వంద పుకార్లు ఉండనివ్వండి. అక్కడక్కడా కాంట్రవర్సీలు జరగనివ్వండి. లాబీయింగ్ అనే ఆరోపణ వినిపించనివ్వండి. జాతీయ చలనచిత్ర పురస్కారాలు మాత్రం ఎన్నటికీ వన్నె తగ్గవు. వాటి స్థాయి, స్థానం 69 ఏళ్లుగా పదిలంగానే ఉంది. భారతదేశంలో సినిమా కళాకారుడికి ఎన్ని అవార్డులైనా రానీ, కానీ జాతీయ అవార్డు ఇచ్చే కిక్ మరే అవార్డుకూ సాటి రాదు. జాతీయ అవార్డు రావడం అంటే ఒక గౌరవం, దేశవ్యాప్త గుర్తింపు, ప్రతిభ కలిగిన వ్యక్తి అనే పేరు.. ఇవన్నిటి మేళవింపు. ఆ స్థాయిలో అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారంటే మాత్రం అతడు/ఆమెను అటు జనాలు, ఇటు పరిశ్రమ చూసే తీరులో కొంత ప్రత్యేకత ఉంటుంది.
చాలా కాలం వరకు జాతీయ చలనచిత్ర పురస్కారాలను బెంగాలీ, మలయాళం పరిశ్రమలు హక్కుభుక్తం చేసుకున్నాయి. ఒక ఏడాదిలో సింహభాగం అవార్డులు ఆ రెండు భాషల సినిమాలకే వచ్చిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అందులో చాలా వరకు సీరియస్ సినిమాలే! ఎప్పుడైతే సంజయ్ లీలా భన్సాలీ, అశుతోష్ గోవారికర్, రాజ్‌కుమార్ హీరానీ బాలీవుడ్‌లో సినిమాలు తీయడం మొదలుపెట్టారో అప్పటినుండి జాతీయ అవార్డుల లెక్క మారిపోయింది. కమర్షియల్ సినిమాలకూ అవార్డులు వరుస కట్టడం మొదలుపెట్టాయి.
దక్షిణాదిలో ఆ క్రెడిట్ ఎస్.ఎస్.రాజమౌళి గారికి ఇచ్చి తీరాలి. ‘మగధీర’ నుంచి ఆ తీసిన ప్రతి సినిమాకు (‘మర్యాదరామన్న’ కాకుండా) ఏదో ఒక కేటగిరీలో జాతీయ అవార్డులు వస్తూనే ఉన్నాయి. అవన్నీ అర్థికంగానూ ఘనవిజయం సాధించాయి. ఈసారి ‘ఆర్‌ఆర్ఆర్’కు ఏకంగా ఆరు జాతీయ పురస్కారాలు. ఇన్ని అవార్డులు అందుకున్న తొలి తెలుగు సినిమా, మూడో దక్షిణాది సినిమా ఇదే కావడం విశేషం. ఈసారి తెలుగు పరిశ్రమకు మొత్తం 11 అవార్డులు వచ్చాయి.
Ads
చాన్నాళ్ల దాకా జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం లైవ్‌లో చూసే అవకాశం లేదు. పేపర్లో వార్తలు మాత్రం వచ్చేవి. ఆ తర్వాత దూరదర్శన్‌లో ప్రసారం చేయడం మొదలైంది. ఇటీవల అందరికీ ఈ అవార్డుల మీద ఆసక్తి పెరగడంతో టీవీ చానెల్స్‌లో పూర్తి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. మీరు చూసి ఉండకపోతే ఒకసారి చూడండి. మొత్తం కార్యక్రమం చాలా పద్ధతిగా సాగుతుంది.
దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముందు రోజే అవార్డు గ్రహీతలు, వారి వెంట వచ్చేవారిని దిల్లీకి పిలిచి వసతి ఏర్పాట్లు చేస్తారు. ఆ సాయంత్రం మాక్ డ్రిల్ ఒకటి జరుగుతుంది. అంటే అవార్డుల ప్రదానోత్సవం నమూనా అన్నమాట! రాష్ట్రపతి స్టేజీ మీద ఎక్కడ ఉంటారు, అవార్డు గ్రహీతలు ఎలా స్టేజీ ఎక్కాలి, ఎలా దిగాలి అని నమూనాగా చూపిస్తారు. తర్వాత రోజు కార్యక్రమం. వాళ్లున్న హోటల్ నుంచి విజ్ఞాన్ భవన్ దాకా రావడానికి రవాణా సౌకర్యాలు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు. రాష్ట్రపతి, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి, సహాయ మంత్రి, ఆ సంవత్సరం జ్యూరీ అధ్యక్షులు(ఫీచర్ ఫిల్మ్ & నాన్ ఫీచర్ ఫిల్మ్) స్టేజీ మీదకు రావడంతో కార్యక్రమం మొదలవుతుంది.
ముందుగా జనగణమన పాడతారు. ఆ తర్వాత అందరూ కూర్చున్నాక వ్యాఖ్యాతలు మాట్లాడుతూ ముందుగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిని మాట్లాడమంటారు. ఆయన గంటలకొద్దీ ప్రసంగాలు ఇవ్వకుండా చాలా క్లుప్తంగా ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి లేచి వచ్చి స్టేజీ మధ్యలో నిల్చుంటారు. వ్యాఖ్యాతలు ఒక్కో కేటగిరీలో పేర్లు పిలుస్తూ ఉంటే ఆయా అవార్డు గ్రహీతలు స్టేజీ ఎక్కి అవార్డు అందుకుని కిందకు వెళ్లిపోతారు. మొదట ఉత్తమ సినీ విమర్శకుడు, ఉత్తమ సినిమా గ్రంథం పురస్కారాలు ఇస్తారు.
ఆ తర్వాత నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డులు ఇస్తారు. స్టేజీ మీద ఎవరి పేరైతే తర్వాత పిలుస్తారో వాళ్లు ముందుగానే లేచి నిలుచుని రెడీగా ఉండేలా కింద కొందరు నిర్వాహకులు చూస్తారు. అందుకు తగ్గట్టే అవార్డు గ్రహీతల సీటింగ్ ఎరేంజ్‌మెంట్ ఉంటుంది. కార్యక్రమం ఆలస్యం కాకుండా ఒక వరుసలో జరగాలని ఈ ఏర్పాటు. ఇదంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఎలాంటి హడావుడీ ఉండదు.
నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డులు ఇవ్వడం అయిపోయాక రాష్ట్రపతి వెళ్లి కుర్చీలో కూర్చుంటారు. ఆ తర్వాత కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రసంగిస్తారు. అందులో కొంత ప్రభుత్వ అనుకూలత, తమ విధానాల గురించి ఉంటుంది. అయితే క్లుప్తంగా చెప్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రపతి లేచి స్టేజీ మధ్యకు వస్తారు. ఈసారి ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డులు ఇస్తారు. ఇంతకుముందులాగే పేరు పిలిచినవారు రావడం, అవార్డు తీసుకోవడం, కిందికి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇతర అవార్డు ఫంక్షన్లలాగా డ్యాన్స్‌లు, యాంకర్ల జోకులు ఇక్కడ ఉండవు. హీరో, హీరోయిన్లకు ముందుగా అవార్డులు ఇచ్చేసి ఇంటికి పంపడం కూడా ఉండదు. ముందుగా వివిధ కేటగిరీల్లో అవార్డులు ఇచ్చాక చివర్లో ఉత్తమ నటి, ఆ తర్వాత ఉత్తమ నటుడు పురస్కారాలు ఇస్తారు. వారికి ముందుగా అవార్డులు ఇస్తే మీడియా దృష్టి అంతా వాళ్ల మీదే ఉంటుందేమోని ఈ ఏర్పాటు చేసి ఉండొచ్చు!
ఆ తర్వాత జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ వినోదాత్మక చిత్రం, జాతీయ సమైక్యత భావం కలిగిన చిత్రం వంటి అవార్డులు ఇస్తారు. ఆ తర్వాత దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం ‘దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు’ అందిస్తారు. ఆ అవార్డు గ్రహీత స్టేజీ మీదకు రాగానే గౌరవసూచకంగా అందరూ లేచి నిలబడతారు. అవార్డు అందుకున్న తర్వాత ఆ గ్రహీత మైక్‌లో అందరినీ ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పొచ్చు! ఇది కేవలం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతకు మాత్రమే ఉండే అవకాశం. ఆస్కార్, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడినట్టు ఇక్కడ ప్రతి ఒక్కరూ మాట్లాడేందుకు అవకాశం లేదు. కొంత కాలం క్రితం దాకా జాతీయ ఉత్తమ గాయకుడు, గాయని అవార్డులు అందుకున్నవారి చేత వారికి అవార్డు తెచ్చిన పాటలు పాడించేవారు. కొన్నేళ్ల నుంచి ఆ కార్యక్రమం నిర్వహించడం లేదు.
ఆ తర్వాత చివరగా రాష్ట్రపతి మాట్లాడతారు. చాలా వరకు రాష్ట్రపతి మాట్లాడే మాటలు ‘కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ’ ముందుగా తయారు చేసిన నివేదికలోనివే అయ్యి ఉంటాయి. భారతీయ సినిమా-దాని విశిష్టత, ఈ ఏడాది అవార్డులు అందుకున్న సినిమాలు, అందులో కొన్నింటిని రాష్ట్రపతి ప్రస్తావిస్తారు. ఆ ప్రసంగం ముగిశాక మరోసారి అందరూ జనగణమన పాడతారు. అక్కడితో కార్యక్రమం అయిపోయినట్టు లెక్క!
ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలన్న నియమం ఏమీ ఉండదు. ముందుగానే అవార్డు గ్రహీతలకు ఫోన్ చేసి వచ్చేదీ రానిదీ నిర్ధారించుకుంటారు. రాలేని పరిస్థితిలో ఉంటే ఏమాత్రం బలవంతం చేయరు. ఒకరి బదులు మరొకరు అవార్డు అందుకునే అవకాశం దాదాపు ఉండదు. ఒకవేళ అవార్డు గ్రహీత మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు వచ్చి ఆ అవార్డు అందుకోవచ్చు. (శ్రీదేవి గారు మరణించాక ఆమెకు వచ్చిన జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని ఆమె భర్త బోనీకపూర్, కుమార్తెలు కలిసి అందుకున్నారు). ఏదైనా ఒక విభాగంలో(మేకప్, కాస్ట్యూమ్స్) ఒకరి కంటే ఎక్కువ మంది పనిచేసి ఉంటే అందరికీ అవార్డులు ఇస్తారు.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలంటే చాలా ప్రయత్నించాలి. అన్నిసార్లూ దొరకడం కష్టమే! అలాంటిది రాష్ట్రపతే వచ్చి అవార్డు అందించడం అనేది కొందరి జీవితకల. అలాంటి కల ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నెరవేరుస్తుంది. రేపు మీరే ఆ అవార్డు గ్రహీత కావొచ్చు! కష్టేఫలి. All the Best…… PS: ఈ వివరాలన్నీ యూట్యూబ్, నెట్‌లో చూసి సేకరించినవే! నేనెప్పుడూ ఆ అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లలేదు….. – విశీ
Share this Article