదం కూడా ఉందట… ప్చ్, ఇప్పుడు కేసీయార్ ఏం చేయాలి మరి..?
Ads
అసలే ప్రభుత్వ వ్యతిరేకత… పుంజుకున్న కాంగ్రెస్… సిక్స్ గ్యారంటీలతో తలనొప్పి… ఈ స్థితిలో ఇక చంద్రబాబు అరెస్టు వ్యతిరేకత ప్రభావం కూడా ఇంత భారీగా ఉంటే ఏంచేయాలి..? ఎటు పోవాలి..? దేవుడా… ఏది దిక్కు..? రెండు మార్గాలు… 1) అవసరమైతే నన్ను అరెస్టు చేయండి, జైలుకు వెళ్తాను, చంద్రబాబును వదిలేయండి అని కేసీయార్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేయాలి… 2) కవిత రంగంలోకి దిగాలి… ఆమె హూంకరించగానే మహిళల రిజర్వేషన్లు వచ్చేశాయి… మోడీ వణికిపోయాడు…
ఖలేజా సినిమాలో మహేశ్ బాబును ఉద్దేశించి ఓ పాత్రధారి అంటాడు… నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ అని… సేమ్, ‘నువ్వు తలుచుకుంటే అవుద్ది అక్కా’ అన్నట్టుగా… కవిత గనుక గట్టిగా తలుచుకుంటే ఇప్పుడు కానిదేమీ లేదు… ఆమె నియోజకవర్గం కదా, మోడీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, పసుపు బోర్డు ప్రకటించేశాడు… ఆమె పోరాడుతుందేమో అని మనసులో అనుకుని ట్రైబల్ యూనివర్శిటీ ఇచ్చేశాడు… ఇప్పుడు ఆమె గనుక చంద్రబాబును విడుదల చేయకపోతే ఆందోళన చేస్తానని జస్ట్ ఓ ప్రకటన జారీ చేస్తే సరి… మోడీయే ఏవో తిప్పలు పడి చంద్రబాబును రిలీజ్ చేయించేస్తాడు… ఆల్‌రెడీ హరీష్ చంద్రబాబు ఏజ్ కూడా చూడకుండా అరెస్టు చేశారు, కరెక్టు కాదని బోలెడంత సానుభూతిని కూడా వర్షించాడు…
హమ్మయ్య, అప్పుడిక బీఆర్ఎస్ వోట్లపై చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏమీ ఉండదన్నమాట… సరే, ఇక ఆ లాజిక్ దగ్గరకు వద్దాం… చంద్రబాబును తరిమేసిందే కేసీయార్… ఇక్కడే ఉంటే వొటుకునోటు కేసుతో నీ సంగతి చూస్తాను అనగానే ఈయన మూటాముల్లే సర్దుకుని చలో అమరావతి అని వెళ్లిపోయాడు… అప్పుడే తెలంగాణలోని ఏ నియోజకవర్గమూ చంద్రబాబుకు అనుకూలంగా స్పందించలేదు… టీఆర్ఎస్ వోట్లకూ గండి పడలేదు… పైగా ఇప్పుడు చంద్రబాబు అరెస్టుకూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధమే లేదు… అదంతా జగన్ వర్సెస్ చంద్రబాబు… ఇంకా పచ్చిగా చెప్పాలంటే రెండు కులాల సంకుల సమరం…
నడుమ కేసీయార్‌కు ఎందుకు పూస్తున్నట్టు ఈ బురదను ఏబీఎన్ వాళ్లు..? తలాతోకాలేని కథనం… రాను రాను టీవీ5 సాంబశివరావును, మహాన్యూస్ వంశీని మించిపోవాలని ఏబీఎన్ రిపోర్టర్లు కంకణాలు కట్టుకున్నట్టున్నారు… తెలుస్తూనే ఉంది… టీవీ భాషలో చెప్పాలంటే… ఎవుర్రా మీరు… మస్తు టాలెంటెడ్ ఉన్నారు…!! అవునూ… పనిలోపని… చంద్రబాబు అరెస్ట్ ప్రభావం దేశవ్యాప్తంగా మోడీ వోట్లపై ఎంత దారుణంగా, ఘోరంగా, తీవ్రంగా ఉండబోతుందో కూడా ఓ స్టోరీ చేసేస్తే సరి… థింక్ సీరియస్‌లీ..!!
Share this Article