ఈరోజు తీసేస్తే… పోలింగ్ ముందు రోజు తీసేస్తే… ఇక మిగిలింది మహా అంటే 12 రోజులు… చాలా తక్కువ సమయమే ఉంది… ఏ బరిలో ఎవరు పోటీదారులో ఖరారై పోయింది… సో, ప్రచారానికి ఇదే కీలకదశ… పోలింగ్‌కు ముందు 2, 3 రోజులు ‘పోల్ మేనేజ్‌మెంట్’ అనబడే ప్రలోభపర్వం ఉంటుంది… అంటే పదిరోజులు లెక్కపెట్టుకోవాలి…
ఎస్, ప్రచారంలో బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది… పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగులే కాదు, సోషల్ మీడియాలో ప్రకటనలు, చివరకు మెట్రో స్టేషన్లలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ఎయిర్ పోర్టులో బిల్ బోర్డుల దాకా ప్రచారానికి అనువైన ఏ వేదికనూ వదల్లేదు… కేసీయార్ మామూలు రోజుల్లో జనంలోకి ఎక్కువగా రాడు… కానీ ఇప్పుడు అవసరం కదా, విస్తృతంగా ప్రజాశీర్వాద బహిరంగ సభల్లో పాల్గొంటున్నాడు… కాళ్లకు చక్రాలు కట్టుకున్నాడు…
తనకుతోడు కేటీయార్ టీవీ ఇంటర్వ్యూలు, సభలు.., ప్రచారానికి ఉపయోగపడే ప్రతి వేదికనూ వాడుకుంటున్నాడు… చివరకు ఆ గంగవ్వతో వంటావార్పు సహా… కేటీయార్‌తో పోలిస్తే హరీష్ సభలు తక్కువే అయినా ఆత్మీయ సమ్మేళనాలు, మీడియా ఇంటర్వ్యూలతో తనూ ప్రచార ప్రయాసను భరిస్తున్నాడు… కవిత పెద్దగా తెర మీద కనిపించడం లేదు… సంతోష్ అస్సలు తెర మీదే లేడు… ప్రచారంలో టీన్యూస్, నమస్తే తెలంగాణ సరేసరి…
Ads
ఈలెక్కన కాంగ్రెస్ కాస్త వెనకబడినట్టే లెక్క… రేవంత్ రెడ్డి సభలకు వస్తున్న మైలేజీ, ప్రయారిటీ ఇంకెవరి సభలకూ రావడం లేదు… తనొక్కడే రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నాడు… రాహుల్ గాంధీ వస్తున్నాడు… సోనియా సహా కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యలంతా తెలంగాణ ప్రచారానికి సై… కాకపోతే సీఎం సీటుకు పోటీపడే నాయకులెవరూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నది లేదు… రేవంత్‌కు ఈ విషయంలో పెద్ద పోటీ లేదు… ఒకవైపు కామారెడ్డిలో సీఎంపై పోటీ, మరోవైపు సొంతస్థానం కొడంగల్‌లో పోటీ… ఐనాసరే ఇతర సీట్లలో ప్రచారానికి బాగానే ప్రయాసపడుతున్నాడు…
తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు నిద్రాహారాలు మాని బాధపడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీ దిక్కుమాలిన ఏదో ఎత్తుగడ కోసం తెలంగాణలో ఏడో ఎనిమిదో స్థానాల్లో పోటీచేస్తున్నాడు… అసలు బీజేపీయే కొద్దిరోజులుగా గణనీయంగా బలహీనపడిపోయింది… ఆ బీజేపీ సపోర్టుతో ఒకటోరెండో సీట్లు గెలుచుకోవాలని పవన్ తాపత్రయం… కానీ సభల్లేవు, ప్రచారం లేదు, జనంలోకి వచ్చింది లేదు… కనీసం తనకు అలవాటైన ఆ ట్వీట్లు కూడా లేవు… ఫాఫం… పార్టీని నడిపించడం అంటే మాటలు కాదు బ్రో…
బీజేపీ ఇంతకన్నా మెరుగ్గా ఏమీ లేదు… ఆయా అభ్యర్థుల సొంత ప్రచారాలే తప్ప పెద్దగా నాయకులెవరూ జనంలో తిరుగుతున్న వార్తల్లేవు… మీట్ ది ప్రెస్, ప్రెస్‌మీట్లు గాకుండా విస్తృతంగా జనంలోకి ప్రచారం పోవడం లేదు… మోడీ వచ్చిన రెండు సందర్భాలు తప్ప జాతీయ నాయకత్వం కూడా పెద్దగా తెలంగాణ బరిని పట్టించుకోవడం లేదు… అసలు ఇప్పటికి పార్టీ మేనిఫెస్టో లేదు… ఏదో ఇస్తినమ్మ వాయినం అన్నట్టుగా ఉంటినమ్మ పోటీలో… తనను తాను తగ్గించుకుని కేసీయార్‌ను హెచ్చించే పరోక్ష స్నేహ సహకారం…
బీఎస్పీ ప్రవీణ్ తిరుగుతూనే ఉన్నాడు… షర్మిల ఎప్పుడో చేతులెత్తేసింది… చంద్రబాబు పోటీకి నో అన్నాడు, కానీ టీడీపీ శ్రేణులు తమ బాస్‌కు మిత్రుడైన రేవంత్ కోసం కాంగ్రెస్ సభల్లో జెండాలతో సహా పాల్గొంటున్న వార్తలు, ఫోటోలు కనిపిస్తున్నాయి… సోషల్ మీడియా ఫేక్ పోస్టులు, ప్రచార పోస్టులు, యాడ్స్, ఇంటర్వ్యూలతో పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు… సభలు, రోడ్ షోలే ముఖ్యం… ఆయా ఏరియాల్లో పార్టీ శ్రేణులు యాక్టివేట్ అవుతాయి, జనంలో చర్చ జరుగుతుంది… ఆ యాక్టివిటీని మించింది లేదు… ఈ కోణంలో మాత్రం బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది… తన సాధనసంపత్తిని గరిష్ఠ స్థాయిలో వినియోగిస్తోంది…!
Share this Article