ఆ వార్తలూ ఈ వార్తలూ కెలుకుతుంటే కనిపించింది ఓ రాజకీయ వార్త… అది చూడగానే వైసీపీ క్యాంపు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తోందా ఓ క్షణం అనిపించింది… ఆ వార్త సారాంశం ఏమిటయ్యా అంటే..? రాబోయే తిరుపతి ఉపఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి రంగంలో ఉండే చాన్స్ ఉంది, బహుశా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చు… ఇదీ ఆ వార్త కథ… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలా జరగొద్దు అనేదేమీ ఉండదు… పైపైన అసాధ్యంగా కనిపించినా సరే… టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఒక అభ్యర్థిని బరిలోకి దింపకూడదని ఏమీ లేదు… అసాధ్యం, అసహజం కూడా కాదు… అయితే ఒకవేళ అదే జరిగితే, రాను రాను చంద్రబాబు పరిస్థితి ఏమిటో ఆలోచిస్తే… టీడీపీ మోడీ క్లచెస్లోకి వెళ్లిపోయి, ఘోరంగా నష్టపోవడం పక్కా అనే భావన లీలగా కలుగుతుంది మనకు… 2014లో చంద్రబాబును నమ్మి పొత్తుపెట్టుకున్న బీజేపీ కాదిప్పుడు… అప్పుడంటే బీజేపీలోని ఓ బలమైన ‘తెలుగు పచ్చ లాబీ’ ఈ పొత్తును కుదిర్చింది… కానీ తరువాత చంద్రబాబు అంటే ఏమిటో మోడీకి, అమిత్ షాకు అర్థమైంది… దూరం పెట్టేశారు… ఎంత దూరం అంటే..? వాళ్లను కలవడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నా సరే, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు…
వాళ్ల దృష్టిలో చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు… కానీ రాజకీయాల్లో అందరూ అలాంటోళ్లే కదా… అవసరం కోసం దోస్తీ చేస్తే తప్పులేదు అంటుంది రాజకీయం.., కనీసం అలా దోస్తీ చేయాలన్నా సరే, చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి పెద్దగా ఉపయోగపడే కేరక్టర్ కూడా కాదు… టీడీపీని బీజేపీలో విలీనం చేసేయాలని అడిగితే, చంద్రబాబు అంగీకరిస్తే తప్ప…! చంద్రబాబు ఎలాగూ దానికి ఒప్పుకోడు… ఏమాత్రం పొలిటికల్ స్పేస్ ఏర్పడినా బీజేపీ జొరబడుతుంది… అది చంద్రబాబుకు రాజకీయంగా నష్టం… అందుకని చంద్రబాబుకు వైసీపీతో పోరాటం కంటిన్యూ చేయకతప్పదు… నంబర్ టూ తనే… జగన్కు బలమైన ప్రత్యర్థి తనే… అలాగే ఉండాలి, అలా గాకుండా ఉమ్మడి అభ్యర్థి పేరిట, బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే… ఇక చంద్రబాబు రాజకీయ పతనం ప్రారంభమైనట్టే… అనామకంగా ఉన్న ఓ పార్టీకి నంబర్ టూ పార్టీ దాసోహం అన్నదంటే ఇక డ్యామేజీ పలు కోణాల్లో ఉంటుంది… క్రమేపీ పార్టీ మోడీ చేతుల్లోకి వెళ్లి, పిండి పిండి అయిపోవడమూ ఖాయం…
Ads
ఇక జనసేన అంటారా..? నిజానికి తిరుపతిలో జనసేన మంచి పోటీ ఇవ్వగలదు, కాస్త కష్టపడితే..! కానీ కారణాలేవైనా సరే, బీజేపీ తనే బరిలో ఉండాలని అనుకుంటుంది… అందుకే ఆల్రెడీ బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ అనే ఓ మతనినాదాన్ని వదిలింది… తెర వెనుక బీజేపీ, వైసీపీ దోస్తీ ఎలా ఉన్నా సరే, తిరుపతి తెర మీద ఫైటింగు ఉంటుంది… జగన్ను హిందూద్రోహిగా ముద్ర వేయడానికి బీజేపీ బాగా ప్రయత్నిస్తుంది… అందుకని జనసేన అనివార్యంగా బీజేపీ పోటీకి సై అనకతప్పదు… లేకపోతే బీజేపీ, జనసేన బంధానికి అక్కడి నుంచే బీటలు పడటం ఖాయం… ఆ ఉమ్మడి అభ్యర్థి అనే విషయానికొస్తే… కర్నాటక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ పేరు చెబుతున్నారు చాలామంది… ఆమె కొన్నాళ్లు ఏపీలో కూడా చేసింది… తండ్రి, సోదరుడు, భర్త… అందరూ ఐఏఎస్ అధికారులే… బాగా చదువుకున్న కుటుంబం… బీజేపీ క్యాంపులోనే పనిచేస్తోంది… అభ్యర్థిత్వం మంచిదే కానీ మరో తెలుగు మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు కూడా రైట్ పర్సన్… తేలికగా తీసేయడానికి లేదు… ఎలాగూ టీడీపీ అభ్యర్థిత్వం సందిగ్ధంలో ఉంది, పనబాక లక్ష్మి ఏమీ మాట్లాడటం లేదు… వైసీపీ ఇప్పుడప్పుడే తన అభ్యర్థి ఎవరో చెప్పదు… సో, ఎలా చూసినా… ఎన్ని వోట్లు వచ్చినా సరే… ఆ ఉపఎన్నికలో టీడీపీ బరిలో ఉండకతప్పదు… ఈ విషయం అందరికన్నా చంద్రబాబుకే ఎక్కువ తెలుసు… రాజకీయాల్లో పండిపోయినవాడే కదా…!!
Share this Article