Gurram Seetaramulu…. ఒక చిన్నపాటి ఇల్లో, గుడిసో కట్టుకున్నా సరే, తెలిసిన సాయిల్ టెస్ట్ వేసుకోవాలి, పునాది ఎంత ఉండాలి ? పిల్లర్ ఎంత లోతు తవ్వాలి, ఎన్ని ఇంచుల స్లాబ్ ఉండాలి, ఎంత స్టీల్ వాడాలి, వాటి నాణ్యత కోసం తపన ఉంటది… కాటన్ అనే పరదేశీ ఇంజనీర్ పడావు బడ్డ భూముల్లో నీళ్ళు ఉంటే పంటలు బాగా పండి, శిస్తు వసూలు ఎక్కువ చేయవచ్చు అని బ్రిటిష్ వాళ్ళను ఒప్పించి మరీ చరిత్రలో నిలబడి పోయే కట్టడాన్ని నిర్మించాడు.
అది ఒక బాధ్యతతో చేసిన పని. ఆయన ధవళేశ్వరం కట్టే కాలంలో గోదావరి పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసే దాకా ఇంచు ఇంచు లెక్కలు కొలతలు వేశాడు. నది సముద్రంలో కలిసే చోట వంపులు తిరిగే చోట నీటి వడి ఎక్కువ ఉంటది… అది సాధారణ సూత్రం… అక్కడ ఆనకట్ట ఆలోచన విరమించుకుని ధవళేశ్వరం చివరి పాయింటుగా ఎంచుకున్నాడు… మన చంద్రాలు, మన జగనాలు లక్షలాది.మందిని నిర్వాసితులను చేసి వేల కోట్లు పెట్టి పోలవరం కడుతున్నారు, అది సేఫ్ కాదని ప్రపంచ జలవనరుల నిపుణులు తేల్చేశారు కూడా… ఏదో ఒకరోజు అది చేయబోయే నష్టం తలుచుకుంటే ఊహకే కష్టంగా ఉంది…
కనీసం వాగులో చేపలు పెట్టేవాడు కూడా ఎక్కడ కట్ట వేయాలి, నీళ్లు ఎలా గుప్పాలో ఆలోచన చేస్తాడు. ఇక మన తెలంగాణ పెద్ద ఇంజనీరు సారు లక్ష కోట్లు పెట్టి హడావుడిగా గోదారమ్మకు కొత్త నడకలు నేర్పిన చూశారా అంటున్నాడు. మొన్నటి వరదలు గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చాయి… సరే, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన తాలిపేరు కట్ట కూడా మునిగి తట్టుకుని నిలబడ్డది… మరి మేడిగడ్డ బరాజ్ ఎందుకు కుంగింది..? ఎల్ అండ్ టీ వాళ్లు చెబుతారా..? కళ్లు మూసుకున్న మన ఇంజినీర్లు చెబుతారా..?
Ads
మొహంజదారో మట్టిమనుషుల స్వేదంతో నిర్మించిన పురాతన జ్ఞాపకం. నది నాగరికత వికాసానికి మూలం. ఏ నది జీవం పోసిందో అదే నది తుడిచిపెట్టిన పురా జ్ఞాపకం మొహంజదారో… మీకు తెలుసో లేదో, మొహంజదారో నాగరికత తుడిచి పెట్టుకుపోవడానికి కారణం అవగాహన లేకుండా నదికి ఆనకట్ట కట్టడం అని చరిత్ర నిరూపించింది, అదీ నీళ్లకు ఉన్న శక్తి… వానలు వరదలు లేని టైంలో మేడిగడ్డ ఆనకట్ట రెండు అడుగులు కుంగడం అంటే ప్రమాద తీవ్రత ఎక్కువే… చూడాలిక మన జోకుడు ఇంజనీర్లు ఆనకట్ట కింద ఫిల్లింగ్ చేసి నిలబెడతాం అంటారేమో…
పీసా టవర్ అని ఒక ప్రసిద్ధ ప్రపంచ వింతల మారి కట్టడం వంగి పోతోంది… కట్టడాల నైపుణ్యంలో మనకన్నా రెండు వేల ఏళ్ల ముందు ఉన్నారు ఐరోపా వాళ్ళు… వాళ్లే వొంగి పోతున్న టవర్ ని నిలబెట్టలేక కూలిపోయే సౌధాన్ని చూపి కూడా టూరిస్ట్ లను ఆకర్షించే పనిలో ఉన్నారు… మనోళ్లు ఏం చేయబోతున్నారో మరి… కనిపిస్తున్న ఫోటోలు చూస్తే ఆందోళనకరంగానే ఉంది మరి… నిజం మాట్లాడితే నిష్ఠురం… ఇప్పుడు కుంగిన పిల్లర్ లేపడం అంటే కూలిన సౌధాన్ని నిలబెట్టినంత ఈజీ కాదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ మరిన్ని ఆసక్తి కరమైన నిజాలు చెప్పినా ఆశ్చర్యపోవద్దు. ఆ ప్రాజెక్ట్ లో ఒక DPR నేను చదివినట్టు గుర్తు…
Share this Article