యవరాజ్‌సింగ్‌కు బ్రిటిష్ యువతి హాజెల్ కీచ్ పరిచయం అయ్యాక చాలా ఏళ్లు పట్టింది వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడానికి… అసలు మధ్యలో కొన్నేళ్లు వాళ్లు మాట్లాడుకోలేదు, కలవలేదు కూడా… కానీ రాసిపెట్టి ఉంది… తరువాత దగ్గరయ్యారు, ఏళ్ల డేటింగ్ తరువాత ఒక్కటయ్యారు… నేను పంజాబీ కోడలిని అని మురిపెంగా చెప్పుకుంటుంది ఇప్పుడు హాజెల్…
దీన్ని రివర్స్‌లో చెప్పుకుంటే… అంటే ఆ బ్రిటిష్ యువతి ప్లేసులో ఆస్ట్రేలియన్ క్రికెట్ హీరో గ్లెన్ మాక్స్‌వెల్… యువరాజ్ ప్లేసులో మిన్నీ రామన్… మాక్స్‌వెల్ అంటే గతంలో కొందరికే తెలుసు… ఇప్పుడు హీరో… అసలు ఇదెలా సాధ్యం అనే రీతిలో మొన్నటి ఓ ప్రపంచకప్ గేమ్‌లో ఒక్కడే ఒంటిచేత్తో డబుల్ సెంచరీ కొట్టి… అదీ టపటపా 91 లోపే ఏడు వికెట్లు పడిపోయి, ఓటమి అంచుల్లోకి చేరిన సమయంలో… ఆస్ట్రేలియాను గెలిపించిన ఇన్నింగ్స్ నభూతో…
అఫ్‌కోర్స్, సామర్థ్యానికి తోడు అదృష్టం కూడా తోడైంది… అందుకే తనకుతోడుగా కమిన్స్ నిలబడ్డాడు… జస్ట్, తన వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా క్రీజులో ఉన్నాడు, ఇటు మ్యాక్స్‌వెల్ సునామీలాగా విరుచుకుపడ్డాడు… ఎదురుగా ఉన్నది అల్లాటప్పా జట్టేమీ కాదు, ఇప్పుడు భీకరమైన ఫామ్‌లో ఉన్నదే… పైగా తొడ కండరాల నొప్పితో పరుగులు తీయలేక, కేవలం ఫోర్లు, సిక్సులతో అంత స్కోర్ చేయడం మామూలు విషయం కాదు… అందుకే మాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌కు ఇంత ప్రాధాన్యం వచ్చింది క్రికెట్ సర్కిళ్లలో… ఆ హీరో మనకు కొత్తేమీ కాదు… గతంలో కింగ్స్ పంజాబ్ ఎలెవన్ ఐపీఎల్ జట్టులో ఆడినవాడే… తరువాత రాయల్ ఛాలెంజర్‌కు మారాడు… ఓదశలో చాలా ఎక్కువ రేటుకు అమ్ముడుబోయాడు… కానీ అత్యంత ఘోరంగా నిరాశపరిచాడు… దానికీ ఓ నేపథ్యం ఉంది…
Ads
ఇప్పుడేమో చుట్టమైపోయాడు… ఎలా అంటారా..? తన భార్య పేరు విన్నీ రామన్… బేసిక్‌గా వాళ్లది తమిళ కుటుంబం… మెల్‌బోెర్న్‌లో పుట్టింది విన్నీ… ప్రొఫెషనల్ ఫార్మసిస్ట్… పదేళ్ల క్రితం… అంటే 2013లో తొలిసారి ఇద్దరూ ఓచోట అనుకోకుండా తారసపడ్డారు… తను మెల్‌బోర్న్ స్టార్స్‌లో మెంబర్, ఏదో పార్టీ ఈవెంట్‌లో ఈమె కనిపించింది… కానీ తరువాత చాలా ఏళ్లపాటు గ్లెన్ పట్ల ఆమె ఏ ఫీలింగూ కనబర్చలేదు… ఇద్దరి నడుమ ఏమీ లేదు… తన మీద గ్లెన్‌కేమో ఇష్టం పెరిగిపోతూ ఉంది…
ఓరోజు బీచ్‌లో తన ప్రేమను ప్రపోజ్ చేయాలనుకున్నాడు… అప్పటికి పెళ్లి అనే ఆలోచన కూడా లేదు తన మనస్సులో… బీచ్ ప్రపోజల్ కుదర్లేదు… తరువాత ఓ పార్కుకు రమ్మన్నాడు… ఏకాంతంగా కలవాలనుకున్న ప్లేసులో కలయిక కుదర్లేదు… ఛస్, ఎక్కడైతేం ఏంటి అనుకున్నాడు… పార్క్ విజిటర్స్ చాలామంది చూస్తుండగానే మోకాళ్ల మీదకు కూలబడి, ఓ పూవు ఇచ్చి ఐ లవ్ యూ అన్నాడు… విన్నీకి ఇష్టమే… కానీ కులాంతరం, మతాంతరం, ఏకంగా ఖండాంతరం… అసలు పెళ్లి చేసుకుంటాడా..?
మళ్లీ చాలారోజులు తాత్సారం… అయిదేళ్లు గడిచిపోయాయి… ఇక ప్రేమను దాచుకోలేకపోయింది… డేటింగ్‌కు రెడీ అన్నది… 2017 నుంచే తమ ఇద్దరి ఫోటోలు ఇన్‌స్టాలో పెట్టేది… అందరికీ ఆ ప్రేమ అర్థమైంది… తరువాత కొన్నాళ్లకు ‘పెళ్లిచేసుకుందాం మ్యాక్స్’ అంది… సరేనన్నాడు… ఇరు కుటుంబాలూ తప్పనిసరై ఒప్పుకోవాల్సి వచ్చింది… కానీ తన మత సంప్రదాయాల మేరకు ఆమెను క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లిచేసుకున్నాడు… విన్నీ కుటుంబం కోరిక మేరకు హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి… (చైతూ, సమంత పెళ్లిలాగే…)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ కెరీర్ స్థిరంగా ఇలా ఉధృతంగా ఏమీ లేదు… ఎత్తూవంపుల కెరీర్ అది… దాదాపు 14 కోట్లకు అమ్ముడుబోయినా సరే 2021లో గ్లెన్ చాలా పూర్ పర్‌ఫామెన్స్ కనబరిచాడు ఐపీఎల్‌లో… ఆసీస్ జట్టులోనూ అంతే… ఒక దశలో మొత్తం క్రికెట్‌కే దూరమయ్యాడు… తనే చెప్పాడు ఏవో కొన్ని మానసిక సమస్యలు తనను గాడిలో ఉంచడం లేదని… విన్నీ మెడికల్ ఫీల్డ్ కదా… తన ప్రాబ్లం అర్థం చేసుకుంది… మెల్లిమెల్లిగా తనను గాడిలో పడేసింది… తన ప్రేమ ప్లస్ తన ప్రయత్నం… ఫలితం చూశారుగా… భీకరమైన ఆ ఆటను మనందరమూ గమనించాము కదా… అదీ సంగతి…
Share this Article