ఫోటో చూశారు కదా… ఆమె వృత్తి రీత్యా ఓ డాక్టర్… పాతిక సంవత్సరాల క్రితమే ఇంగ్లండ్ వెళ్లిందీమె… అక్కడే స్థిరపడిపోయిందామె… ఓరోజు తన కూతురు స్కూల్ నుంచి చిరాగ్గా వచ్చింది, బ్యాగ్ సోఫా మీద పడేసి కన్నీళ్లు పెట్టుకుంది…
ఏంది తల్లీ, ఏమైంది అనడిగింది డాక్టరమ్మ… స్కూల్‌లో పిల్లలు ఏడిపిస్తున్నారమ్మా… మీ అమ్మ ఏమిటి అలా..? ఓ క్లాత్ అలా చుట్టేసుకుంది, అదేం డ్రెస్సింగ్ అని ఓ తెల్లమ్మాయి ప్రశ్నించింది… ఏం చెప్పాలో అర్థం కాలేదు… ఐనా మోడరన్ డ్రెస్సులు వేసుకోవచ్చు కదా మమ్మీ… అని చెప్పుకొచ్చింది బిడ్డ…
Ads
వాళ్లు ఉండే ఏరియాలో ఇండియన్స్ చాలా తక్కువ… అదీ పాతికేళ్ల క్రితం మాట… ఆ డాక్టరమ్మ స్కూల్‌కు వెళ్లింది… టీచర్‌కు విషయం వివరించింది… ఆ టీచర్ బాధపడింది… సారీ మేడమ్, మా స్కూల్‌లో ఇలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యల్ని, చేష్టల్ని అనుమతించం, సహించం, ఆ వ్యాఖ్యలు చేసిన అమ్మాయిని పిలిచి పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పింది…
నో, నో, అలా చేయకండి టీచర్ అని డాక్టర్ మధ్యలోనే అడ్డుపడింది… మీరు పనిష్మెంట్ ఇస్తే ఇక ఈ వివక్ష, పిల్లల నడుమ దూరం, వైరం బాగా పెరగిపోతాయి… నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నాకో ఐడియా ఉంది, వర్ణ- ప్రాంత వివక్షల్ని సున్నితంగానే డీల్ చేయాలి… నా డ్రెస్సింగ్ వెనుక నా ఇండియన్ కల్చర్ ఏమిటో పిల్లలకు చెబుతాను, చాన్సివ్వండి అని కోరింది డాక్టరమ్మ…
ష్యూర్, అలాగే చేయండి అని వోకే చెప్పింది ఆ టీచర్… స్కూల్ ప్రిన్సిపాల్ కూడా మొత్తం కథంతా విని వోకే అంది… సదరు టీచర్ ఆ ఏర్పాటు చేసింది… పిల్లలందరూ ఒకచోట కూడారు… అప్పటికే ఆ డాక్టరమ్మ తన ఇంటికి వెళ్లి నగలు, చీరలు, బొట్టు, దేవుడి బొమ్మలు, రామాయణ భారత ఘట్టాల ఫోటోలు తీసుకెళ్లింది… ఆవిడకు నాట్యంలో ప్రవేశం ఉంది… ఇక ఇండియా గురించి, కట్టుబొట్టు, ఆచారం గురించి, రామాయణ భారతాల గురించి నర్తిస్తూ పిల్లలకు వివరించింది…
మీ మమ్మీ పిచ్చి డ్రెస్ వేస్తుంది అని ఏడిపించిన పిల్లను పిలిచి, చక్కగా చీర కట్టి, బొట్టు పెట్టి, అద్దం ముందు పెట్టి… ఇప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావ్, నువ్వే చెప్పు అనడిగింది… వావ్, లుకింగ్ లైక్ యాన్ ఇండియన్ ప్రిన్సెస్ (భారతీయ రాజకుమారిలా ) కనిపిస్తున్నాను అని మురిసిపోయింది ఆ పిల్ల… అంతే ఆ తరువాత ఇక చీరను అడ్మైర్ చేశారు తప్ప ఏ కామెంట్లూ చేయలేదు… ఒక సమస్య అలా సాల్వయింది…
ఈ సంఘటన తరువాత ఆమెకు ఓ ఆలోచన తట్టింది… మిగతా చోట్ల కూడా ఇండియన్ కల్చర్ గురించి ఎందుకు చెప్పకూడదు అనుకుంది… అలా మొదలుపెట్టి ఈరోజు వరకు దాదాపు 1500 ప్రదర్శనలు ఇచ్చింది ఆమె… కంటెంట్ ఒకటే… మేము, మా వస్త్రధారణ, మా అలవాట్లు… ఒక విమర్శను ఆమె తనకు, తన దేశానికి అనుకూలంగా ఎంత బాగా మార్చుకున్నదో కదా…
(ఇది నిజానికి ఓ వాట్సప్ గ్రూపులో చూసిందే… కాస్త వెతికితే ఫేస్‌బుక్‌లో Priya Anjali వాల్ మీద కనిపించింది… ఇంట్రస్టింగ్ అనిపించింది… బాగుంది కూడా… అందుకే ఈ షేరింగు… నిజానిజాల లోతుల్లోకి వెళ్లలేదు… కొన్ని సవరణలతో…)
Share this Article