నా కొడుక్కి టికెట్టు ఇవ్వండి… నా అల్లుడికి టికెట్టు… నా బిడ్డకు టికెట్టు… ఇలా దాదాపు అన్ని పార్టీల్లోనూ కుటుంబ వారసత్వం ఉంది… ఎవరూ మినహాయింపు కాదు… మరీ ప్రత్యేకించి కుటుంబ పార్టీల్లో, ఏక వ్యక్తి కేంద్రిత పార్టీల్లో వాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి ఈ వారసత్వాలు నడుస్తుంటాయి… చివరకు వామపక్షాల్లో సైతం ముఖ్య నాయకుల భార్యలు మహిళా విభాగాలకు, కొడుకులు యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తూ ఉన్న ఉదాహరణలు చూశాం…
అసలే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌లో ఈ గొడవలు మరీ ఎక్కువ… ఐతే ఈసారి నా కొడుక్కి, నా బిడ్డకు, నా అల్లుడికి, నా భార్యకు అనే కోరికలతో మాత్రమే ఆగడం లేదు… ఎంత వయస్సు పైబడినా సరే… నేను, నా కొడుకు,.. నేను, నా బిడ్డ… నేను, నా భార్య… అసలు ఇక్కడ కూడా ఆగడం లేదు… నేను, నా కొడుకులు… నేను, నా భార్య, నా బిడ్డ… ఇలా ఫ్యామిలీ ప్యాక్‌ల గొడవలు ఎక్కువైపోయాయి…
ఒక వాట్సప్ వార్త చూడండి… ‘‘ఉదయ్‌పూర్ తీర్మానాన్ని చెక్ పెట్టిన మైనంపల్లి
Ads
మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ పార్టీలో వారసత్వ టిక్కెట్ల గొడవ
తనకు, తన కొడుక్కి రెండు టిక్కెట్ల హామీతో మైనంపల్లి పార్టీలో చేరడంతో, పార్టీలోని సీనియర్లు తమకు తమ వారసులకు టిక్కెట్లు అడుగుతున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తనతో పాటు తన భార్య పద్మావతి రెడ్డికి… జానారెడ్డి తాను ఎంపీగా పోటీ చేస్తూ తన ఇద్దరు కుమారులు జయవీర్ రెడ్డికి నాగార్జునసాగర్, రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ టిక్కెట్లు అడుగుతున్నాడు.
మల్లు రవి కొడుకు కోసం… కొండా మురళి తనతో పాటు తన భార్య కొండా సురేఖకు, కూతురు కొండా సుష్మిత కోసం టిక్కెట్లు అడుగుతున్నారు.
పీజేఆర్ కుటుంబం నుండి విష్ణు, విజయ.. సీతక్క తనతో పాటు తన కొడుకు సూర్యకి టికెట్ అడుగుతున్నారు.
బలరాం నాయక్ తనతో పాటు తన కొడుకు సాయిశంకర్ నాయక్‌కు.. మల్‌రెడ్డి రంగారెడ్డి తన కొడుకు అభిషేక్‌రెడ్డి కొరకు టిక్కెట్లు అడుగుతున్నారు.
దామోదర రాజనర్సింహ తనతో పాటు తన కూతురు త్రిష… అంజన్ కుమార్ యాదవ్ తనతో పాటు తన కుమారుడు అనిల్ కుమార్ యాదవుకు టికెట్ అడుగుతున్నారు.
శ్యామ్ నాయక్ తనతో పాటు తన భార్య రేఖ నాయక్‌కు టికెట్ అడుగుతున్నారు…. ఇదీ వార్త…
ఐతే బయటికి రాని పేర్లు ఇంకా చాలానే ఉండవచ్చు… టికెట్ల వ్యవహారంలో ఎన్నికల ప్రచార, వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలకపాత్ర పోషిస్తున్నాడు ఇప్పుడు… తను ఇస్తున్న రిపోర్టులను డీకే శివకుమార్, డీకే సిఫార్సులను ఎఐసీసీ, సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంటోందని అంటున్నారు… మరణించిన అహ్మద్ పటేల్ పాత్ర పోషిస్తున్నాడు డీకే… ఇక రేవంత్‌రెడ్డి, నల్గొండ రెడ్డి ముఖ్యులు తమ వారికి ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారు… రేప్పొద్దున నిజంగానే కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే, మరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఈ సంఖ్యబలమే కదా నిర్దేశించేది…
ఇంకా వామపక్షాలకు సీట్లు ఇవ్వాల్సి ఉంది, అదీ ఇంకా తేలలేదు… కోదండరాం పార్టీని అకామిడేట్ చేయాలి… కొత్తగా పార్టీలోకి వచ్చిన పొంగులేటి తదితరులకూ సరైన సంఖ్యలో టికెట్లు ఇచ్చి సంతృప్తి పరచాలి… కానీ మరోవైపు ఉద్దండులకూ టికెట్లు కష్టంగా కనిపించే పరిస్థితి… ఉదాహరణకు పీసీసీ మాజీ అధ్యక్షుడు, సుదీర్ఘకాలం కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉన్న పొన్నాలకు ప్రతిగా కొమ్మూరి ప్రతాపరెడ్డి తనకు టికెట్టు కావాలని బలంగా ప్రయత్నిస్తున్నాడు… రేవంత్‌రెడ్డి కోటాలో తన బంధువు మొగుళ్ల రాజిరెడ్డి పేరూ ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం…
అదుగో 70, 80 పేర్లు ఫైనల్ అంటున్నారు… జస్ట్, పదీపదిహేను సీట్ల లెక్కలు తెగితే చాలు, ఇక మొత్తం జాబితా ఖరారైనట్టే అంటున్నారు గానీ… అది కాంగ్రెస్… నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకూ టెన్షనే… ఈ స్థితిలో ఫ్యామిలీ ప్యాక్‌లు చాలామందికి దక్కకపోవచ్చు..!! ఈసారి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచే జోష్ కనిపిస్తోంది కాబట్టి రెబల్స్ బెడద కూడా బాగానే ఉండేట్టుంది…!!
Share this Article