1977 – ఒక ఎమర్జెన్సీ – ఒక లాకప్ డెత్ … మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది? తీసి ఇంతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ అనేది వచ్చి, 1977 దాకా కొనసాగింది. ఆ కాలంలో ప్రజల హక్కులు హరించబడ్డాయి. రాజన్ అనే యువకుడ్ని పోలీసులు తీసుకెళ్లి లాకప్‌లో నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చెట్టంత కొడుకు బతికి ఉన్నాడో, వస్తాడో రాడో అన్న వేదన ఆ తల్లిదండ్రులకు మిగిలింది. మలయాళ సినిమా రంగం ఈ దుర్ఘటనని అత్యంత ధైర్యంగా ఒడిసిపట్టి జనాల ముందు పెట్టింది. ఆ సినిమా పేరు ‘పిరవి’. అంటే ‘జన్మ’.
… 1977లో పోలీసులు తీసుకెళ్లిన తన కొడుకు రాజన్ ఆచూకీ కోసం 57 ఏళ్ల కేరళవాసి T.V.Eachara Warrier ఎక్కి దిగని కార్యాలయం లేదు. ఫిర్యాదు ఇవ్వని అధికారి లేరు. ఎవరూ నిజం చెప్పలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చివరకు ప్రధాని, రాష్ట్రపతికి కూడా లేఖలు రాశారు. అయినా ప్రయోజనం శూన్యం. చివరకు కేరళ రాష్ట్రంలో తొలిసారి ఆయన Habeas Corpus పిటీషన్ వేశారు. అంటే కనిపించకుండా పోయిన వ్యక్తిని కోర్టులో హాజరుపరచాలి. రాజన్ రాలేదు. పోలీసులు తేలేదు. ఏనాడో అతణ్ని లాకప్‌లో చంపి, సమాధి చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బోలెడు అబద్ధాలు చెప్పారు. ఈ కేసు సంచలనమై అప్పటి కేరళ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్(కాంగ్రెస్) రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘Rajan Case’గా ఈ కేసు దేశమంతా తెలిసింది. కానీ రాజన్ హత్యకు కారణమైనవారికి శిక్ష? ఆ తల్లిదండ్రుల గుండె కోతకు ఓదార్పు?
… ఈ ఘటననే 1988లో కథగా మలిచి తొలి సినిమా తీశారు షాజీ ఎన్.కరుణ్. ‘సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలి’ అని నమ్మిన వ్యక్తి ఆయన. అటువంటి కథల్ని ఏరికోరి ఎంచుకునే దర్శకుడు ఆయన. పోలీసుల అదుపులో ఉన్నాడనే కొడుకు కోసం తిరిగి తిరిగి విసిగిపోయి, చివరికి మతి భ్రమించిన తండ్రిని ఈ సినిమాలో చూపారు. రాజ్యహింసకు బలవుతున్నవారు, వారి కుటుంబాలు పడుతున్న మానసిక వేదనను కళ్లకు కట్టారు. 80 ఏళ్ల వయసున్న ప్రేమ్‌జీ ఈ చిత్రంలో తండ్రి పాత్రలో కనిపిస్తారు. కొడుకు రాక కోసం అల్లాడే తండ్రిగా ఆయన నటన చూసి తీరాలి. 1988లో జాతీయ ఉత్తమ నటుడిగా ఆయనకు పురస్కారం అందించారు. ఎందరి తండ్రుల వేదననో తెరపై చూపించినందుకు దక్కిన గౌరవం అది. Cannes Film Festivalలోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది. నటి అర్చన ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించారు.
Ads
… పోలీసుల కారణంగా తన కొడుకును కోల్పోయిన T.V.Eachara Warrier సుదీర్ఘ కాలం న్యాయపోరాటం చేశారు. కేరళ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ప్రపంచానికి తెలియజెప్పారు. తన అనుభవాలను ‘ఒరు అచ్చంటె ఓర్మక్కురిప్పుకల్'(ఒక తండ్రి జ్ఞాపకాలు) పేరిట పుస్తకంగా రాశారు. Memories of a Father పేరిట ఆ పుస్తకం ఇంగ్లీషులోకి అనువాదమైంది.
… Lockup Death పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. యాదాద్రి భువనగిరిలో మరియమ్మ, విజయనగరంలో బేతా రాంబాబు, తమిళనాడు తూత్తుక్కుడిలో పి.జయరాజ్, అతని కొడుకు బెనిక్స్, కేరళ రాష్ట్రం ఇడుక్కిలో 49 ఏళ్ల రాజ్‌కుమార్.. జాబితా చాలా పెద్దది. వీళ్లందరికీ ఎన్నటికి న్యాయం దొరికేను? ఏం న్యాయం చేకూరేను? P.S: ఈ చిత్రం యుట్యూబ్‌లో English Subtitlesతో అందుబాటులో ఉంది.
Share this Article