Bharadwaja Rangavajhala…… సినిమా తీద్దాం … రండి…. నాకు చిన్నప్పుడు చిత్రసంస్కార పత్రికలో చదివిన కాట్రగడ్డ నరసయ్యగారి ఆర్టికల్ పదే పదే గుర్తొస్తోంది. సినిమా తీయాలనే తపన చాలా మందికి ఉంటుంది. ఓ మంచి కథ కూడా వాళ్ల మనసుల్లో ఉంటుంది. కానీ తీయడానికి తగిన ఆర్ధిక వసతి ఉండదు. ఒక వేళ తీసినా దాన్ని విడుదల చేయడం అంత తేలికైన పని కాదు.
ఈ విడుదలకు సంబంధించి నరసయ్యగారు ఓ చిట్కా చెప్పారు. నిజానికి ఆయన తెలుగు ప్రాంతాల్లో అతి పెద్ద పంపిణీ కంపెనీకి చాలా కాలం పాటు మేనేజరుగా పనిచేశారు. ఆ కంపెనీలో భాగస్వామిగానూ ఉన్నారు. అయితేనేం ఆయనలో … ఓ అభ్యుదయాంశ ఎప్పుడూ మెదులుతూ ఉండేది. అదే ఆయనతో రచనలు చేయించేది.
కొత్త తరహా సినిమాలకు ఎంకరేజ్ చేయడానికి అలంకార్ థియేటర్ లో ఉదయం పూట సత్యజిత్ రే, మృణాళ్ సేన్ తదితర పారలల్ డైరక్టర్ల సినిమాలు వేసుకోడానికి విజయవాడ ఫిలిం సొసైటీకి అనుమతిచ్చేలా చేసేది. నరసయ్యగారి గురించి ముళ్లపూడి తన కోతికొమ్మచ్చిలో చాలా బాగా రాశారు. ఇంతకీ నరసయ్యగారు చెప్పిన చిట్కా ఏమిటంటే … ప్రజల వద్దకే సినిమా.
Ads
అదేంటో తర్వాత వివరిస్తాను. … ఒకప్పుడు సినిమా తీయడానికి ఓ పద్దతీ, విడుదల చేయడానికి ఓ పద్దతి ఉండేవి. ఒకప్పుడు ముళ్లపూడి రమణ, బాపు గార్లు సాక్షి తీసేప్పుడు స్క్రిప్టు తయారు చేసుకుని తనకున్న సినిమా పరిచయాలతో నవయుగ శ్రీనివాసరావుగారిని కలసి ఆయనకి కథ చెప్పి వారి ఆర్ధిక మద్దతుతో సినిమా తీశారు.
వారే కాదు … ఎవరైనా అదే చేసేవారు. సినిమా కథ అనుకున్నాక బెజవాడ వెళ్లి నవయుగ ఆఫీసులోనో తారకరామాలోనో, లక్ష్మీ ఫిలింస్ లోనో కథ చెప్పి ఒప్పించి వారు చెప్పిన మార్పులు చేర్పులు చేసి వారు విడుదల చేసిన డబ్బు దన్నుతో సినిమా తీసేవారు. తాతమనవడు కథ దాసరి ప్రతాప్ ఆర్ట్స్ రాఘవగారికి చెప్పారు. ఆయనకు నచ్చింది.
అయితే డిస్ట్రిబ్యూటర్లకు కూడా నచ్చాలి కదా అని … విజయవాడ పట్టుకెళ్లారు. గాంధీనగర్ న్యూ ఇండియా హోటల్ దగ్గర్లో … నవభారత్ బాబూరావుగారి దగ్గరకు వెళ్లారు. ఆయనకు దాసరి కథ చెప్పారు. అక్కడే తర్వాత రోజుల్లో నిర్మాత అయిన కనకమేడల దేవీ వరప్రసాద్ కూడా ఉన్నారు. దాసరి చెప్పిన కథ బాబూరావు గారికి నచ్చింది. అయితే … ఆయనో మెలికేశారు. కథ బాగుంది. అయితే దర్శకత్వం ఇతను చేయగలడనే కాన్ఫిడెన్స్ నాకు లేదు.
ఇలాంటి కథలు కె.ఎస్.ప్రకాశరావుగారు బాగా తీస్తారు. ఆయన్ను పెట్టుకోండి. కథ మాత్రం ఇదే. అలా అయితేనే నేను డబ్బులిస్తా అన్నారు. దీంతో దాసరి పై ప్రాణాలు పైనే పోయాయి. తర్వాతెలోలా ఇంకో డిస్ట్రిబ్యూటరుకు చెప్పి మొత్తానికి దాసరికే దర్శకత్వం ఇచ్చారు రాఘవ. అలా ఉండేది అప్పట్లో పరిస్థితి.
అంతదాకా ఎందుకు మూవీ మొఘల్ రామానాయుడు గారు కూడా బాపయ్య తొలి చిత్రం ద్రోహి రిలీజయినప్పుడు బెజవాడలోనే ఉన్నారు. మార్నింగ్ షో చూశాక … నవయుగ వారు చెప్పిన మాట. మా డబ్బులొచ్చేస్తాయి నీ డబ్బులకే గ్యారంటీ లేదని. అప్పుడే విడుదలైన దసరాబుల్లోడు బడ్జట్ ఎంతో కనుక్కుని ఆ రేంజ్ సినిమా తీస్తాను అదీ అక్కినేనితోనే మీ భరోసా ఉంటుందా అని నవయుగ వారిని అడిగి ప్రేమనగర్ ప్లాన్ చేశారు నాయుడుగారు.
ఏ సినిమా కథ అయినా ముందు డిస్ట్రిబ్యూటర్లకు నచ్చాలి. వారు ఓకే అని డబ్బులిస్తే సినిమా మొదలయ్యేది. అప్పుడు సదరు డిస్ట్రిబ్యూటర్లు సినిమాను విడుదల చేసి వారు. పెట్టిన డబ్బు రాబట్టుకున్నాక … ఆ తర్వాత నిర్మాతకు చెల్లించేవారు. కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్ల వరకు డబ్బులు తెచ్చి నిర్మాత దగ్గరకు వచ్చేసరికి పడుకునేవి. ఇంకొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకే బొక్క పెట్టేవి. ఆ సొమ్ము సదరు నిర్మాత నుంచీ వసూలు చేసుకోడానికి నానా కష్టాలు పడేవాళ్లు.
బాపు రమణలు సాక్షికీ, బంగారు పిచ్చికకీ నవయుగకు బాకీ పడిపోవడంతో బుద్దిమంతుడుకు డబ్బులివ్వం అనేశారు వారు. అప్పుడు అక్కినేని రికమండేషన్ తో లక్ష్మీ ఫిలింస్ వారి మద్దతుతో సినిమా తీసి హిట్టు కొట్టి నవయుగ అప్పు సింగిల్ చెక్కుతో చెల్లగొట్టారు. అప్పట్లో ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత సీన్ మారింది.
దీనికి ఒక కారణం ఎన్టీఆర్ తీసుకువచ్చిన స్లాబ్ సిస్టమ్. బయ్యర్ల రాజ్యం వచ్చింది. సినిమా ప్రకటించగానే బయ్యర్లు వస్తారు. వాళ్లు ఆర్టిస్టులు ఎవరు? కథ ఎవరిది? డైరక్టరు ఎవరు? అతని ట్రాకు రికార్డు ఏమిటి లాంటివన్నీ వినీ చూచీ ఆలోచించి ఓ మొత్తం అడ్వాన్సుగా ఇవ్వడం ప్రారంభమయ్యింది. అలా బయ్యర్ల నుంచీ అడ్వాన్సులు రావాలంటే ప్రూవ్డ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లూ ఉండాలి.
అలా టేబుల్ ప్రాఫిట్ అనే పరిస్తితి వచ్చాక.. కొత్త రకం కథలు రావడం కష్టతరమయ్యాయి. ఈ గొడవ పక్కన పెడితే … అప్పట్లో లోబడ్జట్ సినిమాలు అని ఓ జానర్ సినిమాలు వచ్చేవి. వాటితో పాటు పారలల్ సినిమాలు అని మరో జానర్ సినిమాలూ వచ్చేవి. ఈ సినిమాలు వాస్తవిక జీవితన్ని ప్రతిబింబిస్తూ ఉండేవి. రోజువారీ జీవితంలోని ఘర్షణలను వైరుధ్యాలను పట్టుకుని కథలు తయారు చేసుకుని సినిమా తీసేవారు.
ఇలాంటి లోబడ్జట్ సినిమాల వల్లే చంద్రమోహన్ లాంటి హీరో అంతకాలం హీరోగా కెరీర్ లాగించేశాడు. మొగుడు పెళ్లాం కథలతో ఒక రకమైన డొమెస్టిక్ కామెడీ తో కథను నడిపించేసేవారు. సంసారంలో సరిగమలు, నేనూ మా ఆవిడ, సత్యభామ ఇలా నడిచేవి ఆ తరహా కథలు. మురళీమోహనూ అంతే … క్రాంతికుమార్ రాఘవేంద్రరావులు కలసి తీసిన నాలుగు సినిమాల్లోనూ మురళీమోహనే హీరో. అన్నీ బ్లాక్ అండ్ వైట్ లే.
ఇలాంటి సినిమాలకూ అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ల మద్దతు దొరికేది. వాళ్ల బడ్జట్టే తక్కువ కాబట్టి ఎంతో కొంత రాకపోతాయా అనే ఆశతో పాటు ఒక వేళ హిట్టయ్యితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనే ఆలోచనతోనూ ఈ తరహా సినిమాలను ప్రోత్సహించేవారు.
దీనికి తోడు ప్యారలల్ సినిమాలూ వచ్చేవి. పూర్తి వాస్తవిక జీవిత చిత్రణగా సాగే చిత్రాలు వచ్చేవి వాటినీ జనం ఆదరించేవారు. డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజ్ లెక్కన ఆడి నిర్మాతలకు ధైర్యం చెప్పేవారు. ఊరుమ్మడి బ్రతుకులు, చలిచీమలు, కుక్క, చిల్లరదేవుళ్లు తదాదిగా గల చిత్రాలన్నీ అలా విడుదలైనదే కదా…. లక్ష్మీ ఫిలింస్ వారు మా భూమి తీసుకున్నా … నవయుగ వారు ఒక ఊరి కథ, రంగుల కల సినిమాలు విడుదల చేసినా ఈ భరోసాతోనే.
అయితే బ్లాక్ అండ్ వైట్ ఫిలింకీ … రంగుల ఫిలింకీ ఖర్చులో ఉన్న తేడా మూలంగా రంగుల సినిమాలు వచ్చాక కూడా బాలచందర్, ఈరంకి శర్మ లాంటి డైరక్టర్లు బ్లాక్ అండ్ వైట్ ను వదలకుండా సినిమాలు తీసేవారు. వివ్వనాథ్ కూడా సీతామాలక్ష్మిని నలుపు తెలుపుల్లోనే తీసి రక్తి కట్టించారు.
నెమ్మదిగా సీన్ మారింది. తొంభైల్లో నూతన ఆర్ధిక విధానాలు వచ్చాక … పారలల్ సినిమాలు పూర్తిగా నాశనం అయ్యాయి. లో బడ్జట్ సినిమా అనేది కనుమరుగయ్యింది. ఇప్పుడైతే కనీసం ఐదు కోట్లు లేకుండా సినిమాయే లేదంటున్నారు. డిజిటల్ యుగంలోకి ప్రవేశించిన తర్వాత కూడా సినిమాను మేడీజీ అనేయడానికి అవకాశం ఇవ్వకుండా ఆర్ధికంగా కట్టిపడేసే ప్రయత్నాలు బలంగానే సాగుతున్నాయి. సరిగ్గా ఇక్కడే కాట్రగడ్డ నరసయ్యగారు గుర్తొస్తారు.
ఒక కథకుడు ఎలాగైతే తాననుకున్న కథను పేపర్ మీద పెన్నుతో రాస్తాడో … అలాగే ఓ దర్శకుడు తాననుకున్న కథను కెమేరాతో తెరమీద రాస్తాడు. తాననుకున్న కథను జనంలోకి తీసుకెళ్లడానికి ఒక వాహకం కావాలి. అది సినిమా హాళ్లలో విడుదల కావాలి. అప్పుడే జనానికి ఆ సినిమా గురించి తెలుస్తుంది. జనం మెచ్చితే హిట్టు లేకపోతే ఫ్లాపు. సరిగ్గా ఇక్కడే చాలా మంది సినిమా పాషన్ ఉన్నోళ్లు ఆగిపోతున్నారు. సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదుగానీ రిలీజే … అంటున్నారు.
ఇలాంటి వారి కోసమే ఇండిపెండెంట్ సినిమా అనే కాన్సెప్ట్ మార్కెట్ లోకి వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ లో కాలెట్టడం కష్టమైన సందర్భాల్లోనే గెరిల్లా ఎత్తుగడలు రంగ ప్రవేశం చేస్తాయి. అలాగే ఇప్పుడు గెరిల్లా సినిమా పద్దతులు రంగంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక కథ అనుకోండి. దాన్ని తెరమీద అందంగా చూపించగల కెమేరామెన్ ను పట్టుకోండి. ఎక్యుప్ మెంట్ కూడా పెద్దగా కష్టపడకుండానే దొరుకుతుంది.
అలా ఇవన్నీ సమకూర్చుకున్నాక … నటీనటుల్ని వెదకండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ నుంచే సెలక్ట్ చేసుకోండి. రెండుగంటల ఫీచర్ ఫిలిం తీసేయండి. భోజనాలు ఇతర రోజువారీ ఖర్చులకు తలో కొంతా వేసుకోండి. సినిమా పూర్తి చేయండి. ఎడిటింగ్ కూడా పెద్ద సమస్య కాదు. సినిమా తయారు చేయండి. దాన్ని తీసుకుని ఓ స్క్రీను, ప్రొజెక్టర్ తీసుకుని ఊళ్లల్లోకి వెళ్లడమే.
ధియేటర్ అందుబాటులో ఉన్న ఊళ్లల్లో ఏదో ఒక ధియేటర్ లో ఒక షో లేదా రెండు షోలు మాట్లాడుకుని టిక్కెట్లను మీరే పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా అసోసియేషన్లలో అమ్మేసేయాలి. బెన్ ఫిట్ షో పద్దతిలో వేయాలి. అలాగే సినిమాకు ఉచిత ప్రవేశం అని ప్రకటన చేసి సినిమా చూసిన జనాన్ని మీరు చూసిన సినిమా మీకు సీరియస్ గా నచ్చినట్టైతే ఎంతో కొంత ఆ కార్యకర్తలు మీ దగ్గరకు వస్తారు … వాళ్ల జోలెలో వేసేయండి అని చెప్పి వసూలు చేసుకోవచ్చు.
ఇలా తెలుగు మాట్లాడే జనం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ మన సినిమా ఆడించేస్తే … మన డబ్బులు మనకి వచ్చేస్తాయి. అదే పల్లెటూళ్లలో అయితే రోజంతా ప్రచారం చేసి రాత్రికి ఒక బడిలోనో గుడిలోనో తెర కట్టి సినిమా చూపించి జోలె పట్టవచ్చు. ఇలా ఒక ఉద్యమంలా సినిమాను జనంలోకి తీసుకెళ్లిపోతే … డిస్ట్రిబ్యూషన్ అనే సమస్యను అధిగమించేయవచ్చు. ఇలా ఓ రెండు మూడు సినిమాలు కనుక చేసేస్తే మనకూ , జనాలకూ కూడా అనుభవం వస్తుంది. అలవాటైపోతుంది. మన కోసం ఎదురుచూపులు మొదలవుతాయి.
ఇలా జనంలో మనం సినిమా వేసేప్పుడు జరిగే మౌత్ పబ్లిసిటీ వల్ల మన గురించి మీడియా వారూ ఇతర సోషల్ నెట్ వర్కుల వాళ్లు రాసే దాన్ని బట్టి డిజిటల్ కమ్ శాట్ లైట్ రైట్స్ అమ్ముకుని ఇంకొంత సంపాదించుకోవచ్చు. సినిమా కనుక మీకు నచ్చినట్టైతే మీకు తోచినంత చూసినందుకు ఇచ్చి వెళ్లండి అనే జనాన్ని మనం పిలవాలి.
ఇలా ఓ పెద్ద డిస్ట్రిబ్యూషన్ లో భాగస్వామ్యం ఉండి ఇలాంటి ఆలోచన చేసేవారు నరసయ్య గారు… అన్నట్టు నా పెళ్లికి మధు కళా మండపంలో హాలు అడిగా… నరసయ్య గారిని. పెళ్లి చేసుకుంటున్నావా… చేసుకో… కరెంటు బిల్లు మీటర్ రీడింగ్ ప్రకారం ఇచ్చేయ్… హాల్ రెంట్ వద్దు, అది నీకు నేనిచ్చే పెళ్లికానుక అనుకో అన్నారు ఆయన….
Share this Article