ఈ వార్త నిజానికి ఇంకా ప్రాధాన్యతతో మీడియాలో కనిపించి ఉండాలి… ఈరోజు పత్రికల్లో, న్యూస్ సైట్లలో కనిపించిన అన్ని వార్తల్లోకెల్లా జనానికి చాలా పాజిటివ్‌గా కనెక్టవుతున్న వార్త ఇది… విషయం ఏమిటంటే..? కేరళలో ఉత్తర పాలక్కడ్ జిల్లాకు చెందిన ఈయన ఓ న్యాయవాది… పేరు పి.బాలసుబ్రహ్మణ్యన్ మేనన్… ఆయన ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు… మొన్నటి సెప్టెంబరు 11న ఆ రికార్డు నమోదైంది…
ఒక న్యాయవాదిగా ఇంత రికార్డు కాలం ప్రాక్టీసులో ఉన్నది తనేనట… అదీ విషయం… ఆయన వయస్సు 97… తను 73 ఏళ్ల 60 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు… ఈరోజుకూ తన ఆఫీసుకు వెళ్తాడు… క్లయింట్లను కలుస్తాడు… రోజూ తను ప్రాక్టీస్ చేసే జిల్లా కోర్టుకు వెళ్తాడు… పెద్ద పెద్ద వాదనలకు ఆసక్తి చూపించడు… ఎక్కువగా సివిల్ కేసులు చూస్తాడు… సంక్షిప్తంగా తన వాదనల్ని ముగిస్తాడు… సుదీర్ఘ వాదనలతో ఉపయోగం ఏమీ ఉండదని, పక్కాగా ఆధారాలుంటే స్ట్రెయిట్‌గా కేసు తేలిపోతుందనీ అంటాడు…
అంతకుముందు ఒకాయన 70 ఏళ్లు 311 రోజులు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన రికార్డు ఉండేదట… ఆయన ఆమధ్య ఫిబ్రవరిలో మరణించాడు… ఆ రికార్డును కూడా మన సుబ్రహ్మణ్యం బీట్ చేసేశాడు… సరే, ఇవన్నీ పక్కన పెడితే అబ్బురంగా అనిపించేది ఆయన 97 ఏళ్ల దాకా ‘పనిలో’నే ఉండటం… తన వృత్తి మీద మమకారాన్ని వదలుకోకపోవడం… ఓపిక ఉన్నన్నిరోజులూ, ఆరోగ్యం సహకరించినన్ని రోజులూ ‘పని’ వదలను అంటున్నాడు మొన్న ఓ ఇంటర్వ్యూలో…
Ads
ఎస్, సగటు భారతీయుడి సగటు ఆయుఃప్రమాణం బాగా పెరిగింది… అందులోనూ కేరళలో ఎక్కువ… దానికి కారణాలు చాలా ఉన్నాయి… ఇదేసమయంలో పూర్తి వ్యతిరేక చిత్రం ఏమిటంటే… చిన్న వయస్సులోనే జీవనశైలి వ్యాధులు కమ్ముకొస్తున్న యువతరాన్ని కూడా చూస్తున్నాం… చిన్న వయస్సులోనే బీపీలు, సుగర్లు, ఒబెసిటీ ఎట్సెట్రా… అందుకే చెప్పేది, ఈ నేపథ్యంలో 97 ఏళ్ల ఓ ముసలాయన (ఆమాట అంటే ఒప్పుకోడేమో…) యాక్టివ్‌గా వృత్తిలో ఉండటం అబ్బురమే కదా…
ఈమధ్య చాలామంది ఉద్యోగాల్లో రిటైర్ కాగానే ఇక ఏ పనీ చేయరు… కనీసం తమకు ఆసక్తి ఉన్న ఇతర రంగాల్లో సేవ వైపు దృష్టి పెట్టవచ్చు కదా, అదీ చేయరు… చేసినన్నిరోజులు పనిచేశాం, ఇక మాకు ఒత్తిడి లేని, ప్రశాంత వ్యక్తిగత జీవితం వద్దా అంటుంటారు… అదీ కరెక్టే… కానీ ఇలాంటి ఈ రోజుల్లో తన నల్లకోటును ఆయన అలాగే ప్రేమిస్తున్న తీరు ఆశ్చర్యమే…
‘నా క్లయింట్లకు నా మీద విశ్వాసం ఉన్నన్నిరోజులు, నా ఆరోగ్యం సహకరించినన్నిరోజులు, నా ఒంట్లో ఓపిక ఉన్నన్నిరోజులు కోర్టుకు పోకుండా ఉండను’ అన్నాడు ఓ ఇంటర్వ్యూలో…. సూపర్… ఆయన కుటుంబం, ఆయన చదువు, పిల్లల మీద పెద్దగా సమాచారం కనిపించలేదు, మీడియా కూడా కేవలం గిన్నీస్ బుక్ రికార్డు ఏమిటో చెప్పడానికే పరిమితమైంది… కానీ అనుకోకుండా ఈ ఫోటో కనిపించింది…
తనే పోస్టు పెట్టింది… నా తాతగారే నాకు ప్రేరణ, స్పూర్తి అని రాసుకొచ్చింది ఆయన మనమరాలు యాంకర్ సుమ… ఎలా ఆయన ఆమెకు తాతగారు అనే సమాచారం లేదు గానీ (ఆమె కేరళైట్..) ఆమెకు ప్రేరణ బహుశా ఆయనే కావచ్చు… యాంకరింగ్ మొదలుపెట్టిన తరువాత ఏళ్లు గడుస్తున్నా, వయస్సు మీద పడుతున్నా సరే… స్టిల్, ఆ మొదటిరోజు ఉన్నంత ఉత్సాహమే, ఎనర్జే ఆమెలో ఈరోజుకూ కనిపిస్తుంటుంది… వెరీ లాంగ్ కెరీర్ తెలుగు హోస్టుగా, యాంకర్‌గా… తాతా మనమరాళ్లిద్దరికీ అభినందనలు…
Share this Article