నిజమే… పాత్రికేయ మిత్రుడు K V Kurmanath చెప్పినట్టు… ఎలాటి పరిశోధన, విచారణ చేయకుండానే మేడిగడ్డ బ్యారేజ్ సంఘటనపై (కేంద్రం) ఓ నిర్ధారణకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందనీ… పునాదులు, దీనికి సంబంధించిన స్ట్రక్చర్లను సరిగా పరిశీలించిన తర్వాతనే కచ్చితమైన కారణాలను తెలుసుకోగలమనీ ప్రభుత్వం చెబుతోంది… కరెక్టే, కానీ ఎలాటి పరిశోధన లేకుండానే విద్రోహచర్య మీద నెట్టెయ్యవచ్చునా..? ఆత్మహత్య చేసుకున్న ఆ యువతి మరణాన్ని ఓ విఫలప్రేమ మీదకు నెట్టెయ్యవచ్చునా..? అసలు పరీక్షే రాయలేదని అనెయ్యవచ్చునా..?
ఏ విషయమైనా సరే డైవర్ట్ చేయడం బీఆర్ఎస్‌కు మొదటి నుంచీ ఉంది… ఇప్పుడు మరింత తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది… సోషల్ మీడియా వింగ్స్ ప్రభావం బాగా పడ్డట్టుంది పార్టీ మీద…! ఎవరో దిగువ శ్రేణి నాయకులు ఏదో ఒకటి మాట్లాడారంటే ప్రస్తుత రాజకీయాల్లో పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు… కానీ కేటీయార్ స్థాయి కాబోయే ముఖ్యమంత్రి మాటలు ఆచితూచి వినిపించాలి… కానీ అది ఇప్పుడు లోపించింది,.. ఏదో ఒకటి, ఎదుటి పార్టీపై బట్ట కాల్చి మీద వేసేద్దాం… తరువాత వాడి ఖర్మ అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ ధోరణి…
ప్రత్యేకించి ఫేక్ ప్రచారాలకు కేటీయార్ స్థాయి నాయకులు దూరంగా ఉండాలి… రేప్పొద్దున కీలక విషయాల్లో నిజాలు చెప్పినా సరే ఇక జనం నమ్మని పరిస్థితిని తీసుకొచ్చుకుంటున్నట్టుంది చూడబోతే అనంటున్నాడు మరో పాత్రికేయ మిత్రుడు Vasireddy Srinivas… నిన్న బాగా చర్చల్లో నలిగిన ఓ అంశమే తీసుకుందాం… బీఆర్ఎస్ భజనకు దిగిన తెలుగు మీడియా, చివరకు ఆంధ్రజ్యోతితో సహా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు… కేటీయార్ ఏమన్నాడు..? కర్నాటక డిప్యూటీ సీఎం డీకేశివకుమార్ ఓ లేఖ రాశాడు, ఫాక్స్ కాన్ అనే కంపెనీని హైదరాబాద్‌లో కాదు, బెంగుళూరులో పెట్టాలి అనేది ఆ లేఖ సారాంశం, ఇలాంటి కాంగ్రెస్‌కు వోటేయాలా అని కేటీయార్ ప్రశ్న,.,
Ads
ఆలూలేదు, చూలూలేదు… అసలు డీకేశివకుమార్ అలాంటి లేఖే రాయలేదు… కేటీయార్ ప్రచారం కాంగ్రెస్‌కు నష్టం చేకూరుస్తుందని భావించి వెంటనే ట్విట్టర్‌లో వివరణ ఇచ్చాడు… ఆ లేఖ ఫేక్ అని తేల్చాడు, సైబర్ క్రైమ్‌లో కేసు కూడా పెట్టినట్టు చెప్పాడు… ఈలోపు బదనాం చేసీ చేసీ ఇప్పుడిక బీఆర్ఎస్ సైలెంట్… టీపీపీఎస్సీ బాధితురాలు ప్రవల్లిక విషయంలోనూ కేటీయార్ తొందరపడి ఏవేవో వ్యాఖ్యలు చేసినట్టు గుర్తు… ఆమె టీపీపీఎస్సీకి దరఖాస్తు చేసిన హాల్ టికెట్లను సోషల్ మీడియా వైరల్ చేసింది… మళ్లీ బీఆర్ఎస్ సైలెంట్… అవెలా ఉన్నా… తాజాగా బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మీద హత్యాప్రయత్నం జరిగింది కదా…
ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ నేరాన్ని కాంగ్రెస్ మెడలో వేయడానికి ప్రయత్నించారు బీఆర్ఎస్ నేతలు… మరీ ముఖ్యంతా కేటీయార్… రేవంత్ వంటి థర్డ్ రేట్ క్రిమినల్స్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటే ఇలాంటివే జరుగుతాయి అని సూత్రీకరించాడు… చాలా పరుష వ్యాఖ్యలు… కానీ ఏమైంది..? సాక్షాత్తూ పోలీసులే ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు… ఈ సంఘటనకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎవడో సెన్సేషన్ కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అని… మరిక్కడ కేటీయార్ క్రెడిబులిటీకి జరిగిన నష్టం మాటేమిటి..? కేసీయార్ కూడా లండుదో మొండితో మాకు కత్తి దొరకదా అని వ్యాఖ్యానించాడు… సీఎం స్థాయి నేతకు తగని వ్యాఖ్య అది…
రేడియో టాక్ షోలు, గంగవ్వతో కలిసి చికెన్ వంటకాలు ఎట్సెట్రా ప్రచారాల దాకా వెళ్లిపోయాడు కేటీయార్… ఎన్నికల వేళ తప్పు అని చెప్పలేం కానీ సీరియస్ ఇష్యూస్ మీద బీఆర్ఎస్ వైఖరిని జనంలోకి తీసుకువెళ్లాల్సిన వేళ ఇలాంటి ప్రచారాలు కౌంటర్ ప్రొడక్ట్ అవుతాయి… మేడిగడ్డ మీద సరైన వివరణల్లేవు,,, గతంలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోతోంది అంటూ కేసులు పెట్టారు, దేశవ్యాప్త ప్రచారాలకు దిగారు… చివరకు ఏమైంది..? అంతా తుస్… సో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏమీ సత్తెపూసలు అని చెప్పడం లేదు… అధికారంలో ఉన్న పార్టీ కీలక విషయాలకు సంబంధించి క్రెడిబులిటీ కోల్పోని రీతిలో వ్యాఖ్యలు చేయాలి, స్పందించాలి… అంతే, లేదంటే దుందుడుకు ధోరణి పార్టీకే నష్టం చేకూరుస్తుంది… (గంగవ్వతో కోడికూర ఫోటో కేవలం అటెన్షన్ కోసం మాత్రమే…)
Share this Article