Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గెలిచేది ఎవరో ఓ పార్టీ లీడర్… అంతిమంగా ఓడిపోయేది వోటరు..!!

November 9, 2023 by M S R

The Losers: ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలైనా ఉండవచ్చుగాక. మనల్ను మనం పాలించుకోవడంలో ప్రజాస్వామ్యానికి మించిన మెరుగైన ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకం. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, ధనబలం, భుజబలం లేకుండా, మద్యం పోసి ఓటర్లను మత్తులోకి తోయకుండా జరగాలన్నది ఆదర్శం. అలా జరగడం అసాధ్యం అని అందరికీ తెలుసు. కాబట్టి ఎన్నికల్లో ఎవరు తక్కువ అక్రమాలు, అరాచకాలు, డబ్బు ఖర్చు చేస్తే వారు గొప్పవారుగా చలామణి అయ్యే రోజులొచ్చాయి.

ఓటుకు నోటు
ఓటుకు నోటు మహా నేరం. కానీ రాజకీయ పార్టీలు ఓటుకు విలువకట్టి నోట్లు కుమ్మరించి కొంటునే ఉంటాయి. ఇది డిమాండ్ సప్లై సింపుల్ సూత్రం. ఓటును అమ్ముకునే ఓటర్లు ఉన్నప్పుడు…కొనుక్కునే అభ్యర్థులుంటారు. వైస్ వర్సా కొనగలిగే అభ్యర్థులున్నప్పుడు అమ్ముకునే ఓటర్లుంటారు. ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరిగే పోలీసు తనిఖీల్లో, ఆదాయప్పన్ను దాడుల్లో వందల, వేల కోట్ల నగదు ఎందుకు దొరుకుతుందో అందరికీ తెలుసు. ఆ పేరుతో రోడ్ల మీద సామాన్యుల కష్టార్జితాన్ని కూడా దొంగసొమ్ములా చూసే విషాదం ఇక్కడ అనవసరం.

Ads

ఏ రాజకీయ పార్టీ అయినా అభ్యర్థి చదువు సంధ్యలు, సంస్కారం, సమాజ సేవా దృక్పథం, నేర క్రూర స్వభావం లేకపోవడం లాంటివాటిని పెద్దగా పట్టించుకోదు. ఆ అభ్యర్థి శాసనసభకు పోటీ చేస్తే 20 కోట్లు ఖర్చు పెట్టగలడా? పార్లమెంటుకు పోటీ చేస్తే 50 కోట్లు ఖర్చు పెట్టగలడా? అని చూసి…లెక్కలు పక్కాగా తేల్చుకునే టికెట్టు ఇస్తుంది. 20 నుండి 50 కోట్ల పెట్టుబడి పెట్టి గెలిచే అభ్యర్థి మరి దానిమీద రాబడి చూసుకోకుండా ఎలా ఉంటాడు? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్- ఆర్ ఓ ఐ ఓటరు సమాజం అంగీకరించిన ఎన్నికల వ్యాపార సూత్రం!

మద్యప్రవాహం
ఎన్నికల్లో వేలి మీద చుక్కకు- గొంతులో మద్యం చుక్కలకు దశాబ్దాలుగా ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఓటర్లు ఎంత మత్తులో ఉంటే తమ గెలుపు అంతగా నల్లేరు మీద బండినడకలా సులభం అవుతుందని అభ్యర్థులు ఓటర్లను మత్తులో జోకొట్టడం ఒక ఎన్నికల సంప్రదాయం అని ఓటరు సమాజం అంగీకరించిన ఎన్నికల గెలుపు సూత్రం!

కులం- మతం
కులమతాల చీలికలు, ఉద్వేగాల, విషబీజాల పాచికలు, కుమ్ములాటలు లేకుండా ఎన్నికలు జరగాలన్నది ఆదర్శం. ఓం ప్రథమంగా అభ్యర్థుల ఎంపికే కులాల ఆధారంగా మొదలవుతుంది. ఇక అక్కడి నుండి అడుగడుగునా కులమే కులం. ఎన్నికలకు కావాల్సిందే కులాల కుంపట్ల బహిరంగ సంకుల సమర సూత్రం!

మ్యానిఫెస్టో మాయ
మాకు ఓటేస్తే మేమివి చేస్తాము అని ఎన్నికల ప్రణాళిక(మ్యానిఫెస్టో)ల్లో ఇచ్చే హామీలు అమలు చేయకపోతే ఆ పార్టీని ప్రశ్నించగలిగే వ్యవస్థే లేదు. రుణాలు తీర్చకండి…మేమొచ్చి తీరుస్తాం అని…మ్యానిఫెస్టోలో ప్రకటించి…తీరా గెలిచాక ఆ హామీని గాలికొదిలి…ఆ మ్యానిఫెస్టోను, ఆ వీడియో ప్రకటనను పార్టీ అధికారిక వెబ్ సైట్ నుండి తొలగించినా…కనీసం ప్రశ్నించలేని ప్రజాస్వామ్యం మనది.

కార్పొరేట్ వ్యూహాలు
సమాజం సరిగ్గా పట్టించుకోవట్లేదు కానీ…ఎన్నికల్లో కార్పొరేట్ సంస్కృతి అత్యంత ప్రమాదకరంగా పరిణమించనుంది. ఎలెక్షన్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ లాంటి కొత్త కొత్త పారిభాషికపదాలు పుట్టుకొచ్చాయి. ఉన్న బలాన్ని లేనట్లుగా, లేని బలాన్ని ఉన్నట్లుగా చూపించి మాయలు చేయగలిగే వ్యూహకర్తల వల్ల గెలిచేది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? వ్యూహకర్తలు డబ్బు తీసుకుని అభ్యర్థిని, పార్టీని గెలిపిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా…తరచి చూస్తే వారు ప్రజాస్వామ్యాన్ని గంపగుత్తగా ఓడిస్తున్నారనే నిజం దేవతావస్త్రం కథలోలా ఎప్పుడో, ఏ చిన్న పిల్లాడో అమాయకంగా అడిగేదాకా మనకు కనపడని ఎన్నికల గెలుపు సూత్రం!

ఇంకా ఎన్నెన్నో గెలుపు సూత్రాలున్నాయి కానీ…సభా మర్యాద దృష్ట్యా వాటిని ప్రస్తావించడం కుదరదు. అందరికీ అన్నీ తెలిసినా...రారాజు అంబారీ మీద నగ్నంగా నడిబజారులో ఇలా నిస్సిగ్గుగా ఊరేగుతున్నాడేమని ఎవరూ అడగని ప్రజాస్వామ్య దేవతా వస్త్రం కథ ఇది! – పమిడికాల్వ మధుసూదన్    9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions