రాజకీయాల్లో తమకు పడని వ్యక్తులపై బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తుందనేది బహిరంగ రహస్యమే కదా… లేదా తమ రాజకీయ ప్రత్యర్థులకు ఉపయోగపడే అధికారులనూ అది వదిలిపెట్టదు… అలా కత్తుల్ని వేలాడదీసి, అవసరాన్ని బట్టి స్టాండ్ మార్చుకుంటూ ఉంటుంది… పంజరంలో చిలుకలు కూడా కేంద్రం ఆదేశించే పలుకులే పలుకుతాయి… అడుగులు వేస్తాయి…
తెలంగాణలో మొన్నమొన్నటిదాకా ఉన్నంతగా ప్రస్తుతం లేకపోయినా ఎంతోకొంత బీజేపీ బలం ఉంది… దాని స్థాయి ఎంత అనేది ఎన్నికలు తేలుస్తాయి… కానీ బీఆర్ఎస్ బీజేపీని కూడా ప్రధాన ప్రత్యర్థిగానే భావిస్తోంది… అంతేకాదు, బీజేపీని ఏదోరకంగా బజారుకీడ్చి బదనాం చేయాలనీ ప్రణాళికలు వేస్తుంది… మరి బీజేపీ ఊరుకోదు కదా… గతంలో కర్నాటక, బెంగాల్, ఢిల్లీ, తమిళనాడుల్లో చేసినట్టే తెలంగాణలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం…
ఈ దిశలో కొందరు నాయకుల్ని టార్గెట్ చేసిన ఉదంతాలూ చూశాం… నిజానికి ఈసారి రాజకీయ నాయకులపై కాదు… తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉండి, బీఆర్ఎస్ చెప్పినట్టల్లా ఆడే ఉన్నతాధికారుల్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది… అయిదుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఈడీని ప్రయోగించే ప్లాన్ బీజేపీ పెద్దల మదిలో ఉందట…
Ads
దీనివల్ల పార్టీకి ఫాయిదా ఏమిటీ అంటారా..? రేప్పొద్దున ఎన్నికల్లో సదరు అధికారులు బీఆర్ఎస్‌కు ఏరకంగానూ ఉపయోగపడకుండా కట్టడి చేయడం… మేం చూస్తూ ఊరుకోం సుమా అనే హెచ్చరికను ఇతర అధికారులకూ పంపించడం కాబోయే దాడుల ఆంతర్యంగా చెబుతున్నారు… ఐతే, ఇది నిజమేనా..? మళ్లీ కేసీయార్‌తో బీజేపీ గోక్కుంటుందా అనేది ప్రశ్న… కానీ విశ్వసనీయ వర్గాలు చెప్పేది ఏమిటంటే…
‘‘పార్టీకి రెవిన్యూపరంగా ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ముఖ్యం… ముంబై ఎలాగోలా చేతికి వచ్చింది… చెన్నై, బెంగుళూరు తమ చేతుల్లో లేవు… ఇప్పట్లో వచ్చే సీన్ లేదు… హైదరాబాద్‌ను ఎలాగైనా ఈసారి చేజారనివ్వొద్దు… ఎన్నిరకాల ఉపాయాలు పన్నయినా సరే ఈసారి తెలంగాణలో జెండా ఎగరవేయాలి… ఈ దిశలో బీఆర్ఎస్‌ను కట్టడి చేయాలి… జరగాలంటే ఆ పార్టీకి సహకరించే బ్యూరోక్రాట్లు, వ్యాపారవర్గాలపై కన్నేయాలి…’’ ఇదేనట ఆలోచన… (హైదరాబాద్ యూటీ అనే ఆలోచనలు కూడా ఈ భావజాలం నుంచే వస్తున్నాయా..?)
Share this Article