ఎయిర్ స్ట్రిప్ (రన్ వే) మాదిరిగా ఉండటంతో దీనికి గాజా స్ట్రిప్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. హమాస్ ఆధీనంలో ఉన్న ఈ గాజా స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యంత కల్లోలిత ప్రదేశం. ఉత్తరాన ఇజ్రాయెల్ బార్డర్ నుండి దక్షిణాన ఉన్న రఫా వరకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఇరుకైన ప్రాంతంలో సుమారు 23 లక్షల పాలస్తీనీయులు నివసిస్తున్నారు.
సొంత ఆదాయ వనరులు, 23 లక్షల మందికి సరిపడా ఆహారం, మంచినీరు, విద్యుత్ వంటివి లేని ఈ ప్రాంతానికి ఇజ్రాయెల్ నుండి ఆహారం, ఔషధాలు, మంచినీరు, విద్యుత్ సరఫరా చేసేది ఇజ్రాయిల్.
7 అక్టోబరు, 2023 నాడు ఇజ్రాయెలీల సుక్కొత్ పండుగ నాడు హమాస్ అనూహ్యంగా ఇజ్రాయిల్ మీద దాడి చేసి మహిళలు, పిల్లలు, సైనికులు సహా సుమారు 1300 ఇజ్రాయిల్ పౌరులను ఊచకోత కోసింది. అందులోనూ పసికందులను పాశవికంగా తలలు మొండెం వేరుచేసి హత్య చేసింది. దీంతో మానవ మృగాల మీద మానవత్వం చూపాల్సిన అవసరం లేదని ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ కు ఆహారం, ఔషధాలు, విద్యుత్, మంచినీటి సరఫరా నిలిపివేసింది.
Ads
గాజా స్ట్రిప్ లో హమాస్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయిల్ గతవారం రోజులుగా గాజా స్ట్రిప్ మీద 6000 బాంబులు జారవిడిచింది. దీంతో హమాస్ తీవ్రవాదులు సహా 2200 మంది చనిపోయారు. గాజా పట్టణంలో హమాస్ ను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తానని శపథం చేసిన ఇజ్రాయిల్ వాయు, నౌకా, సైనిక దళాలతో భూతల దాడికి సర్వ సన్నద్ధం అయి గాజా సరిహద్దుల వద్ద 3 లక్షల మంది సైనికులను, వేల సంఖ్యలో యుద్ద ట్యాంకులను మోహరించింది. పౌరులకు ప్రాణనష్టం సంభవించకుండా ఉండేందుకు 24 గంటల్లో 11 లక్షల మంది నివాసం ఉన్న గాజా పట్టణాన్ని ఖాళీ చేసి దక్షిణ భాగానికి వెళ్ళాలని విమానాల ద్వారా కరపత్రాలు జార విడిచింది.
గాజా వదిలి ఈజిప్టు దేశంలోకి వలస వెళ్ళాలి అనుకుంటే గాజా స్ట్రిప్ దక్షిణాన ఉన్న రఫా క్రాసింగ్ ఈజిప్ట్ మూసేసింది. మీకు కావాలంటే ఆహారం, మందులు ఇస్తాం కాని బార్డర్ గేటు తెరిచి మిమల్ని ఈజిప్టులోకి రానిచ్చేది లేదు అంటున్నది. మరి గాజా స్ట్రిప్ లో ఉన్న 23 లక్షల మంది ఎక్కడికి వెళ్ళాలి? మధ్యధరా సముద్రం ఒక్కటే మిగిలింది.
గాజాలో ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే రేషన్ మీద ఒకపూట ఆహారం మాత్రమే లభిస్తుంది. అందులోనూ ఒక మనిషికి ఒకరోజుకు కేవలం 500 మిల్లీ లీటర్ల మంచినీరు మాత్రమే దొరుకుతుంది. ఈ నీటితోనే అన్ని అవసరాలు తీర్చుకోవాలి. బాంబు దాడుల్లో గాయపడి చికిత్స కోసం ఔషధాలు సరిపడా లేకపోవడం, ఆహారం దొరకక ఆకలి బాధతో లక్షల మంది మరణించే అవకాశం ఉంది. ఇందులో 18 వేలమంది గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ ను పరిపాలిస్తున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే రాజకీయ పార్టీని ఓడించి అతివాద హమాస్ పార్టీని ఎన్నుకున్న గాజా స్ట్రిప్ ప్రజలే ఈరోజు వారి దుస్థితికి కారణం. దుష్టులను అందలం ఎక్కిస్తే వారు చేసే దుశ్చర్యలకు అంతిమంగా బలయ్యేది సామాన్యులే….. – నాగరాజు మున్నూరు
Share this Article