పొద్దున్నే లేస్తాం. పనుల మీద రకరకాల ఆఫీసులకు వెళ్తాం. రాత్రి ఇంటికి చేరుకుంటాం. మధ్యలో ఫోన్లు, ఇంటర్‌నెట్ ఉన్నచోట బ్రౌజింగ్. సినిమాలు, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు. కొందరివి జీవనపోరాటాలు. మరికొందరివి ఆనందాల కేరింతలు. కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ క్షణాన ఈ పోస్ట్ చదివే సమయంలో ఎక్కడో ఒక చోట ఒక బాలుడు తన తల్లి కోసం కలవరిస్తూ ఉంటాడు. ఎక్కడో ఓ చిన్నారి అమ్మ కావాలని, అమ్మను చూడాలని అలమటిస్తూ ఉంటుంది. తమవి కాని స్థలాల్లో తమకు చెందని బతుకులు బతుకుతున్న వాళ్లంతా అనాథలు కాదు. అమ్మానాన్నలున్నవారే! కానీ అనేక రకాలుగా వారి నుంచి విడివడ్డవారు. దూరంగా బతుకుతున్నవారు. ఎందుకు? ఏమిటి కారణం!?
1990ల తర్వాత భారతదేశం కొత్త రూపు సంతరించుకొంది. ఆ రూపం పేరు ప్రపంచీకరణ (Globalization). పల్లెలు ఖాళీ అయ్యి పట్టణాలు రద్దీగా, మహా రద్దీగా మారిన మారిన సమయం అది. ఏ కాస్త ఖాళీ జాగా దొరికినా అక్కడో అపార్ట్‌మెంట్ వెలిసింది. ఏ కొంచెం భూమి దొరికినా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ తయారైంది. ఆకలి.. ఆశ.. ఆరాటం.. ఏదో సాధించాలనే తపన. పందెంలో ఎదుటివారికంటే ముందుకు వెళ్లాలనే కోరిక. తమ పనులు తాము చేసుకోలేని ధనిక, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు సహాయకులు కావాల్సి వచ్చింది. అచ్చంగా చెప్పాలంటే పనిమనుషులు. కానీ వాళ్లకు విపరీతమైన డిమాండ్. రకరకాల షరతులు. దాన్ని అధిగమించేందుకు వారు పల్లెల వైపు చూశారు. కరువుతో అల్లాడే పల్లెల్లోని పేదలు తమ పిల్లల్ని ఆ ఇళ్లకు దాసీలుగా సరఫరా చేశారు. కాదు.. అలా చేయాల్సిన పరిస్థితిని ధనిక, ఎగువ మధ్యతరగతి ప్రజలు కల్పించారు. నెల జీతం, మూడు పూటలా తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండేందుకు చోటు. ఇవన్నీ చూపించి ఆశ పెట్టారు. అలా పట్టణాలకు పెద్ద ఎత్తున పసిపిల్లలు రవాణా చేయబడ్డారు.
పదేళ్ల పిల్లల మనసులో ఏముందో మనకేమైనా తెలుసా? ఎపుడైనా ఉహించామా? అమ్మ లేని చోట, అమ్మ కనిపించని చోట, పిలిస్తే అమ్మ పలకని చోట ఆ పిల్లలు ఎంత నరకం చూస్తారో తెలుసా? పూరి గుడిసెలో ఉన్నా సరే అమ్మ ఒడిలో దొరికే ధైర్యం, తృప్తి, సంతోషం ఆ పెద్ద భవంతుల్లో దొరుకుతుందా? దాసిగా మారి ఆ ఇంటికి సేవలు చేసి అలసిపోయిన తర్వాత సేద తీరాలని ఉన్నప్పుడు పక్కన అమ్మ లేదనే బాధ వాళ్ల గుండెని ఎంత మెలిపెడుతుందో ఊహించగలరా? సరిగ్గా ఈ అంశాన్నే కథగా రాసుకున్నారు దర్శకురాలు జానకీ విశ్వనాథన్. ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి ఆమెకు రచనా సహకారం అందించారు. కథ పూర్తయింది. అది కథ కాదు, ఎంతోమంది చిన్నారుల విషాద జీవితం. అప్పటికే జాతీయ ఉత్తమ బాలనటి పురస్కారం అందుకున్న పి.శ్వేత చేత ఆ సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు. ఆ సినిమా పేరు ‘కుట్టీ’. దర్శకురాలిగా జానకీ విశ్వనాథన్‌కు అది తొలి చిత్రం.
Ads
మదురై అవతల ఒక పల్లెటూరిలో పెరిగిన పదేళ్ల చిన్నారి కన్నమ్మ. నిరుపేద కుటుంబం. తండ్రి చనిపోయాడు. తల్లి లోకం తెలియని అమాయకురాలు. కుటుంబాన్ని ఎలా పోషించాలి? కన్నమ్మని చెన్నైలో ఒక ఇంట్లో పనిమనిషిగా కుదిర్చారు. ఊర్లో ఏముందని? కనీసం ఆ పిల్ల అక్కడైనా నాలుగు మెతుకులు తింటూ, నాలుగు మంచి బట్టలు కట్టుకుని సుఖంగా ఉంటుంది అనుకున్నారు. కానీ తను వెళ్లింది ఆ ఇంటి పనిమనిషిగా! తనకు ఎంత గౌరవం, ప్రేమ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాలా? యజమాని, ఆయన భార్య మంచివారే! కానీ యజమాని తల్లి గయ్యాలి. యజమాని కొడుకు కన్నమ్మ ఈడు వాడే, కానీ అల్లరిలో ఘనుడు. ఇటువంటి వాళ్లు ఉన్న ఇంట్లో ఆ చిట్టితల్లి పరిస్థితి కనాకష్టంగా మారింది. పాచిపోయిన అన్నం తినాలి. ఇంటెడు చాకిరీ చేయాలి. చెప్పింది చెయ్యకపోతే ముసలావిడ తిడుతుంది. కొడుతుంది. మరీ కోపం వస్తే వాతలు కూడా పెడుతుంది. ఆమె మనవడిదీ అదే తీరు. క్షణమొక బాధ, రోజొక నరకం కన్నమ్మకి.
ఈ బాధలు తట్టుకోలేక తనను అక్కడి నుంచి తీసుకువెళ్లి పొమ్మని తల్లికి ఉత్తరం రాయాలని అనుకుంటుంది. కానీ తనకు చదువేదీ? పోనీ ఎవరిచేతనైనా రహస్యంగా రాయిద్దాం అనుకున్నా ఇంటి చిరునామా ఏమిటి? తన ఊరేదో, ఎక్కడ ఉందో, ఆ ఊరిలో తన ఇల్లున్న వీధి ఏదో కూడా తెలియని అమాయకురాలు ఆ చిన్నారి. ఇక ఉత్తరం ఎలా రాస్తుంది? ఇంట్లో ముసలావిడ, ఆమె మనవడు పెట్టే బాధలు తాళలేక చివరికోరోజు ఆ ఇల్లు విడిచిపెట్టి బయటకు వస్తుంది. రైలెక్కి తన ఊరు వెళ్లాలి అనుకుంటుంది. మధ్యలో ఎవరో వ్యక్తి కలిశాడు. నిన్ను భద్రంగా మీ ఊరు చేరుస్తానని నమ్మబలికి రైలు ఎక్కించాడు. కన్నమ్మకి ఆనందం. మనసంతా సంతోషం. తొందరలో తన ఊరికి వెళ్తాను. అమ్మను చూస్తాను. ఆమె ఒడిలో పడుకొని ఏడుస్తాను. ఇవే ఆలోచనలు. కానీ వాస్తవం మరోలా ఉంది. తను ఎక్కిన రైలు చేరేది ముంబయికి. ఆమెను ఆ రైలు ఎక్కించిన మనిషి తనని ఓ బ్రోకర్‌కి అమ్మేశాడు. ఎందుకో చెప్పాలా? ఆ వాస్తవం వెనుక విషాదం వివరించాలా? ముంబయి కామాటిపుర కన్నీటి కథలన్నీ అప్పజెప్పాలా?
2002లో కేవలం 20 రోజుల్లో రూ.70 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా తమిళ సినిమాల్లో ఒక న్యూవేవ్ బాలల చిత్రంగా పేరు పొందింది. ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ ఈ సినిమాలో కిరాణా కొట్టు యజమానిగా కరుణరసాత్మక పాత్ర పోషించిన విషయాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో కన్నమ్మగా నటించిన పి.శ్వేతకి రెండోసారి జాతీయ ఉత్తమ బాలనటి పురస్కారం లభించింది. బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణాల నేపథ్యంలో సినిమా తీసి, వీక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసినందుకు మెచ్చుకుంటూ దర్శకురాలు జానకీ విశ్వనాథన్‌కి జ్యూరీ ప్రత్యేక పురస్కారం అందించారు. అదే ఏడాది గొల్లపూడి శ్రీనివాస్ ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలి పురస్కారం ఆమెకు దక్కింది.
భారతదేశంలో ప్రస్తుతం బాలల అక్రమ రవాణా చాలా హెచ్చుస్థాయిలో ఉందని ఇటీవలి నివేదికలు చూస్తే తెలుస్తుంది. 2016తో పోలిస్తే 2022 నాటికి బాధితుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని ‘Kailash Satyarthi Children’s Foundation'(KSCF) రూపొందించిన నివేదికతో తెలిసింది. కొవిడ్ కారణంగా అనేకమందికి జీవనోపాధి పోవడంతో ఆ కుటుంబాల కోసం భారీ స్థాయిలో బాలలు పనుల్లో చేరారని ఈ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా బాలల అక్రమ రవాణా జరుగుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం.
ఒక్కసారి మీ ఊరి బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో ఒంటరిగా, అమాయకంగా కనిపించే చిన్నారులను చూడండి! పరికించి, పరిశీలించి నిదానంగా చూడండి. వాళ్లు మళ్లీ మీకు కనిపించకపోవచ్చు. మీరు కనీసం ఊహించలేని చోటికి ఎవరో వాళ్లని రవాణా చేస్తారు. ఇవాళ కాకపోతే రేపు.. రేపు కాకపోతే మరో రోజు. బాలలకు ఏమాత్రం భద్రత లేని కాలం ఇది. పోలీస్‌స్టేషన్లలో వేలాదిగా పేరుకుపోయిన Child Missing కేసులే ఇందుకు ఉదాహరణ. వారంతా ఏమై ఉంటారు? ఈ క్షణాన ఏం చేస్తూ ఉంటారు? ఊహిస్తూ ఉంటే గుండె అంతా బాధతో నిండిపోతోంది. ఎందరు కన్నమ్మలు.. నిండా ఎన్ని విషాదాలు! ఈ చిత్రం యుట్యూబ్‌లో అందుబాటులో ఉంది. సబ్‌టైటిల్స్ లేవు. అయినా మీరు చూడొచ్చు. చూడాలి కూడా! విషాదానికి భాషతో సంబంధం ఏముంది? – విశీ
Share this Article