ఇంతకీ అయోధ్య గుడి నిర్మాణం మీద టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటి…? విజయశాంతి అడిగింది, డీకే అరుణ అడిగింది… రాజాసింగ్ అడిగిండు… ఢిల్లీ నుంచి వచ్చాక బండి సంజయ్ అడుగుతాడు, అర్విందూ అడుగుతుండు… ఎందుకంటే..? కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ బీజేపీ చందా వసూళ్ల మీద ఏవో కామెంట్లు చేసి, తరువాత సారీ చెప్పాడు… కానీ అంతకన్నా సీరియస్ కామెంట్లు చేసిన చల్లా ధర్మారెడ్డి సారీ చెప్పలేదు.., దాదాపు 57 మంది బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించారు వరంగల్ పోలీసులు… ధర్మారెడ్డి మాటల్ని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ తదితరులు సమర్థించారు… బీజేపీ చందాల బుక్కుల లెక్కను బరాబర్ అడుగుతాము అంటున్నాడు ఎర్రబెల్లి… భద్రాచలంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేంద్రం కుట్ర అంటూ విమర్శలు చేశాడు… కడియం శ్రీహరి అయితే ఏకంగా… ధర్మారెడ్డి మాటే మా పార్టీ మాట అన్నాడు… ఇక కేటీయార్ అయితే మా ఓపిక నశిస్తే బయట తిరగలేరు జాగ్రత్త అని బీజేపికి హెచ్చరిక జారీ చేశాడు… సో, ఏతావాతా అర్థమయ్యేది ఏమిటి..? అయోధ్య ఇష్యూ మీదే బీజేపీని కౌంటర్ చేయాలని ఫిక్సయిపోయారన్నమాట…!
ఒక పార్టీ రాముడి గుడి కోసం చందాలు వసూలు చేసుకుంటుంటే… భక్తులు స్వచ్ఛందంగానే చందాలు ఇస్తుంటే… టీఆర్ఎస్కు వచ్చిన నొప్పి ఏమిటి..? ప్రజల చందాలకు టీఆర్ఎస్ పార్టీ జిమ్మేదారీయా..? ఏమైనా అక్రమాలు జరిగితే బీజేపీ, వీహెచ్‌పీ, మందిర నిర్మాణ ట్రస్టు చూసుకుంటాయి కదా… మరెందుకు టీఆర్ఎస్ పార్టీ రామమందిర నిర్మాణానికి వ్యతిరేకం అనే ముద్ర వేయించుకుంటోంది..? యాంటీ-హిందూ అనే ముద్ర దేనికి..? లోకసభ ఎన్నికలవేళ కేసీయార్ మాటతూలి రావణజన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, బొందుగాళ్లు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ బీజేపీ గుర్తుచేస్తూనే ఉంటుంది… కారును ఒవైసీ నడిపిస్తున్నాడు, ఒవైసీకి రాముడి గుడి ఇష్టం లేదు, అందుకే కేసీయార్‌కూ ఇష్టం లేదు నే బీజేపీ నేతల తాజా విమర్శలకు టీఆర్ఎస్ నుంచి స్పష్టమైన జవాబు లేదు…
Ads
మొన్న గ్రేటర్ ఎన్నికల్లో హిందూ వోటు సంఘటితమైన తీరు, కేసీయార్‌ను హిందూ వ్యతిరేకిగా ప్రజలు భావించిన తీరు టీఆర్ఎస్ మరిచిపోయి ఉంటుంది… సమయానికి సెటిలర్లు ఆదుకోకపోతే పరాజయం ఇంకా తీవ్రంగా ఉండేది… ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటు వోట్లు కురిపించదు… పార్టీ రాజకీయ ధోరణి, ప్రభుత్వ పనితీరే ప్రధానం… ఈ స్థితిలో బీజేపీ తెలంగాణను మతరాజకీయం వైపు లాక్కుపోతోంది… టీఆర్ఎస్ మీద హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేస్తోంది… దానికి బలం చేకూర్చేలా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆజ్యం పోస్తున్నారు… అంటే, అయోధ్య ఇష్యూ మీదే బీజేపీని కౌంటర్ చేస్తామనే ధోరణి కనిపిస్తోంది… బోలెడుమంది మీద కేసులు పెట్టారు, యాంటీ-హిందూ ముద్రపడినా పర్లేదు అన్నట్టుగా దూకుడు కనబరుస్తోంది టీఆర్ఎస్… రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో ఫైట్ తప్పదు…
సో, ఈ స్థితిలో బండి సంజయ్ మౌనంగా ఉండలేడు… ఢిల్లీ వెళ్లొచ్చాక మౌనంగా ఉండిపోయిన ప్రపంచంలోకెల్లా పెద్ద హిందువు కేసీయార్ నిజంగానే అయోధ్యపై నెగెటివ్ స్టాండ్ తీసుకున్నాడా..? తన మౌనాంగీకారం లేనిదే కొడుకు, పార్టీ ముఖ్యులు బీజేపీతో అయోధ్య ఫైట్ ప్రారంభించారా..? మోడీ, అమిత్ షా ఏం చేసుకుంటారో చేసుకోనీ అని నిజంగానే ధైర్యంగా, స్థిరంగా నిలబడి కొట్లాడతాడా..? బీజేపీవాళ్లు దొంగలు, వాళ్లకు గుడి చందాలు ఇవ్వకండి అని పార్టీ పిలుపునివ్వగలదా..? మాకు కావల్సిందీ అదే అంటూ బీజేపీ కూడా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేస్తుందా..? ఇక అయోధ్య రాముడి గుడి ఇప్పుడు తెలంగాణలో రాజకీయ చిచ్చును మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చేస్తుందా..? రామా… కనవేమిరా..?! అవునూ… శ్రీహరి సార్… అణగారిన వర్గాలపై విషపువ్యాఖ్యలు చేసిన ధర్మారెడ్డి మాటల్ని కూడా పార్టీ మాటలుగానే తీసుకోవాలా సార్… సారీ చెప్పినా సరే… ఎస్సీ, ఎస్టీ, బీసీ సెక్షన్లు సోషల్ మీడియాలో ఎలా విరుచుకుపడుతున్నాయో చూశారా సార్… రాముడికి నోరు లేకపోవచ్చు, కానీ దళితులకు ఇప్పుడు నోళ్లున్నయ్… గోళ్లున్నయ్…!!
Share this Article