Bharadwaja Rangavajhala……. ఓ పదేళ్లు పోయాక మురుగదాస్ తీయబోయే సినిమా కథ … అప్పటికి ఓపికుంటే విక్రమ్ హీరోగా చేసే అవకాశం ఉంది. ఓ పేద్ద ఊళ్లో … కొంత మంది టీనేజ్ కుర్రాళ్లు కిడ్నాప్ అవుతూంటారు.. ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని ప్రపంచం అంతా క్యూరియస్ గా ఉంటుంది.
అసలు కిడ్నాపర్ల డిమాండ్స్ ఏంటి? అనేది పైగా కిడ్నాప్ అవుతున్న కుర్రాళ్లలో అధిక సంఖ్యాకులు దిగువ మధ్య తరగతి కన్నా దిగువ తరగతి కుర్రాళ్లే. దీంతో మీడియాలో వివిధ కథనాలు ప్రచారం అవుతూంటాయి. కిడ్నాపర్ల లక్ష్యం కేవలం కుర్రాళ్ల ఆర్గాన్ల చౌర్యమే తప్ప రాన్సమ్ ఎమౌంట్ కాదని స్టోరీలు రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తారు.
ఈలోగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కిడ్నాపైన కుర్రాళ్లలో ఒకడ్ని కట్టేసి కాళ్ల మీద బెల్డుతో ఓ వ్యక్తి కొడుతూంటాడు. వాడు ఏడుస్తూంటాడు… కొట్టే వ్యక్తి మాత్రం సరిగా కనిపించడు. ఈ వీడియో ఎప్పుడైతే లీకైందో దాని మీద ప్రపంచం అంతా అలర్టైపోతుంది. మీడియా ప్రతిపక్షాలూ ఏకేస్తూంటాయి. ముఖ్యమంత్రి తక్షణం రిజైన్ చేయాలంటాయి. నానా గోల జరుగుతూండగా …
Ads
ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతుంది. ఫలానా రోజు ఫలానా గ్రౌండ్ లో తను కిడ్నాప్ చేసిన కుర్రాళ్లతో మీడియా సమావేశం పెడుతున్నట్టు ప్రకటిస్తాడన్నమాట. ఆ మీడియా సమావేశానికి ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులందరూ హాజరవుతారు. ప్రపంచంలో ఉన్న టీవీ డిఎస్ఎన్జీ వ్యాన్తన్నీ వచ్చేస్తాయి. అప్పటికే నిందితుడ్ని పట్టుకోవాలని లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రతిపక్షం రెచ్చగొట్టిన కొందరు ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ ప్రారంభమౌతుంది. నిందితుడు విక్రమ్ .. కనిపిస్తాడు. పెద్ద గౌనేసుకుని జుట్టు పెరిగిపోయి పిచ్చోడిలా ఉంటాడు.
తను ఓ వీడియో ప్లే చేస్తాడు … అందులో కిడ్నాపైన కుర్రాళ్లందరూ తన దగ్గర కస్టడీలో పడుతున్న బాధలన్నీ చూసిప్తాడు. జనం హాహాకారాలు చేసి విక్రమ వైపు దూసుకొస్తారు. అయితే విక్రమ్ మాయమౌతాడు. జనాలకు అర్ధం కాదు.. ఏం జరుగుతోందని …
అప్పుడు చెప్తాడు … అప్పటి వరకు తను కనిపించింది కేవలం వర్చువల్ ఇమేజ్ గా మాత్రమేననీ గ్రాఫిక్ వర్క్ తో, ఎఐ సపోర్టుతో క్రియేట్ చేసిన ఇంప్రెషన్ మాత్రమే అని చెప్తాడు. దీంతో కుర్రాళ్లు ఏమైపోయారో అనే ఆందోళన తల్లిదండ్రుల్లో పెరిగిపోతుది. పోలీసుల మీద ప్రెజర్ పెరిగిపోతుంది.
కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో … విక్రమ్ మరోసారి మీడియా సమావేశం పెడతాడు. పెట్టి … కొన్ని వీడియోలు ప్రదర్శిస్తాడు. అందులో సిటీ బస్సుల్లో ప్రయాణించే చాలా మంది ముసలీముతకా, నడి వయసు వారూ బస్సులోంచీ దిగుతూ కింద పడిపోయే విజువల్స్ ఉంటాయి.
ఈ విజువల్స్ ప్రదర్శన అయ్యాక .. అప్పుడు విక్రమ్ మాట్లాడడం మొదలెడతాడు. ఈ దేశ ప్రజలకు ఉన్న అతి పెద్ద జబ్బు ఫుట్ బోర్డ్ ట్రావెలింగ్ … అంటాడు. బస్సుల్లో ఖాళీ ఉన్నా సరే, ఫుట్ బోర్డు మీదే చాలా మంది ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూంటారు. అలాంటి సమయంలో బస్సు ఎక్కడైనా ఆగితే … దిగేవాళ్లు తొందరలో ఉంటారు కదా … బస్సు బయల్దేరి పోతే ఎలా అనే ఆదుర్దాలో దిగుతూండగా … దిగే దగ్గర కమ్మీ పట్టుకోవాలంటే కుదరక డ్రైవర్ బ్రేకేసినప్పుడు ఏం పట్టుకోవాలో అర్ధంకాక ఎటు దిగాలో తెలియక అపోజిట్ డైరక్షన్ లో దిగి ఢమాల్ అని కింద పడుతూంటారు.
అలా పడిపోయిన ఓ ముసలి వాడు లేచి ఆటోలో బయల్దేరి ఇంటికి వెడతాడు. అప్పుడు కూతురు చూసి నాన్నా నీ వెనకాల దెబ్బ తగిలింది … నెత్తురు వస్తోందని చెప్తుంది. అప్పుడు చూసుకుంటే నిజంగానే అతని తల్లోంచీ రక్తం స్రవిస్తూంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ అప్పటికే ఆయన చనిపోయి ఉంటాడు. అతని మీద ఆధారపడిన ఆ కుటుంబం అనాధ అవుతుంది. పిల్లలు నక్సలైట్లు అయిపోతారు.
ఇలా బస్సుల్లోంచీ కిందపడి దెబ్బ తిని తర్వాత చనిపోయి కుటుంబాల్ని అనాధలుగా మిగిలిపోతున్న వారు చాలా మంది ఉన్నారనీ … అందుకే ఇలా ఫుడ్ బోర్డ్ ప్రయాణం చేసే వారికి ముఖ్యంగా లోపల ఖాళీ ఉన్నా వెళ్లకుండా తలుపు దగ్గరే వేళ్లాడుతూ ఎక్కే దిగే వాళ్లని ఇబ్బంది పెట్టే వాళ్లందరికీ బుద్దిచెప్పాలనుకున్నాం అని విక్రమ్ చెప్తాడు.
అందుకే ఫుట్ బోర్డ్ లో అడ్డం పడే వాళ్లందరినీ చంపేయడానికి ఓ సైన్యాన్ని ఏర్పాటు చేశాననంటాడు. ఈ సైన్యం సిటీ బస్సులు ఉన్న ప్రతి ఊళ్లోనూ ఉందని ఇకపై ప్రతి ఊళ్లోనూ ఫుట్ బోర్డు మీద అడ్డంగా నిలబడి ట్రావెల్ చేసేవాళ్లందరినీ చంపేస్తామనీ చెప్తాడు. ఈ ఉపన్యాసం రాజకీయాల్లో వేడి పెంచుతుంది. కేంద్ర కాబినెట్ సమావేశమై దీనిపై ఏం చేయాలనే మేధోమధనం పెడుతుంది. అప్పుడు సిబిఐ ఆఫీసర్ మరో విక్రమ్ రంగంలోకి దిగుతాడు.
అతను అతి కష్టం మీద హంతకుడు విక్రమ్ ను పట్టుకుంటాడు. కోర్టులో కూడా తన ఆర్గ్యుమెంట్ కొనసాగిస్తాడు విక్రమ్ . ఫైనల్ గా అంత మంది చావుకు కారణమైన విక్రమ్ కు ఉరిశిక్ష విధించిన కోర్టు ఇప్పటికైనాప్రభుత్వాలు సిటీ బస్సుల్ని రద్దు చేస్తాయా అని అడిగితే … ప్రభుత్వం సిటీబస్సుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తుంది. ఈ కథతో సినిమా వచ్చే అవకాశం ఉంది నాయనలారా … బీ బ్రేవ్ …
Share this Article