పదే పదే కేటీయార్, కేసీయార్, హరీష్ సహా చాలమంది పవర్ పార్టీ ముఖ్యులు ఓ మాటంటున్నారు… ఢిల్లీ వాళ్లు కేసీయార్ బొండిగె పిసుకుతరా ఏంది..? ఆ ఢిల్లీ పార్టీలు మనకెందుకు..? మన పార్టీ, మన నాయకుడినే గెలిపిద్దాం… ఢిల్లీ వాళ్లు మాటలు వింటే గోసపడుతం… ఇలా ఉంటున్నయ్ ప్రసంగాలు… ఇదే కాదు, చాలా అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓ పర్‌ఫెక్ట్ విరోదాభాస… అనగా పారడాక్స్…
ఢిల్లీ వాడు రావొద్దు, వాళ్లు టూరిస్టులు… మరి బీఆర్ఎస్ మహారాష్ట్రలో చేస్తున్నదేమిటి..? నువ్వు ఢిల్లీ పాదుషాలని విమర్శిస్తుంటే సగటు మహారాష్ట్రవాసి నిన్ను హైదరాబాద్ నవాబులు అంటే తప్పేమిటి..? అక్కడ నువ్వూ టూరిస్టువే కదా… నాన్ లోకల్ పెత్తనమే కదా… అక్కడ పార్టీలు లేవా..? ఇన్నేళ్లూ అక్కడ జనంతో మమేకమైన నాయకులు లేరా..? నిన్నెందుకు నమ్మాలి, నీకెందుకు వోటేయాలి..?
జాతీయ పార్టీలను నమ్మొద్దు, ప్రాంతీయ పార్టీలే ముద్దు అంటున్నారు కదా… మరి ఓ ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా మార్చి, అసలు ఆత్మను చంపుకున్నదెవరు..? నువ్వూ జాతీయ పార్టీయే కదా… కాకపోతే నాలుగేళ్లలో ఈ కొత్త జాతీయ పార్టీ ప్రస్థానం అడుగు కదిలింది లేదు… తెలంగాణ జనం సొమ్ముతో గల్వాన్ అమరులు, పంజాబ్ రైతుల కుటుంబాలకిచ్చిన చెక్కుల చిట్కాలు కూడా తుస్… డబ్బుతో రాజకీయం నడవదు మాస్టారూ… తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పుట్టింది అని ఓ ప్రకటన… మరి తెలంగాణ పదం పార్టీ పేరు నుంచి ఎందుకు కత్తెర వేయబడింది..?
Ads
ఏం… జాతీయ పార్టీ అనగానే ప్రధాని పదవో, మరొకటో కావాలని కాదు కదా… రేప్పొద్దున లక్ష కోట్ల ప్యాకేజీని తెలంగాణకు తెచ్చుకుంటే తప్పేముంది అంటున్నాడు కేటీయార్… నవ్వొచ్చింది… తెలంగాణ ప్రయోజనాల కోసం జాతీయ రాజకీయాలు అనే మాటే, సూత్రీకరణే ఉత్త హిపోక్రటిక్ ధోరణి… పైగా తమిళనాడు సాధించడం లేదా అనడుగుతున్నాడు… ఎఐడీఎంకే గానీ, డీఎంకే గానీ భారత ఎఐడీఎంకే అని గానీ, భారత డీఎంకే అని గానీ పేరు మార్చుకుని జాతీయ పార్టీలుగా మారలేదు… గాయిగత్తర గప్పాలు కొట్టుకోలేదు… ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలే తప్ప బీఆర్ఎస్‌గా మారడం కాదు…
మాట్లాడితే కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలు అమలు కావు అని మీటింగుల్లో ఎత్తిపొడుస్తున్నారు… కానీ ఆ సిక్స్ గ్యారంటీలకు అనుకరణగా, ఇంకాస్త ఔదార్యం రంగరించి కదా బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందింది… మరి మీ హామీలు ఎలా సాధ్యం అవుతాయి..? ఎంతసేపూ కాంగ్రెస్ మేనిఫెస్టోను తిట్టడం తప్ప మీ మేనిఫెస్టోను జనంలోకి తీసుకుపోయిందెక్కడ..? కేసీయార్ మానవాతా దృక్పథం గొప్పదనీ, గొప్ప ప్రజాస్వామిక ముఖ్యమంత్రి అంటున్నాడు కేటీయార్… హైదరాబాద్ జర్నలిస్టుల పట్ల ఆ మానవతా దృక్పథం ఏమైంది..? సుప్రీంకోర్టు చెప్పినా సరే ఆమోదించని ఆ నయా ప్రజాస్వామ్యం గొప్పదేనా..?
కాలేశ్వరం ప్రాజెక్టును పీసా టవర్‌తో పోల్చాడు కేటీయార్… ఆ పోలిక ఏమిటో ఆయనకు, ఆయన టీంకే తెలియాలి… కేసీయార్ ఈరోజుకూ ఒక్క ముక్క మాట్లాడలేదు… అది లేదు సరికదా, అప్పుడెప్పుడో నెహ్రూయే దళితబంధు తీసుకొస్తే దేశం బాగుపడేదని ఓ విమర్శ… మరి నువ్వు దళితబంధును సంతృప్త స్థాయిలో ఎందుకు అమలుపరచడం లేదు..? బీసీ బంధు ఏమైంది..? రైతుబంధు ప్రపంచం ఎరుగని గొప్ప పథకం అంటున్నావు సరే, మరి నిజంగా ప్రాణాలనే పణంగా పెట్టి వ్యవసాయం చేసే కౌలు రైతులకు ఎందుకు వర్తించదు..? కర్నాటకలో కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే ఆ రైతులు తెలంగాణకు వచ్చి పెయిడ్ ధర్నాలు చేయడం దేనికి..? చంద్రబాబు అరెస్టు ఆందోళనలు హైదరాబాదులో చేయకూడదట గానీ కర్నాటక రైతులు మాత్రం కరెంటు ధర్నాలు చేయొచ్చునట…
అప్పుడెప్పుడో తెలంగాణను ఆంధ్రలో కలిపి చారిత్రిక ద్రోహం చేసిందంటూ కాంగ్రెస్‌ను తిట్టేస్తున్నారు కేసీయార్ సహా పవర్ పార్టీ నేతలంతా… కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి, తమ పార్టీలోనే ఎందుకు వ్యతిరేకించినా సరే తెలంగాణను ఇచ్చింది కాంగ్రెసే కదా… సపోర్ట్ చేసింది బీజేపీయే కదా… తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆ రెండు పార్టీలనూ నిందించడం దేనికి..? అవి ఔట్‌రైట్‌గా సంకల్పించకపోతే తెలంగాణ వచ్చేదా..? దిగ్విజయ్ పైత్యంతో చెడిపోయింది గానీ లేకపోతే ఆ కాంగ్రెస్‌లోనే కేసీయార్ తన పార్టీని విలీనం చేసి, డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో తనూ ఒకడు అయిపోయి ఉండేవాడు కాదా..? చెబుతూ పోతే బోలెడు… విరోదాభాస రాష్ట్ర సమితి…!!
చివరగా… న్యూస్ పేపర్ న్యూస్ పేపర్‌లాగా ఉండాలి, కానీ వ్యూస్ పేపర్‌గా ఉండకూడదు అన్నాడు కేటీయార్… మీ ఇంటిపత్రిక నమస్తే తెలంగాణ ఏ కేటగిరీ సారూ…? దానికి ఈ సూత్రం వర్తించదా..? పోనీ, సాక్షి ఏ కేటగిరీ సారూ..? కనీసం ఆంధ్రజ్యోతి, ఈనాడు పొలిటికల్ లైన్ తెలుగుదేశమే అయినా అందరి వార్తలూ కవర్ చేస్తారు..!
Share this Article